Mars mission
-
రెండేళ్లలో అంగారక గ్రహంపైకి స్టార్‌షిప్ మిషన్..?
రాబోయే రెండేళ్లలో ఐదు స్టార్‌షిప్ మిషన్లను అంగారక గ్రహానికి పంపించాలని యోచిస్తున్నట్లు స్పేస్ఎక్స్ సీఈఓ ఇలొన్‌మస్క్ తెలిపారు. ఈమేరకు ఎక్స్ ప్లాట్ఫామ్లో పోస్ట్ చేశారు. ఈ మిషన్ ద్వారా మనుషులను కూడా అంగారక గ్రహంపైకి తీసుకెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.ఏటా సెప్టెంబర్ నెలలో భూమి, అంగారక గ్రహాల మధ్య దూరం తగ్గుతుంది. ఆ సమయంలో వచ్చే రెండేళ్ల కాలంలో సంస్థకు చెందిన దాదాపు ఐదు స్టార్‌షిప్ మిషన్లను ప్రయోగిస్తామని మస్క్ తెలిపారు. ముందుగా అన్‌క్రూడ్ మిషన్(మానవ రహిత)లను పంపిస్తామని చెప్పారు. అవి సురక్షితంగా అంగారక గ్రహంపై దిగితే మరో రెండేళ్లలో మానవులను అక్కడకు పంపించేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఒకవేళ అనుకున్న విధంగా అంతరిక్షనౌక గ్రహంపై దిగకపోతే ఈ ప్రయోగం మరో రెండేళ్లు ఆలస్యం అయ్యే అవకాశం ఉందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులు పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఏటా రూ.మూడు లక్షల కోట్లు అవసరంస్టార్షిప్ మిషన్‌తో ప్రజలను, సరుకులను చంద్రుడిపైకి, అంగారక గ్రహంపైకి తీసుకెళ్లగల అంతరిక్ష నౌకను రూపొందించాలని మస్క్ లక్ష్యంగా పెట్టుకున్నారు. వచ్చే పదేళ్లలో దీన్ని సాధించాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. ఇందుకోసం స్పేస్ఎక్స్ నాసాతో కలిసి పని చేస్తోంది. చంద్రునిపైకి వ్యోమగాములను పంపడానికి స్టార్షిప్ని ఉపయోగించాలని భావించిన నాసా ‘ఆర్టెమిస్ 3 మిషన్’ కోసం 2025 లక్ష్యంగా పెట్టుకుంది. కానీ కొన్ని కారణాల వల్ల ఇది సెప్టెంబర్ 2026కి వాయిదా పడింది. -
వచ్చేస్తోంది మార్స్ ట్రాన్స్ఫర్ విండో!
మరొక్క నెల రోజులే! సైంటిస్టులంతా రెండేళ్లుగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ఎర్త్–మార్స్ ట్రాన్స్ఫర్ విండో’ అక్టోబర్‌లో అందుబాటులోకి రానుంది. 2022 నాటి ట్రాన్స్ఫర్ విండో సందర్భంగా నాసా వంటి అంతరిక్ష సంస్థలు పలు అంగారక ప్రయోగాలు చేశాయి. భావి మార్స్ మిషన్లకు అవసరమైన సామగ్రిని అంగారకునిపైకి ముందే చేరేసేందుకు ప్రయతి్నంచాయి. మరో నెల రోజుల అంతరం అక్టోబర్ ‘విండో’లో కూడా అలాంటి ప్రయోగాలు చేపట్టే దిశగా యోచిస్తున్నాయి. ఏమిటీ ట్రాన్స్ఫర్ విండో? ఇది భూ, అంగారక గ్రహాలు రెండూ పరస్పరం అత్యంత సమీపానికి వచ్చే సమయమని చెప్పవచ్చు. కనుక సహజంగానే ఆ సందర్భంగా భూమికి, అంగారకునికి మధ్య దూరం అత్యంత తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో అతి తక్కువ ఇంధన వ్యయంతో అంగారక ప్రయోగాలు సాధ్యపడుతాయి. ఫలితంగా ప్రయోగ ఖర్చుతో పాటు అరుణ గ్రహాన్ని చేరేందుకు పట్టే సమయమూ తగ్గుతుంది. కేవలం 6 నుంచి 8 నెలల్లో అంగారకున్ని చేరవచ్చు. అదే ఇతర సమయాల్లో అయితే ఏళ్ల కొద్దీ సమయం పడుతుంది. వీటన్నింటికీ మించి ట్రాన్స్ఫర్ విండోలో ప్రయోగించే అంతరిక్ష నౌక అంగారకుడు అత్యంత అనువైన పొజిషన్లో ఉండగా దాని కక్ష్యలోకి ప్రవేశించగలుగుతుంది. కనుక ప్రయోగం విజయవంతమయ్యే అవకాశం ఎన్నో రెట్లు పెరుగుతుంది. భూమి, అంగారకుల మధ్య ఈ విండో దాదాపు 26 నెలలకు ఓసారి పునరావృతమవుతూ ఉంటుంది. హాన్‌మన్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ సూత్రం ఆధారంగా దీన్ని లెక్కిస్తారు. ఈ విండో సమయాన్ని కచి్చతంగా లెక్కించడం అంతరిక్ష సంస్థలకు చాలా కీలకం. లేదంటే ప్రయోగం రెండేళ్లు ఆలస్యమయ్యే ప్రమాదముంటుంది. 2026 విండోపై స్పేస్ ఎక్స్ కన్ను ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ తన అంగారక యాత్ర సన్నాహాలకు మరింత పదును పెడుతోంది. అంతా అనుకున్నట్టుగా జరిగితే 2026లో అంగారకునిపైకి మానవరహిత ‘స్టార్íÙప్’ మిషన్ చేపట్టనున్నట్టు సంస్థ అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఆ ఏడాది ‘ఎర్త్–మార్స్ ట్రాన్స్ఫర్ విండో’ సందర్భంగా ప్రయోగం ఉంటుందని వెల్లడించారు. అంతరిక్ష నౌక సజావుగా అరుణ గ్రహంపై దిగి తమ మిషన్ విజయవంతమైతే మరో రెండేళ్లలో, అంటే 2028 నాటికి మానవసహిత అంగారక యాత్ర ఉంటుందని చెప్పారు. నాసా, ఇతర అంతరిక్ష సంస్థలు కూడా 20206 విండో సందర్భంగా అంగారకునిపైకి మరింత అదనపు సామగ్రి తదితరాలను చేరవేసేందుకు ఇప్పట్నుంచే ప్రణాళికలు వేస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మంగళ్యాన్ కథ ముగిసింది
బెంగళూరు: అంగారక (మార్స్) గ్రహంపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) చేపట్టిన మంగళ్యాన్ మిషన్ ముగిసింది. మార్స్ ఆర్బిటార్ క్రాఫ్ట్తో గ్రౌండ్ స్టేషన్‌తో సంబంధాలు తెగిపోయినట్లు ఇస్రో సోమవారం ధ్రువీకరించింది. 2013 నవంబర్ 5న ఆర్బిటార్ ప్రయోగం ప్రారంభించారు. ఆర్బిటార్ 300 రోజులపాటు ప్రయాణించి 2014 సెప్టెంబర్ 24న అంగారకుడి కక్ష్యలోకి ప్రవేశించింది. ఈ ఎనిమిదేళ్ల కాలంలో అరుణగ్రహం ఉపరితలంపై వాతావరణ పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందించింది. మంగళ్యాన్ జీవితకాలం ముగిసిందని, పని చేయడం ఆగిపోయిందని, ఆర్బిటార్‌ను ఇక రికవరీ చేయలేమని ఇస్రో అధికారులు స్పష్టం చేశారు. ఇతర గ్రహాలపై పరిశోధనల విషయంలో మంగళ్యాన్ అద్భుత సాంకేతిక, శాస్త్రీయ ప్రయోగంగా మిగిలిపోతుందని ఒక ప్రకటనలో వెల్లడించారు. -
హీరోను దుమ్మెత్తిపోసిన నెటిజన్లు.. సైలెంట్‌గా ఉండమని కామెంట్లు..
R Madhavan Gets Trolled For Claiming ISRO Used Hindu Calendar For Mars Mission: దక్షిణాది భాషల్లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు మాధవన్. ఆయన తాజాగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం రాకెట్రీ. ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కింది ఈ చిత్రం. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, స్టార్ హీరో సూర్య కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీషు భాషల్లో జులై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్లో భాగంగా చిత్రబృందం మీడియా సమావేశాలకు హాజరవుతోంది. ఈ క్రమంలోనే మాధవన్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట ట్రోల్స్ ఎదుర్కొంటున్నాయి. ఓ ప్రెస్ మీట్లో అంతరిక్షంలోకి రాకెట్‌ను ప్రయోగించినప్పుడు, అది అంగారక కక్ష్యలోకి చేరేందుకు ఇస్రోకు పంచాగం ఉపయోగపడిందని మాధవన్ అన్నాడు. 'ఇస్రోవాళ్లు పంచాంగం చూసి పెట్టిన ముహుర్త బలం వల్లే భారత మార్స్ మిషన్ అవాంతరాలను అధిగమించి కక్ష్యలోకి చేరింది. గ్రహాల స్థితిగతులన్నీ పంచాంగాల్లో నిక్షిప్తమై ఉంటాయి.' అని మాధవన్ వ్యాఖ్యలు చేశాడు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ కాగా నెటిజన్స్ ట్రోలింగ్‌తో ఏకిపారేస్తున్నారు. (చదవండి: చై-సామ్ బాటలో మరో టాలీవుడ్ జంట ?) When panjakam plays a important role in Mars mission #Madhavan #MarsMission #science #technology #sciencefiction pic.twitter.com/tnZOqYfaiN — கல்கி (@kalkyraj) June 23, 2022 'సైన్స్ అందరికీ అర్థమయ్యే విషయం కాదు. అలా అని సైన్స్ తెలియకపోవడం కూడా పెద్ద సమస్య కాదు. కానీ అసలు విషయం తెలుసుకోకుండా ఇలా మాట్లాడే బదులు సైలెంట్‌గా ఉండటం మంచిది', 'మీరు మాట్లాడే దాంట్లో ఏమైనా అర్థం ఉందా ?', 'ఇవేం పిచ్చి మాటలు' అంటూ వరుస కామెంట్లతో నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. అయితే ఈ ట్రోలింగ్‌పై తాజాగా మాధవన్ స్పందించాడు. 'పంచాంగాన్ని తమిళంలో పంచాంగ్ అని అనడం నా తప్పే. ఈ విమర్శలకు నేను అర్హుడినే. నేను అజ్ఞానినే. అయితే ఈ మాటల వల్ల మనం కేవలం 2 ఇంజిన్ల సహాయంతో మార్స్ మిషన్‌లో విజయం సాధించామనే నిజం కాకుండా పోదు. ఇది ఒక రికార్డు. వికాస్ ఇంజిన్ ఒక రాక్‌స్టార్.' అని ట్వీట్ మాధవన్ ట్వీట్ చేశాడు. (చదవండి: 'నువ్వే కావాలి' నటుడికి నిర్మాత బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు) 🙏🙏I deserve this for calling the Almanac the “Panchang” in tamil. Very ignorant of me.🙈🙈🙈🤗🚀❤️Though this cannot take away for the fact that what was achieved with just 2 engines by us in the Mars Mission.A record by itself. @NambiNOfficial Vikas engine is a rockstar. 🚀❤️ https://t.co/CsLloHPOwN — Ranganathan Madhavan (@ActorMadhavan) June 26, 2022 (చదవండి: 9 సార్లు పిల్లలను కోల్పోయిన స్టార్ హీరోయిన్..) -
శాస్త్ర సాంకేతికతపై యుద్ధం పిడుగు
ఉక్రెయిన్‌పై రష్యా దాడి మొదలుపెట్టి నెల రోజులు అవుతోంది. ఈ యుద్ధ ఫలితంగా వేలాదిమంది శరణార్థులుగా మారడంతో అతిపెద్ద మానవీయ సమస్య తలెత్తుతోంది. యుద్ధ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు, ఎరువులు, ఆహారపదార్థాల ధరలకు రెక్కలు వస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రష్యా దాడుల ప్రభావం ప్రపంచ శాస్త్ర పరిశోధన రంగంపై భారం మోపుతోంది. యుద్ధ కారణంగా కీలక ప్రాజెక్టులు రద్దు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇవన్నీ మానవ శాస్త్ర సాంకేతిక పురోగతిని దెబ్బతీస్తాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యుద్ధారంభం నుంచి ఇంతవరకు ప్రభావితమైన సైన్సు సంబంధిత అంశాలు ఇలా ఉన్నాయి.. మార్స్ మిషన్ రష్యాతో చేపట్టదలిచిన సంయుక్త మార్స్ మిషన్‌ను నిలిపివేస్తున్నట్లు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రకటించింది. ఈ ఏడాదిలో ఇరు పక్షాలు కలిసి కుజగ్రహ యాత్రను చేపట్టాల్సిఉంది. కేవలం ఎక్సోమార్స్ మిషన్ మాత్రమే కాకుండా పలు ఇతర ప్రాజెక్టుల్లో రష్యా స్పేస్ ఏజెన్సీ రోస్కోమాస్‌తో బంధాలను తెంచుకుంటున్నట్లు యూరోపియన్ ఏజెన్సీ తెలిపింది. ఇంధన రంగం ఉక్రెయిన్‌పై దాడితో ముందెన్నడూ చూడనటువంటి అంతర్జాతీయ ఇంధన సంక్షోభం ముంచుకువస్తోందని అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ(ఐఈఏ) హెచ్చరించింది. అంతర్జాతీయ ఇంధన మార్కెట్ల స్థిరీకరణకు ఈ ఏజెన్సీని 1973లో నెలకొల్పారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలకు రెక్కలు వచ్చాయి. ఈ సంక్షోభం తొలగిపోవాలంటే మిగిలిన దేశాలు ఉత్పత్తి పెంచితే సరిపోదని, ఇంధన పొదుపును అన్ని దేశాలు పాటించాలని ఏజెన్సీ సూచించింది. ఇందుకోసం ప్రజారవాణా వ్యవస్థను బలోపేతం చేయడం, విమానయానాలను తగ్గంచడం, కార్‌పూలింగ్‌ను ప్రోత్సహించడం తదితర చర్యలు తీసుకోవాలని సలహా ఇచ్చింది. ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వాడకాన్ని వేగంగా అమలు చేయాలని ప్రభుత్వాలను కోరింది. దీంతోపాటు ఫార్మా, ఆహార రంగాల్లో పలు పరిశోధనలు యుద్ధం కారణంగా అటకెక్కనున్నాయి. ఈ పరిణామాలన్నీ ఇంతవరకు మానవాళి సాధించిన సైన్సు విజయాలను ధ్వంసం చేస్తాయని ప్రపంచ పరిశోధకులు తీవ్ర ఆందోళన వెలిబుచ్చుతున్నారు. ఐఎస్ఎస్ నిర్వహణ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) నిర్మాణంలో రష్యా, అమెరికా కలిసి పనిచేశాయి. తాజా యుద్ధంతో ఇరు దేశాల మధ్య ఆవేశాలు పెరిగాయి. దీని ప్రభావం అంతరిక్ష ప్రయోగాలపై పడనుంది. ఇక మీదట ఇరుదేశాల ఉమ్మడిపాత్రపై అనుమానాలు ఏర్పడ్డాయి. ఐఎస్ఎస్లో ఉన్న అమెరికా ఆస్ట్రోనాట్ మార్క్ వాండే మరో ఇద్దరు రష్యన్ కాస్మోనాట్స్‌తో కలిసి భూమి మీదకు రష్యా అంతరిక్ష వాహనంలో రావాల్సిఉంది. ప్రస్తుతానికి ఈ ప్రయోగం వరకు సహకరించుకునేందుకు రష్యా, అమెరికా అంగీకారానికి వచ్చాయి. కానీ ఇకపై అమెరికాకు రాకెట్ విక్రయాలు చేపట్టమని రష్యా ప్రకటించింది. రష్యా దాడికి నిరసనగా అన్నట్లుగా రష్యన్ వ్యోమగాములు తమ ఐఎస్ఎస్ ప్రయాణంలో పసుపురంగు సూట్లు ధరించడం అందరి దృష్టిని ఆకర్షించింది. రష్యా దాడికి నిరసనగా ఉక్రెయిన్‌కు చెందిన ఈ రంగును కాస్మోనాట్లు వాడారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే తాము సాధారణంగానే ఈ రంగును ఎంచుకున్నట్లు కాస్మోనాట్లు చెబుతున్నారు. ముందుముందు ఐఎస్ఎస్పై రష్యా పట్టు తొలగిపోవచ్చన్న అనుమానాలున్నాయి. – నేషనల్ డెస్క్, సాక్షి -
యూఏఈ కొత్త చరిత్ర
దుబాయ్ : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) చరిత్ర సృష్టించింది. సొంతంగా రూపొందించిన అల్ అమాల్ అనే అంతరిక్ష నౌకను విజయవంతంగా ప్రయోగించింది. ఒక అరబ్ దేశం మరో గ్రహం కక్ష్యలోకి అంతరిక్ష నౌకను పంపిస్తుండడం ఇదే తొలిసారి. ఇందుకు జపాన్‌లోని టానేగషిమా స్పేస్‌పోర్టు వేదికగా నిలిచింది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 1.58 గంటలకు హెచ్–2ఏ అనే రాకెట్ సాయంతో అల్ అమాల్ నింగిలోకి దూసుకెళ్లింది. ఎలాంటి అపశ్రుతులు లేకుండా ప్రయోగం విజయవంతమైనట్లు సమాచారం అందగానే దుబాయ్‌లోని మహమ్మద్ బిన్ రషీద్ స్పేస్ సెంటర్లోని శాస్త్రవేత్తలు, యూఏఈ ప్రజలు ఆనందంలో మునిగిపోయారు. అల్ అమాల్ ప్రయోగం విజయవంతం కావడం పట్ల యూఏఈ నాయకత్వానికి, ప్రజలకు భారత్ అభినందనలు తెలియజేసింది. నౌక బరువు 1.3 టన్నులు. ఇది 49.5 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించి అంగారక గ్రహం కక్ష్యలోకి చేరుకోనుంది. గ్రహం చుట్టూ ఆవరించి ఉన్న వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేయడమే అల్ అమాల్ లక్ష్యం. -
అంగారక యాత్రకు 17 ఏళ్ల అమ్మాయి!
-
అంగారక యాత్రకు టీనేజ్ అమ్మాయి!
సాక్షి, న్యూఢిల్లీ : నక్షత్రాల వెలుగు జిలుగులతో అందంగా కనిపించే ఆకాశానికేసి చూసినప్పుడు పిల్లలందరికి ‘అబ్బా! అలా రోదసిలోకి వెళ్లి తిరిగొస్తే బాగుండు’ అనిపిస్తుంది. పెద్దయ్యాక వారికి అది అందమైన కలగానే మిగిలిపోతుంది. మన అలిస్సా కార్సన్‌కు అది మిగిలిపోయే కల కాదు. నిజంగా నిజమయ్యే అవకాశాలున్న కల. అమెరికాలోని లూజియానాకు చెందిన అలిస్సా కార్సన్ అంగారక గ్రహంపైకి వెళ్లేందుకు మొదటి మానవ యాత్రకు సిద్ధమవుతుంది. 2033లో అంగారక గ్రహంపైకి మానవ వ్యోమగాములను తీసుకెళ్లేందుకు నాసా ఏర్పాట్లు చేస్తోంది. ఆ యాత్రలో పాల్గొనేందుకు అలిస్సా ఎప్పటి నుంచి నాసాలో శిక్షణ పొందుతోంది. ఆ మాటకొస్తే ఆమె చిన్నప్పటి నుంచి నాసా నుంచి శిక్షణ తీసుకుంటుందని చెప్పవచ్చు. పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు నాసా అమెరికాలో ఎక్కడా శిక్షణా శిబిరం ఏర్పాటు చేసినా అక్కడికెళ్లి హాజరవుతూ వచ్చింది. ఇంతవరకు ఒక్క శిబిరాన్ని కూడా వదల లేదంటే అంతరిక్ష యాత్రలపై ఆమెకున్న మక్కువ ఎంత ఎక్కువో అర్థం చేసుకోవచ్చు. అలా శిబిరాల ద్వారా నాసా శాస్త్రవేత్తలతో ఆమె మమేకమైంది. చివరకు వయస్సు రాకముందే నాసా శిక్షణకు హాజరవుతోంది. నాసా నిబంధనల ప్రకారం 18 ఏళ్ల లోపు వారిని చేర్చుకోవడానికి వీల్లేదు. 17 ఏళ్ల అలిస్సా చేర్చుకోవాల్సి వచ్చింది. అందుకనే నాసా ఆమె పేరును, వయస్సును పేర్కొనకుండా ‘బ్లూబెర్రీ’ అనే కోడ్ నెంబర్‌తో వ్యవహరిస్తున్నారు. అంతరిక్ష యాత్ర, ముఖ్యంగా అంగారక యాత్రపై అలిస్సాకు ఇష్టం ఏర్పడడానికి కూడా కారణం ఉంది. ‘బ్యాకీయార్డిగాన్స్’ శీర్షికతో నికలడియాన్ నడిపిన కార్టూన్ సిరీస్‌ను చిన్నప్పుడే చదవడం కారణం. ఆ సిరీస్‌లో ఓ ఎపిసోడ్ ‘మిషన్ టు మార్స్’ ఉంటుంది. అందులో మిత్రులంతా కలిసి ఊహాత్మకమైన అంగారక గ్రహంపైకి వెళతారు. అప్పుడే తాను నిజంగా అంతరిక్ష యాత్రకు వెళ్లాలని అనుకుంది. అందుకు కాస్త పెద్దయ్యాక ఎలాగైనా వ్యోమగామిని కావాలని కలలుకంది. ఇప్పుడు నిజంగానే ఆమెకు అవకాశం వచ్చింది. తాను జీవితంలో టీచర్‌గానీ లేదా దేశాధ్యక్షుగానీ కావాలని కోరుకుంటున్నానని, అయితే అది అంగారక గ్రహంపైకి వెళ్లి వచ్చాక నెరవేరాలనుకుంటున్న లక్ష్యమని ‘టీన్ యోగ్’కు ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తెలిపారు. వ్యోమగామికి అవసరమైన ప్రాథమిక శిక్షణను అలిస్సా తీసుకుంటున్నారు. భూమి గురుత్వాకర్షణ లేని శూన్యంలో గడపడం, నీటిలో ఎక్కువ సేపు వివరించడం లాంటి శిక్షణలు తీసుకుంటున్నారు. ఆర్యన్ అంతరిక్ష నౌకలో ఆమె అంగారక గ్రహంపైకి వెళ్లనున్నారు. ప్రస్తుతమున్న సాంకేతిక పరిజ్ఞానం ప్రకారం అంగారక గ్రహంపైకి వెళ్లేందుకు ఆరు నెలల కాల వ్యవధి పడుతుంది. తాను ఏడాదికి పైగా అంగారక గ్రహంపై గడపనున్నట్లు ఆమె తెలిపారు. అక్కడ ఎలాంటి వనరులు ఉన్నాయి. అసలు నీటి ఛాయలు ఉన్నాయా, జీవి ఉనికికి ఆస్కారం ఉందా? అక్కడ మానవుల మనుగడ సాధ్యమేనా? అంశాలపై తాము అధ్యయనం జరుపుతామని చెప్పారు. అంతరిక్ష యాత్రకు సమాయత్తమవుతున్న అలిస్సా ముందుగా రోదసిలోని అంతరిక్ష ప్రయోగశాలకు వెళ్లి రానుంది. అక్కడికి వెళుతున్న తొలి టీనేజర్‌గా రికార్డు సృష్టించనుంది. అంగారక యాత్రకు శిక్షణ పొందుతున్న తొలి టీనేజర్ కూడా అలిస్సానే అయినప్పటికీ ఆమె యాత్రకు బయల్దేరే నాటికి ఆమెకు 32 ఏళ్లు వస్తాయి. -
మార్స్ రోవర్ డిజైన్లు విడుదల చేసిన చైనా
బీజింగ్: అంగారక గ్రహం పైకి 2020లో పంపించనున్న రోవర్‌కు సంబంధించిన డిజైన్లను చైనా విడుదల చేసింది. 2020 జూలై లేదా ఆగస్టులో ఈ రోవర్‌ను అంగారక గ్రహం మీదకి పంపించనున్నట్లు మార్స్ మిషన్ చీఫ్ ఆర్కిటెక్ట్ జాంగ్ తెలిపారు. ఆరు చక్రాలు, నాలుగు సౌరఫలకాలున్న దీని బరువు 200కేజీలని పేర్కొన్నారు. మూడు మార్షియన్ నెలల పాటు సేవలందించేలా దీనిని రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. అక్కడి వాతావరణం, ఉపరితలం, అంతర్గత, భౌతిక నిర్మాణం, అయాన్ ఆవరణాన్ని రోవర్ అధ్యయనం చేస్తుందని జాంగ్ వెల్లడించారు. అలాగే దీనికి లోగో రూపకల్పనతో పాటు పేరు పెట్టాలని ప్రజల్ని ఆహ్వానిస్తున్నామన్నారు. కాగా, మార్స్ మిషన్‌లో అమెరికా, రష్యా, యురోపియన్ యూనియన్, భారత్‌లు విజయం సాధించగా.. చైనా 2011లో ప్రయత్నించి విఫలమైంది. -
మార్స్ యాత్రకు అడుగు దూరంలో శ్రద్ధా ప్రసాద్
ముంబయి: ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న గ్రహం మార్స్. అంగారక గ్రహంపై అడుగుపెట్టడానికి కేరళకు చెందిన శ్రద్ధా ప్రసాద్ తహతహలాడుతోంది. నెదర్లాండ్‌కు చెందిన ఓ ప్రైవేటు సంస్థ 2024లో అంగారక యాత్ర నిర్వహించనుంది. ఈ యాత్రలో పాల్గొనేందుకు నిర్వహించిన కార్యక్రమంలో ముగ్గురు భారతీయులు ...చివరి నాలుగో రౌండ్‌కు ఎంపికయ్యారు. జీవితంలో ఒకసారి మాత్రమే చేయగలిగే ఈ యాత్రకి అతి పిన్న వయస్కురాలైన ఓ భారతీయురాలు సెలక్ట్ అవడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వివరాల్లోకి వెళితే నెదర్లాండ్స్ కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ మార్స్ యాత్రను చేపట్టనుంది. అరుణ గ్రహంపైకి పంపిస్తున్న ఈ యాత్రకు ప్రపంచ వ్యాప్తంగా 705 మందిని పంపిస్తున్నారు. యాత్రలో పాల్గొనేందుకు సుమారు 2,02,586 దరఖాస్తులు వచ్చాయి. కాగా అంగారక యాత్ర చేపట్టేందుకు ఎంపిక చేసిన వంద మంది జాబితాలో ముగ్గురు భారతీయులు చోటు దక్కించుకోవడం విశేషం. వీరిలో కేరళకు చెందిన 19 ఏళ్ల శ్రద్ధా ప్రసాద్ ఒక్కరే ప్రస్తుతం భారత్ (కేరళ) లో ఉంటున్నారు. ఎంపికైన తరన్ జీత్ సింగ్, రితికా సింగ్ ఇద్దరు ప్రవాస భారతీయులు. తరన్ జీత్ సింగ్ భాటియా సెంట్రల్ ఫ్లోరిడా యూనివర్సిటీలో డాక్టరేట్ చేస్తుండగా, రితికా సింగ్ ప్రస్తుతం దుబాయ్‌లో స్ధిరపడ్డారు. అంగారకుడిపై శాశ్వతంగా మానవ ఆవాసాన్ని ఏర్పాటు చేసే దిశగా వీరు ప్రయత్నాలు చేయడం కోసం తలపెట్టినదే ఈ యాత్ర. మొత్తంగా 40 మందిని అంగారక గ్రహంపైకి పంపించాలన్నది ఈ మిషన్ ఉద్దేశం. ప్రతి రెండేళ్లకు నలుగురిని మార్స్ యాత్రకి పంపుతారు. అన్ని రౌండ్ లను విజయవంతంగా పూర్తిచేసిన అభ్యర్ధులకు శిక్షణ ఇచ్చి ఈ యాత్రకు పంపిస్తారు. ప్రస్తుతం 3 రౌండ్లు పూర్తయ్యేసరికి 100 మంది సెలక్ట్ కాగా వీరిలో మహిళలు 50, పురుషులు 50 మంది ఉండటం విశేషం. జీవితంలో ఒకేసారి చేసే యాత్ర 'కుటుంబాన్ని, స్నేహితులను, సన్నిహితులను వదిలి వెళ్లడం చాలా బాధగా ఉంది. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి.. జీవితంలో ఒకసారి మాత్రమే వచ్చే సదవకాశమని నేను మరిచిపోకూడదు' అని శ్రద్ధా ప్రసాద్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే తనకు చాలా ఇష్టమని, రిస్క్‌తో పాటు యాత్రను ఎంజాయ్ చేయాలనుకుంటున్నానని కోయంబత్తూరు లోని అమృత యూనివర్సిటీకి చెందిన శ్రద్ధా చెప్పారు. మూడవ రౌండ్ అయిన తర్వాత చివరి రౌండ్ విజయవంతంగా పూర్తిచేస్తానన్న నమ్మకం ఏర్పడిందని ఆమె దీమా వ్యక్తం చేశారు. -
ఆటో కంటే అంతరిక్ష యానమే చవక!
మన దేశంలో ఎక్కడినుంచి ఎక్కడకు వెళ్లాలన్నా ఆటో ఎక్కితే కనీసం కిలోమీటరుకు పది రూపాయలు తీసుకుంటారు. కానీ.. అంతరిక్షంలో ఎక్కడో ఉన్న అంగారకుడి మీదకు మన 'మామ్'ను పంపడానికి అయ్యిన ఖర్చు ఎంతో తెలుసా.. కిలోమీటరకు కేవలం ఏడు రూపాయలే! ఈ విషయాన్ని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. అహ్మదాబాద్‌లో ఆటోవాలాలు కిలోమీటరకు 10 తీసుకుంటారని, కానీ మార్స్ మిషన్‌కు కిలోమీటరుకు 7 రూపాయలే ఖర్చయిందని ఆయన ఎన్నారైలతో జరిగిన భేటీలో తెలిపారు. మానవరహిత స్పేస్‌క్రాఫ్ట్ అంగారకుడి మీదకు వెళ్లడానికి 65 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించింది. ప్రపంచంలో ఏ దేశమూ ఇంత తక్కువ ఖర్చుతో ప్రయోగాలు చేయలేదని, మన సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రవేత్తల కృషి పుణ్యమాని ప్రపంచంలోనే మనం తలెత్తుకుని నిలబడగలుగుతున్నామని ఆయన అన్నారు. మంగళ్యాన్లో ప్రతి ఒక్కటీ స్వదేశీ పరికరమేనని, హాలీవుడ్ సినిమా బడ్జెట్ కంటే తక్కువ ఖర్చుతో ప్రాజెక్టు పూర్తయిందని మోదీ చెప్పారు. గ్రావిటీ సినిమాను 100 మిలియన్ డాలర్లతో తీస్తే.. మన ప్రాజెక్టుకు 74 మిలియన్ డాలర్లే ఖర్చయిందన్నారు. -
‘మామ్’... సలామ్!
అంతరిక్షరంగంలో వరస విజయాలను నమోదు చేస్తున్న మన శాస్త్రవేత్తలు ఈసారి అత్యంత సంక్లిష్టమైన ప్రయోగంలో చిరస్మరణీయ మనదగ్గ అద్భుతాన్ని సాధించారు. అరుణగ్రహంపైకి నిరుడు నవంబర్‌లో ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) ఉపగ్రహాన్ని బుధవారం ఉదయాన ఆ గ్రహ కక్ష్యలోకి చాకచక్యంగా ప్రవేశపెట్టగలిగారు. ఇదెంత సంక్లిష్టమైనదో తెలియాలంటే ప్రపంచ అంతరిక్షయాన చరిత్రను ఒక్కసారి అవలోకించాలి. అంగారకుడిగా, మంగళగ్రహంగా, కుజుడిగా నామాంతరాలున్న అరుణగ్రహాన్ని పలకరించే సాహసాన్ని కలగన్న దేశాల సంఖ్య తక్కువేమీ కాదు. కానీ, దాన్ని సాకారం చేసుకున్నవి మూడే మూడు... అమెరికా, రష్యా, యూరోప్‌లు. అవి సైతం తొలి ప్రయోగాలను తుస్సుమనిపించాయి. తప్పటడుగులతో చతికిలబడ్డాయి. మొత్తంమీద 51సార్లు ప్రయత్నించి కేవలం 21 సార్లు మాత్రమే విజయం సాధించాయి. అంటే వైఫల్యాల వాటా 59 శాతమన్నమాట! రోదసి రంగంలో రెండు దశాబ్దాల అను భవం గల చైనా మూడేళ్లనాడు అంగారకుడే లక్ష్యంగా పంపిన ఉపగ్రహం భూకక్ష్యను దాటలేక ఉసూరన్నది. జపాన్ చరిత్ర కూడా డిటోయే. మన అంతరిక్ష శాస్త్రవేత్తలు మాత్రం తొలి ప్రయోగంలోనే సత్తా చాటారు. మన దేశాన్ని ఆసియాలోనూ, ప్రపంచంలోనూ అగ్రగామిగా నిలిపారు. ఒక ఉపగ్రహాన్ని భూకక్ష్య దాటించాలంటే...గ్రహాంతరయానానికి పంపాలంటే అందుకెంతో కసరత్తు జరగాలి. బెంగళూరులోని ఇస్రో కమాండ్ సెంటర్‌నుంచి ఉపగ్రహానికి ఒక సంకేతం పంపాక దాని స్పందనెలా ఉన్నదో తెలుసుకోవాలంటే 40 నిమిషాలు పడుతుంది. ఈ వ్యవధి పొడవునా ఎంతో ఏకాగ్రత ఉండాలి. తదేక దృష్టితో దాని గమనాన్ని వీక్షిస్తుండాలి. అవసరాన్నిబట్టి దాని వేగాన్ని నిర్దేశించాలి. అంచనాల్లో ఖచ్చితత్వం లేకపోతే... మదిం పులో ఏమరుపాటుగా ఉంటే మొత్తం ప్రాజెక్టు బూడిదలో పోసిన పన్నీరవు తుంది. భూమికీ, అంగారకుడికీ మధ్య దూరం 65 కోట్ల కిలోమీటర్లు. ప్రతి 780 రోజులకూ అది భూమికి అత్యంత చేరువగా వస్తుంది. అలా వచ్చినప్పుడు అది మనకు 24 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ చేరువయ్యే సమయం సెప్టెంబర్ చివరినుంచి నవంబర్ వరకూ ఉంటుంది కనుక ఉపగ్రహాన్ని చేర్చడానికి సరిగ్గా ఈ సమయాన్ని శాస్త్రవేత్తలు ఎంచుకుంటారు. ఈ దూరాన్ని చేరుకోవడానికి ‘మామ్’ చేసే ప్రయాణ కాలం దాదాపు మూడొందల రోజులు. కనుక ఈ కాలమంతా శాస్త్రవేత్తలు కళ్లలో ఒత్తులువేసుకుని ఉపగ్రహంలోని అన్ని వ్యవస్థల పనితీరునూ నిశితంగా పరిశీలిస్తుండాలి. దాన్ని పొత్తిళ్లలో బిడ్డగా భావించి అపురూపంగా చూసుకోవాలి. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇదంతా ఒక బృహత్తర క్రతువు. చంద్రయాన్-1లో తమకు ఎదురైన సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకున్న జాగ్రత్తలు ఒకటికి పదిసార్లు చూసుకుని చేయబట్టే ‘మామ్’విజయవంతంగా అంగారక కక్ష్యలోకి చేరగలిగింది. సరిగ్గా దీనికి రెండురోజుల ముందు అంటే...సోమవారంనాడు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా పంపిన మావెన్ ఉపగ్రహం కూడా అంగారక కక్ష్యలో చేరింది. ‘మామ్’ అంగారక కక్ష్యలోకి చేరుతూనే రంగుల ఛాయాచిత్రాలను పంపడం ప్రారంభించిందని చెబుతున్నారు. అది భవిష్యత్తులో చేయబోయే పనులు ఇంకా చాలా ఉన్నాయి. అంగారక గ్రహంపైనున్న వాతావరణాన్ని ‘మామ్’ గమనిస్తుంది. అందులోని తేమ ఎలా మాయమైందో కూపీ లాగుతుంది. అది పంపే డేటా వల్ల కోట్లాది సంవత్సరాలక్రితం ఆ గ్రహంపై ఏం జరిగిందో శాస్త్రవేత్తలు అంచనాకు రాగలుగుతారు. ఒకప్పుడు అది జీవరాశితో నిండివుండేదన్న ఊహల్లోని నిజమెంతో రాబడతారు. ఇప్పటికే ఆ గ్రహంపై వాలిన రోదసి నౌకలు అక్కడ మట్టి, రాళ్లు వంటివున్నట్టు తేల్చాయి. అవి దిగిన ప్రదేశాల్లో నీటి జాడ కనబడలేదు. కుజుడి చుట్టూ పరిభ్రమిస్తున్న ఉపగ్రహాలు కూడా ఆ గ్రహాన్ని జల్లెడపడుతున్నాయి. మన ‘మామ్’కూడా ఈ పరిశోధన లకు తోడవుతుంది. ఇన్ని పరిశోధనలకు పయనమైన ఈ ఉపగ్రహానికి అయిన వ్యయం రూ. 450 కోట్లు. అది ప్రయాణించిన దూరాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఒక్కో కిలోమీటరుకు అయిన ఖర్చు దాదాపు రూ. 6 అన్న మాట. ఎంత చౌక!! అందుకే ప్రధాని నరేంద్ర మోదీ హాలీవుడ్ చిత్రం ‘గ్రావిటీ’ నిర్మించడానికైన వ్యయం కంటే మామ్ ప్రాజెక్టుకు తక్కువ వ్యయమైందని శాస్త్రవేత్తలను ప్రశంసించారు. నిశిరాతిరి ఆకాశ వీధిలో ఆరబోసిన ముత్యాల్లా కనబడుతూ కాంతులీనే తారల్లో అంగారకుడిది విశిష్ట స్థానం. ఎందుకంటే మిగిలిన తారలకు భిన్నంగా అంగారకుడు నిత్యం జ్వలిస్తున్నట్టు కనబడతాడు. ఆ గ్రహ ఉపరితలంపై ఆక్సయిడ్ రూపంలో ఉన్న ఇనుమువల్లే ఇలా అరుణవర్ణం కనబడుతుందని శాస్త్రవేత్తలు చెబుతారు. రూపాన్ని చూసి రోమన్లు అంగారకుణ్ణి యుద్ధానికి ప్రతీకగా భావించారు. మన పూర్వీకులు కూడా అరుణగ్రహంగా, అంగారకుడిగా పిలిచింది ఈ కారణంతోనే. నవగ్రహస్తోత్రం ధరణీగర్భ సంభూతుడంటుంది. అంటే భూమి పుత్రుడని అర్ధం. కువలయం అంటే భూమి గనుక కుజుడన్నా ఇదే అర్ధం. కుజుడు భూమిపుత్రుడో, కాదో చెప్పడానికి ఆధారాలేమీ లేవుగానీ... మన భూమికి మాత్రం అది సమీప బంధువు. భూమికి అటు శుక్రుడు, ఇటు కుజుడు ఉంటారు. అంగారకుణ్ణి భూమి పుత్రుడిగా సంభావించి ఆ గ్రహంతో చుట్టరికం కలుపుకున్న గడ్డపై నుంచి తొలిసారి జరిపిన ఈ ప్రయోగం విజయవంతం కావడం మన శాస్త్రవేత్తల దక్షతకూ, వారి పట్టుదలకూ తార్కాణం. స్వావలంబనతో సాధించిన ఈ విజయం భవిష్యత్తులో మరిన్ని విజయాలకు స్ఫూర్తినిస్తుందని ఘంటాపథంగా చెప్పవచ్చు. -
శుభమంగళం
తొలి యత్నంలోనే ఇస్రో ఘనవిజయం అమెరికా, రష్యా, ఈయూల సరసన భారత్ బుధవారం తెల్లవారుజామున మొదలైన ప్రక్రియ 7:17 గంటలకు ఇంధన దహనం ప్రారంభం 24:13 నిమిషాల పాటు మండిన ప్రధాన లామ్ ఇంజన్ 7:59కి అంగారక కక్ష్యలోకి ప్రవేశించిన మామ్ ‘‘చరిత్ర సృష్టించాం..’’ ‘‘అసాధ్యాన్ని సుసాధ్యం చేసేశాం.’’ బుధవారం ఉదయం బెంగళూరులోని ఇస్రో కమాండ్ సెంటర్లో ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలివి. తొలి ప్రయత్నంలోనే అంగారకుడిపైకి విజయవంతంగా ఉపగ్రహాన్ని ప్రయోగించిన తరువాత ఇస్రో శాస్త్రవేత్తలను అభినందిస్తూ మోదీ చేసిన ఈ వ్యాఖ్యలు అక్షరాలా సత్యం. ఎందుకంటే ఒకప్పుడు అగ్రరాజ్యం అమెరికా కూడా నాలుగైదు సార్లు ప్రయత్నిస్తేగానీ మార్స్‌పైకి ఓ ఉపగ్రహాన్ని పంపడం సాధ్యం కాలేదు. అంతరిక్ష ప్రయోగాలకు నాంది పలికిన... ఒకప్పటి కమ్యూనిస్టు దిగ్గజం సోవియట్ యూనియన్‌కు కూడా వరుస పరాజయాల తరువాత గానీ విజయం వరించలేదు. యూరోపియన్ యూనియన్ పరిస్థితి కూడా ఇదే. చైనా, జపాన్‌లు ఇప్పటికీ తడబడుతూనే ఉంటే మనం మాత్రం ఒకడుగు ముందుకేసి తొలి ప్రయత్నంలోనే అరుణ గ్రహంపై జెండా పాతేశాం! అందుకే... ఎన్నడూ లేనంతగా ఇస్రో కేంద్రంలో శాస్త్రవేత్తలు, ప్రధాని మోదీ బుధవారం ఆనందంలో మునిగితేలారు. చప్పట్లతో పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తం చే శారు. కరచాలనాలు చేసుకుంటూ.. పరస్పరం కౌగిలించుకుంటూ.. అభినందనలు తెలుపుకొంటూ.. చిన్నపిల్లల్లా కేరింతలు కొట్టారు. దేశం యావత్తూ విజయగర్వంతో పొంగిపోయింది. ప్రపంచం ముందు భారత కీర్తి పతాకను సగర్వంగా ఎగరేసిన ఇస్రోకు సెల్యూట్ చేసింది! అంతరిక్ష ప్రయోగాల్లో అగ్రగామి దేశాలుగా ఉన్న అమెరికా, రష్యా సైతం భళా భారత్ అని ప్రశంసించాయి. సాక్షి, హైదరాబాద్/సాక్షి, బెంగళూరు: ప్రపంచం యావత్తూ ఉత్కంఠతో ఎదురు చూసిన మంగళ్యాన్ ఉపగ్రహం అరుణ గ్రహంపైకి అడుగుపెట్టింది. భారతీయ అంతరిక్ష పరిశోధనలో సువర్ణ ఘట్టంగా లిఖించదగిన ఈ పరిణామంతో భారత కీర్తి పతాకం విను వీధుల్లో రెపరెపలాడింది. బుధవారం ఉదయం ఇస్రో శాస్త్రవేత్తలు 440 న్యూటన్ ద్రవ ఇంజన్‌ను 24 నిమిషాల పాటు మండించడం ద్వారా వ్యోమ నౌక వేగాన్ని తగ్గించి అంగారక కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టగలిగారు. రెండు గంటల అనంతరం అంగారక గ్రహం నుంచి తొలి చిత్రాలను ఉపగ్రహం పంపించిం ది. ఈ అపురూప ఘట్టాన్ని వీక్షించడానికి ప్రధా ని నరేంద్ర మోదీ ఉదయం ఏడు గంటలకే బెంగళూరులోని ఇస్రో నియంత్రణ కేంద్రానికి చేరుకున్నారు. మార్స్ ఆర్బిటర్ మిషన్(మామ్) తుది ఘట్టాన్ని ఆయనతో పాటు ఇస్రో శాస్త్రవేత్తలు ఉత్కంఠతో వీక్షించారు. ఎట్టకేలకు ఉదయం 7:59 గంటలకు ఉపగ్రహం అంగారక కక్ష్యలోకి ప్రవేశించినట్లు సమాచారం అందడంతో శాస్త్రవేత్తలు, ప్రధాని హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఒకరినొకరు అభినందించుకున్నారు. అంగారక విజయంతో సాధించేదేమిటి..? నవంబరు 5, 2013న శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ సీ25 రాకెట్‌పై మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రయోగం జరిగినప్పుడు దీనిపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు కూడా పెద్ద అంచనాలేవీ లేవు. గ్రహాంతర ఉపగ్రహ ప్రయోగం మనకు సాధ్యమవుతుందా? లేదా? అందుకు తగ్గ శాస్త్ర, సాంకేతిక సామర్థ్యం మనకు ఉందా? లేదా? అన్నది పరీక్షించుకునేందుకే ఈ ప్రయోగం చేపట్టినట్లు ఇస్రో చెప్పుకుంది. ఒకవేళ దాదాపు 15 కిలోల బరువున్న శాస్త్రీయ పరికరాలను మోసుకెళుతున్న ఉపగ్రహం అరుణగ్ర హ కక్ష్యలోకి చేరితే ఆ గ్రహంపై ఎప్పుడైనా జీవం ఉండిందా? అన్నది తెలుసుకునేందుకు కొన్ని ప్రయోగాలు చేయాలన్నది ఈ ప్రయోగం లక్ష్యాల్లో ఒకటి. అయితే పది నెలల తరువాత... దాదాపు 66.6 కోట్ల కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం తరువాత ఇస్రో ఈ లక్షా్యాన్ని సులువుగానే ఛేదించింది. ప్రపంచ దేశాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. అన్నింటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అంశం దీనికైన ఖర్చు గురించి. మామ్ ప్రయోగానికి ఇస్రో చేసిన ఖర్చు కేవలం 450 కోట్ల రూపాయలు మాత్రమే. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ఇటీవల ఇదే గ్రహంపైకి ప్రయోగించిన మావెన్ అభివృద్ధికి దాదాపు 4,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది! సుదీర్ఘ ప్రయాణం తరువాత.... గత ఏడాది డిసెంబరు ఒకటిన భూ కక్ష్యా మార్గాన్ని వీడిన మార్స్ ఆర్బిటర్ మిషన్ పది నెలల సుదీర్ఘ ప్రయాణం తరువాత సెప్టెంబరు 22న అంగారకుడి సమీపానికి చేరింది. భారతీయ కాలమానం ప్రకారం ఉదయం 6.56 నిమిషాలకు ప్రారంభమైన ఈ ప్రక్రియ దాదాపు 72 నిమాషాలపాటు కొనసాగింది. అంగారకుడికి ఆవలివైపున ఉన్న ఉపగ్రహంలోని ప్రధాన ఇంజిన్‌తోపాటు ఎనిమిది థ్రస్టర్లను దాదాపు 24 నిమిషాల 13 సెకన్లపాటు మండించారు. దీంతో అప్పటివరకూ సెకనుకు 22.14 కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతున్న మామ్ మందగిం చడం మొదలైంది. సెకనుకు 4.4 కిలోమీటర్ల వేగానికి చేరుకోగానే... అంగారకుడి కక్ష్యలోకి చేరడం పూర్తయింది. అంతే... ఇస్రో కేంద్రంలో హర్షధ్వానాలు మిన్నంటాయి! కేసీఆర్ అభినందనలు అంగారక గ్రహంపై పరిశోధనల కోసం పంపిన మార్స్ ఆర్బిటర్ మిషన్(మామ్)ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. అంతరిక్ష ప్రయోగాల్లో ఎన్నో అద్భుత విజయాలను సాధించడం దేశ పౌరులందరికీ గర్వకారణమని కేసీఆర్ ప్రశంసించారు. -
అంగారక యానంలో తొలి గెలుపు
-
అంగారక యానంలో తొలి గెలుపు
‘మార్స్ ఆర్బిటర్ మిషన్’ ప్రయోగంలో తొలి దశ విజయవంతం అరుణగ్రహం దిశగా భారత్ ప్రయాణం మొదలు శ్రీహరికోట నుంచి విజయవంతంగా రోదసిలోకి మార్స్ ఆర్బిటర్ మిషన్ పీఎస్ఎల్వీ-సీ25లో ‘మామ్’ ప్రయోగం వరుసగా 24వ సారీ పీఎస్ఎల్వీ సక్సెస్ రాకెట్ 4 దశలను 49.56 నిమిషాల్లో పూర్తి చేసుకొని కక్ష్యలోకి ‘మామ్’ ఇరవై ఐదు రోజులపాటు భూమి చుట్టూనే పరిభ్రమించనున్న ఆర్బిటర్ తర్వాత 300 రోజుల పాటు ప్రయాణించి అరుణగ్రహ కక్ష్యలోకి ఇస్రోకిది 109వ ప్రయోగం.. గ్రహాంతర పరిశోధనల్లో ఇదే మొట్టమొదటిది మహావిశ్వంలో మన దేశం మరో అడుగు ముందుకేసింది. అంతరిక్ష ప్రయోగంలో చరిత్రాత్మక అధ్యాయానికి నాంది పలికింది. గ్రహాంతర పరిశోధనలకు వినువీధిలో మహాయానం మొదలుపెట్టింది. అంగారక గ్రహంపై పరిశోధనల కోసం మార్స్ ఆర్బిటర్ మిషన్(ఎంవోఎం-మామ్)ను ఇస్రో దిగ్విజయంగా నింగిలోకి పంపింది. మంగళవారం మధ్యాహ్నం షార్ అంతరిక్ష కేంద్రం నుంచి రాకెట్ లాంచర్ సాయంతో ‘మంగళ్యాన్’ మొదలైంది. ‘మామ్’ రోదసిలోకి దూసుకెళ్లింది. ఇది మూడు వందల రోజుల పాటు.. దాదాపు 40 కోట్ల కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించి మంగళగ్రహాన్ని చేరుకుంటుంది. చుట్టూ కొన్ని నెలల పాటు పరిభ్రమిస్తూ అరుణగ్రహంపై జీవాన్వేషణ, ఆ గ్రహం నిర్మాణం, ఖనిజాల మిశ్రమం తదితరాలను శోధిస్తుంది. అంతా సవ్యంగా సాగితే అరుణగ్రహంపై విజయవంతంగా ప్రయోగాలు నిర్వహించిన నాలుగో దేశంగా భారత్ అవతరిస్తుంది. ఇప్పటివరకూ ఈ ఘనతను సాధించిన అమెరికా, రష్యా, ఐరోపాల సరసన నిలుస్తుంది. సాక్షి, నెల్లూరు/సూళ్లూరుపేట: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం.. మంగళవారం మధ్యాహ్నం 2:38:26 గంటల సమయం.. మిషన్ కంట్రోల్ రూంలోని శాస్త్రవేత్తల్లో నరాలు తెగే ఉత్కంఠ.. షార్‌లోని అన్ని భవనాలపై నిల్చుని ఆత్రుతగా చూస్తున్న జనం.. నిశ్శబ్ద వాతావరణంలో మైక్‌లో కౌంట్ డౌన్.. త్రీ, టూ, వన్, జీరో.. ఒక్కసారిగా భీకరంగా గర్జిస్తూ.. దట్టమైన పొగలు కక్కుతూ, నిప్పులు చిమ్ముకుంటూ ఓ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. లోపల శాస్త్రవేత్తలు కంప్యూటర్ల ముందు అదే ఉత్కంఠతో పర్యవేక్షిస్తున్నారు.. బయట జనం నింగిలోకి దూసుకెళుతున్న రాకెట్కేసి తదేకంగా చూస్తున్నారు. రాకెట్ ఒక్కో దశ దాటుకుంటూ పోతోంది.. మూడు దశల వరకూ శాస్త్రవేత్తల్లో ఉత్కంఠ తగ్గుతూ వస్తోంది.. కానీ నాలుగో దశలో కొన్ని నిమిషాల పాటు మళ్లీ ఉత్కంఠ.. చివరికి అంతా సవ్యంగానే ఉందన్న సమాచారం. సరిగ్గా 49.56 నిమిషాల తర్వాత.. మధ్యాహ్నం 3.22 గంటలకు రాకెట్‌లోని ఉపగ్రహం అంతరిక్ష కక్ష్యలోకి నిర్విఘ్నంగా ప్రవేశించింది. అంతే.. ఒక్కసారిగా శాస్త్రవేత్తల కేరింతలు.. ఒకరినొకరు కౌగిలించుకుని పరస్పర అభినందనలు.. వారి వదనాల్లో ఎప్పటికన్నా ఎంతో విజయగర్వం.. వారికి దేశ నేతల నుంచే కాదు.. ప్రపంచ ప్రముఖుల నుంచీ అభినందనల వెల్లువ! భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇప్పటివరకూ శతాధిక ప్రయోగాలు చేపట్టింది. నిన్నగాక మొన్న ‘చంద్రయాన’ం కూడా చేసింది. అయినా మంగళవారం నాటి ప్రయోగం అంతకన్నా విశిష్టమైనది.. ఇది ‘మంగళయానం’. గ్రహాంతర ప్రయోగం. ఇరవై కోట్లకు పైగా కిలోమీటర్ల దూరంలోని అరుణగ్రహంపై పరిశోధనలకు భారత్ ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (ఎంఓఎం - మామ్)నే ఈ రాకెట్ నింగిలోకి పంపింది. దేశ అంతరిక్ష పరిశోధనలో సరికొత్త చరిత్రకు తొలి అంకం దిగ్విజయంగా లిఖించింది. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మంగళ్యాన్’ ప్రయోగానికి ఆదివారం ఉదయం 6.08 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ 56.30 గంటలు నిర్విఘ్నంగా కొనసాగింది. ఉపగ్రహాల ప్రయోగానికి భారత్ తిరుగులేని ఆయుధమైన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ - సీ25 (పీఎస్ఎల్వీ-సీ25)లో మార్స్ ఆర్బిటర్ మిషన్‌ను ఉంచి.. మంగళవారం మధ్యాహ్నం 2.38.26 గంటలకు ఆకాశంలోకి ప్రయోగించింది. 44.5 మీటర్ల పొడవైన పీఎస్ఎల్వీ ఉపగ్రహ వాహకనౌక 1,337 కిలోల బరువున్న మార్స్ ఆర్బిటర్‌ను మోసుకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. ఆర్బిటర్‌ను భూమికి దూరంగా భూ వృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టాల్సి వుండటంతో.. రాకెట్లో అత్యంత శక్తివంతమైన ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్లను వినియోగించారు. ఆరు స్ట్రాపాన్ బూస్టర్లలో 75 టన్నుల ఘన ఇంధనం, దీని తరువాత 139 టన్నుల ఘన ఇంధనంతో 112.75 సెకన్లలో 57.678 కిలోమీటర్ల ఎత్తులో మొదటి దశ, ఆ తర్వాత 42 టన్నుల ద్రవ ఇంధనంతో 264.74 సెకన్లలో 132.311 కిలోమీటర్ల ఎత్తులో రెండో దశ, 7.5 టన్నుల ఘన ఇంధనంతో 583.60 సెకెన్లలో 194.869 కిలోమీటర్ల ఎత్తులో మూడో దశ, 2.5 ద్రవ ఇంధనంతో 2,619.72 సెకన్లకు 342.515 కిలోమీటర్ల ఎత్తులో నాలుగో దశను దిగ్విజయంగా పూర్తి చేసింది. తొలి మూడు దశలను విజయవంతంగా పూర్తి చేయటంతో నాలుగో దశ మాత్రం 1,600 సెకెండ్ల పాటు అందరిలోనూ ఉత్కంఠ. ఎందుకంటే ఈ దశలో దక్షిణ ఫసిఫిక్ మహాసముద్రంలో నలంద, యమున నౌకల మీద ఏర్పాటు చేసిన రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలు రాకెట్ గమనాన్ని పర్యవేక్షించాయి. అయితే ఈ 1,600 సెకెండ్ల పాటు నౌకల్లో ఏర్పాటు చేసిన రాడార్ ట్రాకింగ్ సిస్టం అద్భుతంగా పనిచేయడంతో ఎక్కడా ఎలాంటి తడబాటు జరగకుండా ప్రయోగం దిగ్విజయంగా జరిగింది. మొత్తం 49.56 నిమిషాల్లో మార్స్ ఆర్బిటర్‌ను భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అక్కడి నుంచి ఉపగ్రహంలో వుండే ఇంధనం సాయంతో నాలుగు సార్లు భూ కక్ష్యలో ఉపగ్రహం పరిభ్రమించిన అనంతరం అంగారకుడివైపుకు మళ్లించే ప్రక్రియను చేపడతారు. ఆ తరువాత 310 రోజుల ప్రయాణం అనంతరం.. అంటే 2014 సెప్టెంబర్ 24 నాటికి అంగారకుడి కక్ష్యలో తిరుగుతూ ఆ గ్రహంపై పరిశోధనలను ప్రారంభిస్తుంది. ఇస్రో శాస్త్రవేత్తలు ముందుగా అనుకున్నది అనుకున్నట్టుగా ప్రయోగం జరగడం, మొట్టమొదటి గ్రహాంతర ప్రయోగం విజయవంతం కావడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ విజయం జాతికి అంకితం: రాధాకృష్ణన్ ఇది సమిష్టి విజయమని.. ఈ విజయం జాతికి అంకితమని ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.రాధాకృష్ణన్ పేర్కొన్నారు. మార్స్ ఆర్బిటర్ ప్రయోగం అనంతరం ఆయన షార్‌లో మాట్లాడుతూ.. ఇది గ్రహాంతర ప్రయోగం కావడంతో ముందునుంచి అచితూచి అడుగులు వేశామన్నారు. అయితే ప్రయోగం విషయంలో 5 నిమిషాలు పెంచి చేశామన్నారు. భూ కక్ష్యనుంచి అంగారకగ్రహం కక్ష్యలోకి చేరుకోవడానికి ఈ 5 నిమిషాల వ్యవధిని పెంచామని చెప్పారు. ఈ ప్రయోగాన్ని అక్టోబర్ 28న చేయాలని నిర్ణయించామని రాడార్ ట్రాకింగ్ వ్యవస్థ ఇబ్బందులతో వారం రోజులు వాయిదా వేసుకున్నామని చెప్పారు. ఈ ప్రయోగంలో 9 రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలు ఊహించినదానికంటే ఎక్కువగా పనిచేశాయన్నారు. పీఎస్ఎల్వీ మరోమారు తనసత్తా చాటుకుని ఈ ప్రయోగంతో రజతోత్సవ పీఎస్ఎల్వీగా గుర్తింపు పొందిందని చెప్పారు. అంగారకప్రయోగం ఇస్రో చరిత్రలో చరిత్రాత్మకమైన ప్రయోగమన్నారు. ఈ స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని భారీ ప్రయోగాలకు శ్రీకారం చుడతామని వెల్లడించారు. ప్రధానమంత్రి కార్యాలయ వ్యవహారాల మంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ.. అంగారక ప్రయోగం విజయవంతం కావటం దేశానికే గర్వకారణమన్నారు. మిషన్‌కంట్రోల్ రూంలో శాస్త్రవేత్తలు ఎస్.రామకృష్ణన్, ఎం.వై.ఎస్.ప్రసాద్, ఎం.చంద్రదత్తన్, కున్నికృష్ణన్, ఎస్.కె.శివకుమార్, ఎ.ఎస్.కిరణ్‌కుమార్, అరుణన్, ప్రొఫెసర్ యు.ఆర్.రావు, ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కె.కస్తూరిరంగన్, సీనియర్ ప్రొఫెసర్ యశ్పాల్ తదితర శాస్త్రవేత్తలు ప్రయోగ విశేషాలను వివరించారు. -
ఆ పది నిముషాల్లో ఏం జరిగింది?
-
మ.. మ.. మార్స్
-
నింగికేసి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ25
-
మంగళయాన్ ఖర్చు రూ. 450 కోట్లు
సూళ్లూరుపేట : అంగారకుడిపైకి ఇస్రో ప్రయోగిస్తున్న మంగళయాన్ ప్రాజెక్టును అతి తక్కువ ఖర్చుతో.. కొద్ది సమయంలోనే పూర్తి చేశారు. ఇదే గ్రహంపైకి నాసా జరిపిన మావెన్ ప్రాజెక్టుకు దాదాపు 4,200 కోట్ల రూపాయల ఖర్చు అయింది. ప్రయోగం జరపడానికి ఐదేళ్లు పట్టింది. అయితే ఇస్రో చేపట్టిన మంగళ్యాన్ ప్రాజెక్టుకు కేవలం 450 కోట్ల రూపాయల ఖర్చు అయ్యింది. దీనిని ఇస్రో.. చంద్రయాన్ లాగే 18 నెలల కాలంలో పూర్తి చేసింది. మంగళ్యాన్ కూడా చంద్రయాన్ లాగా విజయవంతమైతే ఇస్రో పేరు ప్రపంచ వ్యాప్తంగా మరోసారి పతాక శీర్షికల్లోకి వస్తుంది. ఏ రకంగా చూసినా ఇస్రో కంటే నాసా చాలా పెద్ద సంస్థ. ఇలాంటి సంస్థతో పోటీ పడుతూ చేపట్టిన ప్రాజెక్టుల్ని విజయవంతం చేయాలంటే.. అందుబాటులో ఉన్న అన్ని వనరుల్ని సమర్ధంగా వినియోగించుకోవాలనేది ఇస్రో ప్రణాళిక. మొదట్నుంచీ ఇదే పద్ధతి పాటిస్తూ.. అనూహ్యమైన విజయాల్ని సాధిస్తోంది. మిగిలిన అన్ని అంతరిక్ష సంస్థల కంటే.. సాఫ్ట్‌వేర్‌ను మెరుగ్గా వినియోగించుకోవడం వల్ల తక్కువ ఖర్చుతో ప్రాజెక్టులు పూర్తి చేయగలుగుతున్నామని ఇస్రో వర్గాలు చెబుతున్నాయి. మంగళ్‌యాన్‌ను తీసుకెళుతున్న పీఎస్ఎల్వీ ప్రయోగం ఇస్రో చరిత్రలో 25వది. ఈ రకంగా కూడా మంగళ్యాన్ ప్రాజెక్టు.. ఇస్రోకు అత్యంత ముఖ్యమైనది. ఇక సౌరకుటంబంలోని అంగారక గ్రహాన్ని ఇంగ్లీషులో మార్స్ అంటారు. దీన్ని భూమిని పోలిన గ్రహం అని కూడా అంటారు. ఇది భూమికి 400 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. దీన్ని పరిశీలించటానికి ఇప్పటికే అంతరిక్షంలో పలు మిషన్స్ ఉన్నాయి. మెదటిసారిగా 2001లో అమెరికాకు చెందిన మార్స్ ఓడిస్సీ ఇక్కడ పరిశోధనలు ప్రారంభించింది. తర్వాత 2003లో యూరప్ కు చెందిన మార్స్ ఎక్స్ ప్రెస్, 2005లో అమెరికాకు చెందిన మార్స్ రికన్ సైన్స్ ఆర్బిటార్ , 2003లోనే అమెరికా మరోసారి మార్స్ ఎక్స్ ప్లోరేషన్ రోవర్ 2011లో అమెరికాకు చెందిన మార్స్ సైన్స్ లెకారెటరీ క్యూర్యాసిటీ మిషన్ల ద్వారా పరిశీలనలు జరుపుతున్నాయి. -
నింగికేసి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ25
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మార్స్ మిషన్‌లో కీలకఘట్టానికి తెర లేచింది. మార్స్ ఆర్బిటర్ మిషన్‌ను మోసుకుంటూ ఉపగ్రహ వాహకనౌక పీఎస్ఎల్వీ సీ25 నింగికేసి దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని షార్ నుంచి ఈ మధ్యాహ్నం 2.38 గంటలకు దీన్ని ప్రయోగించారు. నిప్పులు చిమ్ముకుంటూ పీఎస్ఎల్వీ సీ25 అంగారక యాత్రకు బయలుదేరింది. కేంద్రమంత్రి నారాయణస్వామి సహా పలువురు ప్రముఖులు ఈ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. యావత్ దేశం ఈ మధుర ఘట్టాన్ని అమితాసక్తితో తిలకించింది. మార్స్ మిషన్ విజయవంతం కావాలని ఆకాంక్షించింది. ఈ ప్రయోగంపై ప్రపంచదేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. పీఎస్ఎల్వీ ఉపగ్రహ వాహకనౌక రోదసీ ప్రయాణానికి 40 నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టే అవకాశముంది. సెప్టెంబరు 14, 2014 నాటికి ఉపగ్రహం అంగారకుడిని చేరనుంది. మొత్తం 5 రకాల పరికరాలను అంగారకుడిపైకి ఉపగ్రహం తీసుకెళ్లనుంది. లైమాన్ ఫొటో ఆల్ఫా ఫొటోమీటర్(ల్యాప్), మీథేన్ సెన్సార్ ఫర్ మార్స్, మార్స్ ఎక్సోస్ఫెరిక్ న్యూట్రల్ కాంపోజిషన్ అనలైజర్, మార్స్ కలర్ కెమెరా, థర్మల్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్ పరికరాలను అంగార గ్రహానికి మోసుకెళ్లింది. ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ ప్రయోగ ప్రక్రియను పర్యవేక్షించారు. ఈ ప్రయోగంతో గ్రహాంతర ప్రయోగాలకు భారత్ శ్రీకారం చుట్టింది. సుమారు రూ.455 కోట్ల వ్యయంతో ఈ ప్రయోగాన్ని చేపడుతున్నారు. దీన్ని అక్టోబర్ 28నే నిర్వహించాలని ముందుగా నిర్ణయించినా రాడార్ ట్రాకింగ్ వ్యవస్థ ఇబ్బందికరంగా మారడంతో నవంబర్ 5కు వాయిదా వేశారు. అంగారకుడిపైకి వెళ్లాలంటే 30 కోట్ల నుంచి 35 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి ఉంది. దాంతో రాకెట్ గమనాన్ని నిర్దేశించే రాడార్ ట్రాకింగ్ వ్యవస్థ కోసం బెంగళూరు ఇస్ట్రాక్ సెంటర్లో 32 డీప్‌స్పేస్ నెట్వర్క్, అండమాన్ దీవుల్లోని మరో నెట్‌వర్క్‌తో పాటు నాసాకు చెందిన మాడ్రిడ్ (స్పెయిన్), కాన్బెర్రా (ఆస్ట్రేలియా), గోల్డ్‌స్టోన్ (అమెరికా)ల్లోని మూడు డీప్ స్పేస్ నెట్‌వర్క్‌లతో పాటు మరో నాలుగు నెట్‌వర్క్‌ల సాయం కూడా తీసుకున్నారు. నాలుగో దశలో రాకెట్ గమనాన్ని తెలిపేందుకు దక్షిణ ఫసిపిక్ మహాసముద్రంలో రెండు నౌకలపై తాత్కాలిక రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఇందుకోసం భారత షిప్పింగ్ కార్పొరేషన్ నుంచి అద్దెకు తీసుకున్న నలంద, యుమున నౌకలు ఆస్ట్రేలియా-దక్షిణ అమెరికా మధ్యలో నిర్దేశిత స్థలానికి చేరుకుని సిద్ధంగా ఉన్నాయి. -
వివాదాస్పదమవుతున్న అంగాకర యాత్ర!
-
వివాదాస్పదమవుతున్న అంగాకర యాత్ర!
హైదరాబాద్ : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రతిష్టాత్మకంగా జరపనున్న అంగారక యాత్ర వివాదాస్పదం అవుతోంది. కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్న పనికి నిర్ణయించిన ముహూర్తంపై జ్యోతిష్యులు పెదవి విరుస్తున్నారు. జ్యోతిషశాస్త్రంలో అమంగళానికి చిహ్నమైన మంగళవారం ప్రయోగం జరపడం అంత సమంజసం కాదని ప్రముఖ జ్యోతిష, వాస్తు సిద్ధాంతి పుల్లెల సత్యనారాయణ వాదిస్తున్నారు. అనుకూలమైన శుభ ముహుర్తంలో ప్రయోగం జరిపితే మరిన్ని ఫలితాలు వస్తాయని ఆయన చెబుతున్నారు. మరోవైపు అంగారక యాత్రకు సర్వం సిద్ధమైంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మంగా చేపడుతున్న మార్స్ మిషన్ కౌంట్‌డౌన్ నిర్విఘ్నంగా కొనసాగుతోంది. 44.5 మీటర్ల ఎత్తున్న పీఎస్ఎల్వీ 25 ఉపగ్రహ వాహకనౌక, 1337 కిలోల బరువున్న మార్స్ ఆర్బిటర్ మిషన్‌ను మోసుకుంటూ ఈ మధ్యాహ్నం 2 గంటల 38 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగంతో గ్రహాంతర ప్రయోగాలకు భారత్ శ్రీకారం చుట్టనుంది. ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్ మాటల్లో చెప్పాలంటే మన సాంకేతిక పరిజ్ఞాన సమార్ధ్యాన్ని ప్రపంచడానికి చాటడమే ప్రధాన లక్ష్యం. అమెరికా, రష్యా, చైనా, యూరప్ తదితరాలు ఇప్పటికే అంగారకుడిపై పరిశోధనలు చేపట్టిన నేపధ్యంలో మనకూ ఆ సామర్ధ్యముందని నిరూపించేందుకు ఈ అంగారకయాత్ర. చేపడుతున్నారు. సుమారు 445కోట్ల వ్యయంతో ఈ అంగారకయాత్ర కోసం చేపట్టారు. ఈ యాత్రను అక్టోబర్ 28నే నిర్వహించాలని ముందుగా నిర్ణయించినా రాడార్ ట్రాకింగ్ వ్యవస్థ ఇబ్బందికరంగా మారడంతో నవంబర్ 5కు వాయిదావేశారు. అంగారకుడిపైకి వెళ్లాలంటే 30 కోట్ల నుంచి 35 కోట్ల కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి ఉంది. దాంతో రాకెట్ గమనాన్ని నిర్ధేశించే రాడార్ ట్రాకింగ్ వ్యవస్థ కోసం బెంగళూరు ఇస్ట్రాక్ సెంటర్లో 32 డీప్ స్పేష్ నెట్వర్క్, అండమాన్ దీవుల్లోని మరో నెట్వర్క్, స్పెయిన్, ఆస్ట్రేలియా, అమెరికాల్లోని మూడు డీప్ స్పేస్ నెట్‌వర్క్‌లతో పాటు మరో నాలుగు నెట్‌వర్క్‌ల సాయం తీసుకున్నారు. నాలుగో దశలో రాకెట్ గమనాన్ని తెలిపేందుకు దక్షిణ ఫసిపిక్ మహాసముద్రంలో రెండు నౌకలపై తాత్కాలి రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు.