నింగికేసి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ సీ25 | isro launches indias maiden mars mission | Sakshi
Sakshi News home page

Published Tue, Nov 5 2013 3:14 PM | Last Updated on Thu, Mar 21 2024 6:35 PM

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మార్స్ మిషన్‌లో కీలకఘట్టానికి తెర లేచింది. మార్స్ ఆర్బిటర్ మిషన్‌ను మోసుకుంటూ ఉపగ్రహ వాహకనౌక పీఎస్‌ఎల్‌వీ సీ25 నింగికేసి దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని షార్ నుంచి ఈ మధ్యాహ్నం 2.38 గంటలకు దీన్ని ప్రయోగించారు. నిప్పులు చిమ్ముకుంటూ పీఎస్‌ఎల్‌వీ సీ25 అంగారక యాత్రకు బయలుదేరింది. కేంద్రమంత్రి నారాయణస్వామి సహా పలువురు ప్రముఖులు ఈ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. యావత్ దేశం ఈ మధుర ఘట్టాన్ని అమితాసక్తితో తిలకించింది. మార్స్ మిషన్‌ విజయవంతం కావాలని ఆకాంక్షించింది. ఈ ప్రయోగంపై ప్రపంచదేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. పీఎస్‌ఎల్‌వీ ఉపగ్రహ వాహకనౌక రోదసీ ప్రయాణానికి 40 నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టే అవకాశముంది. సెప్టెంబరు 14, 2014 నాటికి ఉపగ్రహం అంగారకుడిని చేరనుంది. మొత్తం 5 రకాల పరికరాలను అంగారకుడిపైకి ఉపగ్రహం తీసుకెళ్లనుంది. లైమాన్‌ ఫొటో ఆల్ఫా ఫొటోమీటర్(ల్యాప్‌), మీథేన్‌ సెన్సార్‌ ఫర్‌ మార్స్‌, మార్స్‌ ఎక్సోస్ఫెరిక్‌ న్యూట్రల్‌ కాంపోజిషన్‌ అనలైజర్‌, మార్స్‌ కలర్‌ కెమెరా, థర్మల్‌ ఇన్‌ఫ్రారెడ్‌ ఇమేజింగ్‌ స్పెక్ట్రోమీటర్‌ పరికరాలను అంగార గ్రహానికి మోసుకెళ్లింది. ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్‌ ప్రయోగ ప్రక్రియను పర్యవేక్షించారు. ఈ ప్రయోగంతో గ్రహాంతర ప్రయోగాలకు భారత్ శ్రీకారం చుట్టింది. సుమారు రూ.455 కోట్ల వ్యయంతో ఈ ప్రయోగాన్ని చేపడుతున్నారు. దీన్ని అక్టోబర్ 28నే నిర్వహించాలని ముందుగా నిర్ణయించినా రాడార్ ట్రాకింగ్ వ్యవస్థ ఇబ్బందికరంగా మారడంతో నవంబర్ 5కు వాయిదా వేశారు. అంగారకుడిపైకి వెళ్లాలంటే 30 కోట్ల నుంచి 35 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి ఉంది. దాంతో రాకెట్ గమనాన్ని నిర్దేశించే రాడార్ ట్రాకింగ్ వ్యవస్థ కోసం బెంగళూరు ఇస్‌ట్రాక్ సెంటర్‌లో 32 డీప్‌స్పేస్ నెట్‌వర్క్, అండమాన్ దీవుల్లోని మరో నెట్‌వర్క్‌తో పాటు నాసాకు చెందిన మాడ్రిడ్ (స్పెయిన్), కాన్‌బెర్రా (ఆస్ట్రేలియా), గోల్డ్‌స్టోన్ (అమెరికా)ల్లోని మూడు డీప్ స్పేస్ నెట్‌వర్క్‌లతో పాటు మరో నాలుగు నెట్‌వర్క్‌ల సాయం కూడా తీసుకున్నారు. నాలుగో దశలో రాకెట్ గమనాన్ని తెలిపేందుకు దక్షిణ ఫసిపిక్ మహాసముద్రంలో రెండు నౌకలపై తాత్కాలిక రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఇందుకోసం భారత షిప్పింగ్ కార్పొరేషన్ నుంచి అద్దెకు తీసుకున్న నలంద, యుమున నౌకలు ఆస్ట్రేలియా-దక్షిణ అమెరికా మధ్యలో నిర్దేశిత స్థలానికి చేరుకుని సిద్ధంగా ఉన్నాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement