సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటానికి తోడు వడగాడ్పులు, తీవ్ర ఉక్కపోతతో జనం కుతకుతలాడుతున్నారు. రాత్రిపూట కూడా ఉక్కపోతగా ఉంటుండటంతో ఇబ్బందిపడుతున్నారు. సాధారణంగా మే నెలలో మధ్యలో ఉష్ణోగ్రతలు అధిక స్థాయికి చేరుతాయి. కానీ నెల ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. శనివారం నల్లగొండ, మెదక్, ఆదిలాబాద్‌లలో 43 డిగ్రీలకుపైనే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడం గమనార్హం. రాష్ట్రంలో పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని.. మరో ఐదు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది.
వడగాడ్పులతో జాగ్రత్త..: ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతుండటంతో పలు ప్రాంతాల్లో వడగాడ్పులు వీస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. మరో ఐదు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలకు తోడు వడగాడ్పుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. జనం పగటి పూట దూరప్రయాణాలు మానుకోవాలని.. వృద్ధులు, పిల్లలు బయటికి రాకపోవడమే మంచిదని సూచించింది. వడగాడ్పులు, ఎండ వేడిమి కారణంగా తలెత్తే అనారోగ్యాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. దీనికి సంబంధించి వైద్యారోగ్యశాఖ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తూ ఇప్పటికే ఎన్‌సీడీసీ (నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్) ఏప్రిల్‌లోనే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు పంపింది. ఉష్ణోగ్రతల కారణంగా ఎదురయ్యే అనారోగ్యాలకు సంబంధించిన జాతీయ కార్యాచరణ (నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ హీట్ రిలేటెడ్ ఇల్‌నెస్)లోని అంశాలపై ప్రభుత్వ శాఖలు విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించింది.
పలుచోట్ల ఈదురుగాలుల వానలు
తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి స్థిరంగా కొనసాగుతోందని.. దాని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు అక్కడక్కడా తేలికపాటి వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆయాచోట్ల ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులు వీస్తాయని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment