
పెళ్లిచేసుకుంటానని మోసం చేసిన ప్రేమికుడు
యువకుడి ఇంటి ఎదుట ధర్నా,
అట్రాసిటీ కేసు నమోదు
హైదరాబాద్: ప్రేమించానని ఏడేళ్లుగా వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి, యువతి నిశ్చితార్థాన్ని సైతం రద్దు చేయించాడు. ఆపై ముఖం చాటేశాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధిత యువతి, మహిళా సంఘాల సహాయంతో కుటుంబ సభ్యులతో కలిసి యువకుడి ఇంటి ఎదుట ధర్నా చేశారు.
ఈ సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితులు, ఇన్‌స్పెక్టర్ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లెలగూడకు చెందిన ఓ యువతి(28) ని మీర్‌పేట ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్ కాలనీకి చెందిన పూర్ణేశ్వర్‌రెడ్డి(28) ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని గతంలో ఆమె నిశ్చితార్థాన్ని రద్దు చేయించాడు. ఆమెతో చనువుగా ఉంటూ.. ఇంట్లో వారికి, బంధువులకు పరిచయం చేశాడు.
కానీ ఆ తరువాత యువకుడికి గుట్టుచప్పుడు కాకుండా.. మరో యువతితో పెళ్లి చూపులు జరిగాయి. విషయం తెలుసుకున్న యువతి నిలదీయడంతో కులం వేరు కావడంతో మా ఇంట్లో ఒప్పుకోవడం లేదని సమాధానం చెప్పాడు. దీంతో సదరు యువతి న్యాయం చేయాలంటూ ఆదివారం పూర్ణేశ్వర్‌రెడ్డి ఇంటి ఎదుట బంధువులతో కలిసి ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు.. యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధిత యువతి ఫిర్యాదు మేరకు ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment