బురదచల్లి బద్‌నామ్‌ చేస్తున్నారు.. కేంద్రంపై మంత్రి హరీశ్‌రావు ధ్వజం | Harish Rao Slams Central Govt | Sakshi
Sakshi News home page

బురదచల్లి బద్‌నామ్‌ చేస్తున్నారు.. కేంద్రంపై మంత్రి హరీశ్‌రావు ధ్వజం

Published Fri, Sep 30 2022 4:23 AM | Last Updated on Fri, Sep 30 2022 2:57 PM

Harish Rao Slams Central Govt - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఢిల్లీలో అవార్డులు ఇవ్వడం, గల్లీలో అవాకులుచెవాకులతో రాజకీయం చేయడం కేంద్ర మంత్రులకు అలవాటుగా మారిందని ఆర్థిక, వైద్యశాఖల మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. పార్లమెంట్‌లో వివిధ సందర్భాల్లో తెలంగాణ పథకాలకు కేంద్ర మంత్రుల ప్రశంసలు కరెక్టా? లేదా గల్లీల్లో వారు చేసే విమర్శలు కరెక్టా? అని ప్రశ్నించారు. పార్లమెంట్‌ సాక్షిగా ఫ్లోరైడ్‌రహిత రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని కేంద్రం చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.

ఆర్థిక విషయాల్లో కాగ్, నీతి ఆయోగ్, ఇతర కేంద్ర సంస్థలు అవార్డులు, రివార్డులిచ్చి ప్రశంసిస్తుంటే కేంద్ర మంత్రులు అవినీతి జరిగిందని, అభివృద్ధి జరగ లేదని ఇష్టారీతిన మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రెండు రోజులకొక కేంద్ర మంత్రి ఇక్కడికొచ్చి టీఆర్‌ఎస్‌ సర్కార్‌పై బురద చల్లి బద్‌నామ్‌ చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. హరీశ్‌ గురువారం పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయా కర్‌రావు, ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, మిషన్‌ భగీరథ ఈఎన్‌సీ కృపాకర్‌రెడ్డిలతో కలిసి మీడియాతో మాట్లా డారు. జాతీయస్థాయిలో తెలంగాణకు వచ్చిన మిషన్‌ భగీరథ అవార్డుతోనైనా వారికి కనువిప్పు కావాలన్నారు. 

పథకాలను కేంద్రం కాపీ కొట్టింది...
తెలంగాణలోని పథకాలను హర్‌ఘర్‌జల్, అమృత్‌ సరోవర్, పీఎం కిసాన్‌ సమ్మాన్, వెటర్నరీ క్లినిక్‌ పేరిట కేంద్రం కాపీ కొట్టిందని హరీశ్‌ చెప్పారు. పెద్ద పెద్ద నాయకులు వచ్చినా దేశంలోని 20 కోట్ల ఇళ్లలో 50% ఇళ్లకు కూడా నల్లాల ద్వారా నీళ్లు అందించలేదని దుయ్యబట్టారు. తెలంగాణలో 54 లక్షల ఇళ్లుంటే ప్రతీ ఇంటికి నల్లాల ద్వారా నీరు ఇచ్చిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వా నిదే అన్నారు. రాష్ట్రంలో పాదయాత్రలు, సైకిల్‌యాత్రలు, మోకాళ్లయాత్రలు చేస్తున్న నాయకులు ఎవరైనా ఈ సమస్యలు లేవనెత్తుతున్నారా అని ఎద్దేవా చేశారు.

పైసా ఇవ్వలేదు...
మిషన్‌ భగీరథకు నీతి అయోగ్‌ రూ.19 వేల కోట్లు ఇవ్వమంటే కేంద్రం 19 పైసలు కూడా ఇవ్వలేదని హరీశ్‌ మండిపడ్డారు. నీతి ఆయోగ్‌ మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథలకు రూ. 24 వేల కోట్లు ఇవ్వమంటే 24 పైసలు కూడా విదిలించలేదన్నారు. రాష్ట్రానికి 15వ ఆర్థిక సంఘం రూ.5,300 కోట్లు సెక్టర్‌ స్పెసిఫిక్, రాష్ట్ర స్పెసిఫిక్‌ గ్రాంట్‌ ఇవ్వమంటే కేంద్రం ఎగనామం పెట్టిందని దుయ్యబట్టారు. కేంద్రం అవార్డులు ఇవ్వడమే కాకుండా రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు కోరారు. తెలంగాణకు జాతీయస్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణ్, స్వచ్ఛభారత్‌ కింద 13 అవార్డులు, వివిధ కేటగిరీల్లో మిషన్‌ భగీరథకు 14 అవార్డులు వచ్చాయన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement