సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో ఉద్యోగ భద్రత కల్పిస్తూ జారీ చేసిన మార్గదర్శకాలు సరిగ్గా లేవని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన తరహా మార్గదర్శకాలు కావాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) కేంద్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మార్గదర్శకాల కోసం ఏర్పాటు చేసిన కమిటీ సిఫారసులు పక్కన పెట్టి మొక్కుబడి మార్పులతో కొత్త మార్గదర్శకాలు రూపొందించారని వాటిని.. అంగీకరించబోమని స్పష్టం చేసింది. ఆర్టీసీలో కార్మిక సంఘాలను పునరుద్ధరించి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేసింది. పెండింగులో ఉన్న దీర్ఘకాలిక సమస్యలను ఈనెల 21నాటికి పరిష్కరించాలని లేనిపక్షంలో ఆందోళనకు దిగుతామని హెచ్చరించింది. ఆ సంఘం ప్రధాన కార్యదర్శి అశ్వత్థామ రెడ్డి, అధ్యక్షుడు తిరుపతి ఆధ్వర్యంలో నాగోల్‌లోని శుభం గార్డెన్స్‌లో ఆదివారం జరిగిన కేంద్ర కమిటీ సమావేశంలో పలు తీర్మానాలు ఆమోదించారు.
ఇటీవల ఆ సంఘం మరోనేత థామస్‌రెడ్డి ఆధ్వర్యంలో కొంతమంది సంఘం నేతలుగా పేర్కొంటూ కార్యక్రమాలు నిర్వహిస్తుండటాన్ని సవాల్ చేస్తూ ఈ సమావేశం నిర్వహించారు. దీనికి భారీ సంఖ్యలో ప్రతినిధులు హాజరుకావటంతో, సంఘం నేతలంతా తమవైపే ఉన్నారని అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. ప్రతి ఏటా వేయి కొత్త బస్సులు కొనాలని, వేతన సవరణ వెంటనే చేపట్టాలని, గత వేతన సవరణ బకాయిలు చెల్లించాలని, సీసీఎస్, ఎస్‌ఆర్‌బీఎస్ బకాయిలు చెల్లించాలని, కారుణ్య నియామకాలు జరపాలని, విశ్రాంత ఉద్యోగులకు చెల్లించాల్సిన మొత్తాలను సెటిల్ చేయాలన్న డిమాండ్లను ప్రభుత్వం ముందుంచాలని తీర్మానించింది.
చరిత్రలో అదొక మైలురాయి
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో ఉద్యోగ భద్రత కల్పించడం సంస్థ చరిత్రలోనే ఓ మైలురాయిగా నిలిచిపోతుందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ వ్యాఖ్యానించారు. ఆదివారం ఖైరతాబాద్ ట్రాన్స్‌పోర్టు భవన్‌లోని తన కార్యాలయంలో ఆర్టీసీ ఉద్యోగ భద్రత ఆదేశాలు, మార్గదర్శకాలను మంత్రి విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ సీఎం ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని, సంస్థను పటిష్టపరిచేందుకు సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. గతంలో ఉద్యోగులు అభద్రతా భావంతో విధులు నిర్వర్తించేవారని, ప్రస్తుతం పదేపదే తప్పులు చేస్తే తప్ప వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే పరిస్థితి లేదన్నారు. టికెట్ తీసుకునే బాధ్యత ప్రయాణికులదేనని, సిబ్బంది ఏవైనా చిన్నచిన్న తప్పులు చేస్తే వాటిని డిపో మేనేజర్ స్థాయిలోనే పరిష్కరించేలా మార్గదర్శకాలు రూపొందించినట్టు వెల్లడించారు.
తాను రవాణా శాఖ మంత్రిగా, కార్మికుల పక్షాన నిలుస్తూ వారి సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. టికెట్ల రూపంలో సంస్థ కు రోజువారీ ఆదాయం రూ.13 కోట్లకు పెంచేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మ, రవాణాశాఖ కమిషనర్ ఎంఆర్‌ఎం రావు, ఈడీలు వినోద్, వెంకటేశ్వర్లు, మునిశేఖర్, కార్గో ప్రత్యేక అధికారి కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment