
మంగళయాన్ ఖర్చు రూ. 450 కోట్లు
సూళ్లూరుపేట : అంగారకుడిపైకి ఇస్రో ప్రయోగిస్తున్న మంగళయాన్ ప్రాజెక్టును అతి తక్కువ ఖర్చుతో.. కొద్ది సమయంలోనే పూర్తి చేశారు. ఇదే గ్రహంపైకి నాసా జరిపిన మావెన్ ప్రాజెక్టుకు దాదాపు 4,200 కోట్ల రూపాయల ఖర్చు అయింది. ప్రయోగం జరపడానికి ఐదేళ్లు పట్టింది. అయితే ఇస్రో చేపట్టిన మంగళ్‌యాన్ ప్రాజెక్టుకు కేవలం 450 కోట్ల రూపాయల ఖర్చు అయ్యింది. దీనిని ఇస్రో.. చంద్రయాన్ లాగే 18 నెలల కాలంలో పూర్తి చేసింది. మంగళ్‌యాన్ కూడా చంద్రయాన్ లాగా విజయవంతమైతే ఇస్రో పేరు ప్రపంచ వ్యాప్తంగా మరోసారి పతాక శీర్షికల్లోకి వస్తుంది.
ఏ రకంగా చూసినా ఇస్రో కంటే నాసా చాలా పెద్ద సంస్థ. ఇలాంటి సంస్థతో పోటీ పడుతూ చేపట్టిన ప్రాజెక్టుల్ని విజయవంతం చేయాలంటే.. అందుబాటులో ఉన్న అన్ని వనరుల్ని సమర్ధంగా వినియోగించుకోవాలనేది ఇస్రో ప్రణాళిక. మొదట్నుంచీ ఇదే పద్ధతి పాటిస్తూ.. అనూహ్యమైన విజయాల్ని సాధిస్తోంది.
మిగిలిన అన్ని అంతరిక్ష సంస్థల కంటే.. సాఫ్ట్‌వేర్‌ను మెరుగ్గా వినియోగించుకోవడం వల్ల తక్కువ ఖర్చుతో ప్రాజెక్టులు పూర్తి చేయగలుగుతున్నామని ఇస్రో వర్గాలు చెబుతున్నాయి. మంగళ్‌యాన్‌ను తీసుకెళుతున్న పీఎస్ఎల్వీ ప్రయోగం ఇస్రో చరిత్రలో 25వది. ఈ రకంగా కూడా మంగళ్‌యాన్ ప్రాజెక్టు.. ఇస్రోకు అత్యంత ముఖ్యమైనది.
ఇక సౌరకుటంబంలోని అంగారక గ్రహాన్ని ఇంగ్లీషులో మార్స్ అంటారు. దీన్ని భూమిని పోలిన గ్రహం అని కూడా అంటారు. ఇది భూమికి 400 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. దీన్ని పరిశీలించటానికి ఇప్పటికే అంతరిక్షంలో పలు మిషన్స్ ఉన్నాయి. మెదటిసారిగా 2001లో అమెరికాకు చెందిన మార్స్ ఓడిస్సీ ఇక్కడ పరిశోధనలు ప్రారంభించింది.
తర్వాత 2003లో యూరప్ కు చెందిన మార్స్ ఎక్స్ ప్రెస్, 2005లో అమెరికాకు చెందిన మార్స్ రికన్ సైన్స్ ఆర్బిటార్ , 2003లోనే అమెరికా మరోసారి మార్స్ ఎక్స్ ప్లోరేషన్ రోవర్ 2011లో అమెరికాకు చెందిన మార్స్ సైన్స్ లెకారెటరీ క్యూర్యాసిటీ మిషన్‌ల ద్వారా పరిశీలనలు జరుపుతున్నాయి.