ఇస్రో, నాసా ఉమ్మడి మిషన్‌కు రంగం సిద్ధం
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో), అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ ఉమ్మడి ప్రయోగానికి రంగం సిద్ధమైంది. నాసా–ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్(నిసార్) శాటిలైట్‌ను వచ్చే ఏడాది మార్చి నెలలో ప్రయోగించబోతున్నారు. ఈ మిషన్ విలువ రూ.5,000 కోట్లు. అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనల్లో రెండు దేశాల మధ్య సహకారంలో ఇదొక మైలురాయిగా మారబోతోంది. అంతరిక్షంపై అత్యాధునిక పరిశోధనల కోసం నిసార్‌ను ప్రయోగిస్తున్నారు. 2009లో మొదలైన ఈ ఆలోచన వాస్తవం రూపం దాల్చబోతోంది. నిసార్ ఉపగ్రహం బరువు 2.8 టన్నులు.
భూమిపై జరిగే మార్పులను ఈ ప్రయోగంతో అత్యంత కచి్చతత్వంతో గుర్తించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. సంప్రదాయ శాటిలైట్ల కంటే ఇది పూర్తిగా భిన్నమైనది. ఇందులో అడ్వాన్స్‌డ్ సింథటిక్ అపెర్చర్ రాడార్ టెక్నాలజీ ఉపయోగించారు. సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జీఎస్‌ఎల్‌వీ ఎంకే–2 రాకెట్ ద్వారా నిసార్‌ను ప్రయోగించనున్నారు.
ఇది మిషన్ కాల వ్యవధి మూడేళ్లు. మరోవైపు స్పేస్ డాకింగ్ ఎక్స్‌పరిమెంట్(స్పేడెక్స్) ఉపగ్రహాల చిత్రాలను ఇస్రో విడుదల చేసింది. పీఎస్‌ఎల్‌వీ–సి60 రాకెట్ ద్వారా వీటిని త్వరలో ప్రయోగించనున్నారు. ఈ రెండు ఉపగ్రహాలతో స్పేస్ డాకింగ్ టెక్నాలజీలో భారత్ ముందంజ వేయనుంది. స్పేడెక్స్ మిషన్‌లో భాగంగా పీఎస్‌ఎల్‌వీ ఆర్బిటాల్ ఎక్స్‌పరిమెంట్ మాడ్యూల్–4(పోయెం–4) ద్వారా 24 శాస్త్రీయ ప్రయోగాలు చేయాలని ఇస్రో నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment