సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు చేసి మళ్లి నిర్వహించాలన్న పిటిషన్‌పై విచారణ చేప్పట్టిన టీఎస్ హైకోర్టు.. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసింది. జూన్ 11వ తేదీన జరిగిన ఈ పరీక్ష రద్దు చేసి మళ్లి నిర్వహించాలని TSPSCని కోర్టు ఆదేశించింది.
తెలంగాణలో 503 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించిన విషయం తెల్సిందే. టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 పోస్టులకు మొత్తం 3.80 లక్షల మందికి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 2,32,457 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైన విషయం తెల్సిందే. ఇప్పటికే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను లీకేజీ కారణాల వలన ఒకసారి రద్దు చేసి మళ్ళీ జూన్ 11వ తేదీన నిర్వహించారు. ఇప్పుడు ఇది రెండవ సారి రద్దు అవ్వడం.
ఇదీ చదవండి: బీఆర్‌ఎస్‌కు షాక్.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీపై కేసు నమోదు
రాష్ట్రంలో గ్రూప్–1 పరీక్ష నిర్వహణపై ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని టీఎస్‌పీఎస్సీపై హైకోర్టు గతంలో ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. గ్రూప్–1 ప్రిలిమ్స్ నిర్వహణ సమయంలో అభ్యర్థుల బయోమెట్రిక్ ఎందుకు తీసుకోలేదని.. ఓఎంఆర్ షీట్లపై హాల్‌టికెట్ నంబర్, అభ్యర్థుల ఫొటో ఎందుకు లేదని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ జూలైకి వాయిదా వేసిన విషయం తెల్సిందే.
జూన్ 11న టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమ్స్ సందర్భంగా అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోలేదని, ఇది అక్రమాలకు తావిచ్చేలా ఉందని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించేలా ప్రభుత్వాన్ని, టీఎస్‌పీఎస్సీని ఆదేశించాలంటూ గ్రూప్–1 అభ్యర్థులు బి.ప్రశాంత్, బండి ప్రశాంత్, జి.హరికృష్ణ పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ పి.మాధవీదేవి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది గిరిధర్‌రావు వాదనలు వినిపించారు. ఒకసారి లీకేజీ జరిగి మళ్లీ నిర్వహిస్తున్న గ్రూప్–1 ప్రిలిమ్స్ విషయంలోనూ పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన కమిషన్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు.
వాదనలు ఇలా జరిగాయి
టీఎస్‌పీఎస్సీ తరఫున స్టాండింగ్ కౌన్సెల్ ఎం.రాంగోపాల్ వాదనలు వినిపించారు. బయోమెట్రిక్ విధానం కోసం రూ. కోటిన్నర వరకు ఖర్చు అవుతుందన్నారు. అలాగే దాదాపు 10 లక్షల హాల్‌టికెట్లపై నంబర్, ఫొటోలను ముద్రించడానికి కూడా రూ. కోట్లలో వెచ్చించాల్సి వస్తుందన్నారు. పరీక్షకు హాజరుకాని వారి విషయంలోనూ ఈ చర్యలు చేపట్టాల్సి వస్తుందని.. దీంతో ప్రజాధనం వృథా అవుతుందని చెప్పా రు. అభ్యర్థి చూపించిన ఆధార్, పాన్, ఓటర్ కార్టు లాంటి గుర్తింపు కార్డులను ఇన్విజిలేటర్ ధ్రువీకరించాకే పరీక్షకు అనుమతించారని చెప్పారు.
పరీక్ష సమయంలో ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టాలన్నది టీఎస్‌పీఎస్సీ విచక్షణాధికారమన్నారు. గ్రూప్–1 ప్రిలిమ్స్‌కు 3.8 లక్షల మంది అభ్యర్థు లు హాజరయ్యారని, వారి నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేవన్నారు. కేవలం ముగ్గురు అభ్యర్థులే కోర్టును ఆశ్రయించారని పేర్కొన్నారు. ఈ వాదనలను ధర్మాసనం తప్పుబట్టింది. 2022 అక్టోబర్‌లో గ్రూప్–1 ప్రిలిమ్స్ నిర్వహించే సమయంలో అన్ని చర్యలు పకడ్బందీగా తీసుకొని.. ఈ నెల 11న మా త్రం ప్రజాధనం వృథా అవుతుందని చర్యలు తీసుకోలేదని చెప్పడం సరికాదని పేర్కొంది. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించడం టీఎస్‌పీఎస్సీ బాధ్యత అని, నగదు గురించి ప్రస్తావన అవసరం లేనిదని వ్యాఖ్యానించింది
Comments
Please login to add a commentAdd a comment