సాక్షి, హైదరాబాద్: సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయసును 60 నుంచి 61 సంవత్సరాలకు పెంచేందుకు బోర్డు అంగీకరించింది. సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ అధ్యక్షతన సోమవారం జరిగిన 557వ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ (బీవోడీ) సమావేశం ఈ మేరకు ఆమోదం తెలిపింది. సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచాలని సీఎం కేసీఆర్ ఇటీవల ఆదేశించారు. ఈ నేపథ్యంలో జరిగిన సమావేశానికి సంస్థ డైరెక్టర్లతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి బోర్డు ప్రతినిధులు హాజరయ్యారు. పదవీ విరమణ వయసు పెంపును ఈ ఏడాది మార్చి 31వ తేదీ నుంచి అమలు చేయడానికి బోర్డు అంగీకరించిందని సింగరేణి సీఎండీ శ్రీధర్ వెల్లడించారు.
బీవోడీలో తీసుకున్న నిర్ణయం ప్రకారం మొత్తం 43,899 మంది కార్మికులకు లబ్ధి కలగనుందని చెప్పారు. ఈ ఏడాది మార్చి 31 నుంచి జూన్ 30వ తేదీ మధ్యలో రిటైరైన 39 మంది అధికారులు, 689 మంది కార్మికులను కూడా విధుల్లోకి తీసుకుంటామని తెలిపారు. సింగరేణి విద్యా సంస్థల్లో కూడా పదవీ విరమణ వయసు పెంపు వర్తిస్తుందని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు, ఇంధన శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తాని యా, కేంద్ర బొగ్గు శాఖ డైరెక్టర్ పీఎస్‌ఎల్ స్వామి, డిప్యూటీ కార్యదర్శి అజితేశ్ కుమార్, వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ సీఎండీ మనోజ్‌కుమార్, సింగరేణి డైరెక్టర్లు ఎస్.చంద్రశేఖర్ (ఆపరేషన్స్), ఎన్.బలరామ్ (ఫైనాన్స్), డి.సత్యనారాయణరావు (ఈఅండ్‌ఎం), కంపెనీ సెక్రటరీ సునీతాదేవి తదితరులు పాల్గొన్నారు.
బోర్డు తీసుకున్న మరికొన్ని నిర్ణయాలివే..
►సంస్థ పరిధిలోని కారుణ్య ఉద్యోగ నియామక ప్రక్రియలో కార్మికుల కుమారులు, అవివాహిత కుమార్తెలకు మాత్రమే ఇప్పటివరకు అవకాశం కల్పించేవారు. కానీ ఇప్పుడు పెళ్లయిన లేదా విడాకులు తీసుకుని విశ్రాంత ఉద్యోగిపై ఆధారపడి ఉన్న కుమార్తెలు, ఒంటరి మహిళలకూ వయోపరిమితికి లోబడి అవకాశం కల్పిస్తారు.
►సామాజిక బాధ్యతా కార్యక్రమాల కింద 2021–22 ఆర్థిక సంవత్సరానికి రూ.60 కోట్లు వెచ్చిస్తారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ల అమలు.
►వివిధ గనులకు అవసరమైన యంత్రాలు సమకూర్చుకోవడంతో పాటు పలు కాంట్రాక్టు పనులకు కూడా ఆమోదం. రామగుండంలో కొత్తగా ప్రారంభించనున్న ఓపెన్ కాస్ట్–5 కోసం అవసరమైన రెండు నూతన రహదారుల నిర్మాణానికి కావాల్సిన బడ్జెట్‌కు కూడా ఆమోదం.
►ఫస్ట్ క్లాస్ మైన్ మేనేజర్‌గా ఉన్న మైనింగ్ అధికారుల హోదా మార్పునకు అంగీకారం. గతంలో ఎగ్జిక్యూటివ్, ఎన్‌సీడబ్ల్యూ ఉద్యోగ నియామకాల్లో ఉన్న లింగపరమైన ఆంక్షలను తొలగించి ఎవరైనా దరఖాస్తు చేసుకోవడానికి అంగీకారం.
►రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు శ్రీరాంపూర్ ఏరియా పరిధిలోని నస్పూర్ కాలనీ వద్ద జాతీ య రహదారి విస్తరణలో నిర్వాసితులైన స్థానికులకు సింగరేణి నిర్వాసిత కాలనీలో 85 చదరపు గజాల విస్తీర్ణం గల 201 ప్లాట్ల కేటాయింపు.
సీఎంవోఏఐ కృతజ్ఞతలు
సింగరేణిలో పదవీ విరమణ వయసు పెంపుతో పాటు మైనింగ్ అధికారుల హోదాను మార్చే ప్రతిపాదనకు సింగరేణి బోర్డు ఆమో దం తెలపడంపై బొగ్గుగని అధికారుల సంఘం (సీఎంవోఏఐ) హర్షం వ్యక్తం చేసింది. సీఎండీ శ్రీధర్‌కు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు జక్కం రమేశ్, ఎన్‌వీ రాజశేఖర్‌లు సోమవారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. తమ సమస్యల పరిష్కారానికి కృషి చేసిన సింగరేణి డైరెక్టర్లకు కూడా ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment