చిత్తూరు జిల్లాలో యాసిడ్ దాడికి గురై... తీవ్రంగా గాయపడిన జరీనాబేగం మృతి చెందింది. జరీనాబేగం చెన్నై వనాగరలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచింది. ఈ ఏడాది జూలై 15వ తేదీన చంద్రగిరి మండలం కాలూరు క్రాస్ రోడ్డు వద్ద జరీనాబేగంపై ఆమె మాజీ భర్త ఖాజా హుస్సేన్ యాసిడ్తో దాడి చేసిన సంగతి తెలిసిందే. జరీనా బేగంకు 2011లో ఖాజా హుస్సేన్‌తో వివాహమైంది. వివాహ సమయంలో తాను ఉద్యోగినని, ఆస్థిపాస్తులున్నాయని హుస్సేన్, బేగం తల్లితండ్రులతో నమ్మబలికాడు. ఆ తరువాత హుస్సేనే జులాయిగా తిరిగే వ్యక్తని తెలిసింది. దాంతో ఆ కుటుంబంలో తరచూ ఘర్షణలు జరుగుతుండేవి. ఈ క్రమంలో మూడేళ్లక్రితం జరీనా బేగం... హుస్సేన్ నుంచి విడాకులు తీసుకుంది. ఆ తరువాత కూడా హుస్సేన్ ఆమెను తరచు వేధిస్తు ఉండేవాడు. దీంతో ఆమె పీలేరు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు హుస్సేన్పై మూడు కేసులు నమోదు చేశారు.