Hyderabad: Cafe Niloufer re-launches Golden Tips Tea, priced at Rs 1,000 - Sakshi
Sakshi News home page

Hyderabad Niloufer Cafe: ఏమి‘టీ’.. కప్పు చాయ్‌ రూ. 1,000.. నిజమేనా?

Published Fri, Feb 17 2023 9:24 AM | Last Updated on Fri, Feb 17 2023 3:03 PM

Hyderabad: Cafe Niloufer Re Launches Golden Tips Cup Of Tea Rs1000 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భాగ్యనగరంలో ఇరానీ చాయ్‌ ఎంత ఫేమసో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా పాతబస్తీలో లభించే ఇరానీ చాయ్‌ రుచి దేనికీ రాదు. ఎవరైనా ఒక్క కప్పు తాగితే వన్స్‌మోర్‌ అనాల్సిందే. దీని ధర సాధారణ కేఫ్‌లలో రూ. 20 వరకు ఉంటే కాస్త పెద్ద హోటల్‌లో రూ. 50 దాకా ఉండొచ్చు. అదే ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో సుమారు రూ. 200 పలకొచ్చు.

కానీ నగరంలోని ప్రఖ్యాత నిలోఫర్‌ కేఫ్‌లో లభిస్తున్న ఓ ప్రత్యేకమైన చాయ్‌ ధర అక్షరాలా రూ. వెయ్యి పలుకుతోంది! ఏమి‘టీ’ అంత ధరా అని ఆశ్చర్యపోతున్నారా? ధరకు తగ్గట్టే దాని రుచి కూడా అమోఘంగా ఉంటుందట. అందుకే భారీ ధర ఉన్నప్పటికీ దాని డిమాండ్‌ కూడా అదే రేంజ్‌లో ఉందట. అరుదైన రకం... 

క్లిష్టమైన సేకరణ ప్రక్రియ 
మనోహరీ గోల్డ్‌ రకానికి చెందిన అరుదైన ‘గోల్డెన్‌ టిప్స్‌’ చాయ్‌ పేరుకు తగ్గట్లే ముదు­రు బంగారు వర్ణంలో ఉంటుంది. దీన్ని తయారు చేయడానికి వేసే చాయ్‌ పత్తా అత్యంత ఖరీదైనదని కాబట్టే దీని ధర సైతం ఆ స్థాయిలో పలుకుతుంది. చలికాలమంతా ఈ రకం మొక్కలు నిద్రాణస్థితిలో ఉన్నప్పటికీ నేల నుంచి అధిక పోషకాలను గ్రహిస్తూ వసంత కాలం మొదలవగానే మొగ్గతొడుగుతాయి. ఈ క్రమంలో పోషకాలను ఎక్కువగా తొలుత ఏర్పడే మొగ్గల్లో నిక్షిప్తం చేస్తాయి.

ఈ మొగ్గల్లో కెఫీన్‌తోపాటు అధిక మోతాదులో విటమిన్లు ఏ, బీ, సీ, ఈ, కే, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఎల్‌–థియనైన్‌ అనే అమైనో యాసిడ్‌ సైతం ఉంటుంది. ఆయా మొగ్గలు సూర్యకాంతి తగిలి ఆకులుగా విచ్చుకొనేలోగానే (విచ్చుకుంటే ఆకుల రుచి, సువాసన మారుతుంది) తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 6 గంటల్లోగా వాటిని తెంపి వెంటనే పొడి చేసే ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. 

దిగుబడి ఏటా కొన్ని కిలోలే... 
ఏటా ఒకసారే సాగు చేసే ఈ తోటల్లోని ఒక్కో మొక్క నుంచి వచ్చే మొట్టమొదటి మొగ్గలోనే పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ లెక్కన మొత్తం తో­ట­లోంచి సుమారు ఒకటిన్నర కిలోల మొగ్గలు మా­త్రమే లభిస్తాయి. అందుకే వాటి నుంచి తయా­రు చేసే పొడికి అత్యధిక ధర లభిస్తుంది. ప్రపంచంలోకెల్లా అత్యంత నాణ్యమైన టీపొడిగా దీనికి గుర్తింపు ఉంది. పైగా ఈ చాయ్‌ పొడిని వేలంలోనే దక్కించుకోవాలి. ఇటీవల కోల్‌కతాలో నిర్వహించిన వేలం­లో కిలో టీ పొడిని రూ. 1,15,000 రికార్డు ధరకు నిలోఫర్‌ కేఫ్‌ యాజమాన్యం కొనుగోలు చేసింది.  

టీలో పాలు కలపం.. 
ప్రత్యేకమైన ఈ టీలో పాలు కలపం. డికాషన్‌రూపంలో తాగితేనే దీని రుచి తెలుస్తుంది. ఈ టీ తాగే వారు అద్భుతమైన అనుభూతికి లోనవుతారు. దీని రుచి వేరే టీలకు రాదు. ఒక కప్పు టీలో కేవలం 4 గ్రాముల పొడినే కలుపుతాం. బంజారాహిల్స్, హిమాయత్‌నగర్‌లతోపాటు లక్డీకాపూల్‌లోని కొత్త కేఫ్‌లో ఈ చాయ్‌ను మా మెనూలో తిరిగి ప్రవేశపెట్టాం. చాయ్‌ ప్రేమికుల నుంచి స్పందన బాగుంది. 
– బాబూరావు, కేఫ్‌ నిలోఫర్‌ యజమాని 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement