చంద్రయాన్ 3 విజయంతో జోష్ మీదున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో.. సూర్యుడి రహస్యాలు ఛేదించేందుకు మరో కొత్త మిషన్ ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. సూర్యుడిపై పరిశోధనల కోసం రూపొందించిన ‘ఆదిత్య ఎల్-1’ ప్రయోగానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. సెప్టెంబర్ 2న ఉదయం 11.50 గంటలకు శ్రీహరి కోట నుంచి ప్రయోగించనున్నారు. దీనిని పీఎస్‌ఎల్‌వీ-సీ57 రాకెట్ మోసుకుంటూ నింగిలోకి దూసుకెళ్లనుంది.
ఆదిత్య ఎల్1 ప్రత్యేకతలు
సూర్యుడి పుట్టుక, అక్కడి పరిస్థితులను తెలుసుకునేందుకు ఇస్రో ఆదిత్య ఎల్-1 ప్రయోగం చేస్తుంది. కాగా సూర్యుడు.. భూమి మధ్య దూరం 150 మిలియన్ కిలోమీటర్లు. ఆదిత్య వ్యోమనౌకను సూర్యునికి దగ్గరగా పంపిచరు. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాంగ్రేజ్ పాయింట్-1 (ఎల్-1) వద్ద ఉండే సుదీర్ఘమైన దీర్ఘ వృత్తాకార కక్ష్యలోకి చేరుస్తారు. సుమారు 127 రోజుల ప్రయాణం తర్వాత ఆదిత్య ఎల్-1 ఈ కక్ష్యలోకి చేరుతుంది. దీని వల్ల గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసేందుకు వీలు లభిస్తుంది.
ఇదే తొలి ప్రయోగం
సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు భారత్ ప్రయోగిస్తున్న తొలి స్పేస్‌క్రాఫ్ట్ ఇదే కావడం విశేషం. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఆస్ట్రేలియా, ఇతర దేశాల అంతరిక్ష సంస్థల సాయంతో సూర్యుడిపై అధ్యయనాలను ఇస్రో చేపడుతోంది. తక్కువ ఇంధనాన్ని వినియోగించుకొని నిర్దేశిత కక్ష్యలో ఎక్కువ కాలం కొనసాగేలా ప్రయోగం చేపడుతున్నారు.
ఈ ఉపగ్రహం ద్వారా అతి దగ్గరి నుంచి సౌర వ్యవస్థపై నిఘా పెట్టవచ్చు. తద్వారా సౌర తుఫానులు, సూర్యుడి పుట్టుక, అక్కడి వాతావరణం, పరిస్థితులపై అధ్యయనం చేయవచ్చు. కరోనాగ్రఫీ పరికరం సాయంతో సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం.
చదవండి: చంద్రయాన్-3 సక్సెస్.. ఇస్రో ఉద్యోగుల జీతాలు ఎంతో తెలుసా?
ఏడు పేలోడ్స్
సుమారు 1500 కిలోల బరువైన ఆదిత్య ఎల్1 శాటిలైట్‌లో మొత్తం ఏడు పేలోడ్స్ ఉండనున్నాయి. సూర్యుడిపై ఉప సూర్యగోళం నుంచి ప్రసరించే అత్యంత శక్తిమంతమైన కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు అనువుగా ఈ పేలోడ్‌లను రూపొందించారు. ఇవి ఎలక్ట్రోమాగ్నెటిక్, మాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్ల సాయంతో సూర్యుడి లోపల పొరలైన ఫొటోస్పియర్, క్రోమోస్పియర్, వెలుపల ఉండే కరోనాను అధ్యయనం చేస్తాయి. ఎల్-1 ప్రదేశానికి ఉన్న సానుకూలతల దృష్ట్యా నాలుగు పరికరాలు నేరుగా సూర్యుడిని అధ్యయనం చేస్తాయి. మిగతా మూడు సాధనాలు.. సమీపంలోని సౌర రేణువులు, అయస్కాంత క్షేత్రాల గురించి శోధిస్తాయి.
ఈ క్రమంలో ఇప్పటి వరకు సూర్యుడి మీదకు ఏఏ దేశాలు ప్రయోగాలు చేశాయో.. వివిధ దేశాలు ప్రయోగించిన సోలార్ మిషన్లకు సంబంధించిన సమాచారం తెలుసుకుందాం. ఇప్పటి వరకూ అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, జర్మన్ ఏరోస్పేస్ సెంటర్, చైనా మాత్రమే సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఉమ్మడిగా, వేర్వేరుగా స్పేస్ మిషన్‌లను ప్రయోగించాయి.
అమెరికా, నాసా
ఖగోళ చరిత్రలో తొలిసారి అమెరికాకు చెందిన నాసా 2018 ఆగస్టు 12న పార్కర్ సోలార్ ప్రోబ్ పేరుతో ప్రయోగించిన ఓ రోదసీ నౌక సూర్యుడి వెలుపలికక్షలోకి విజయవంతంగా ప్రవేశించింది. ఈ మిషన్.. సుదీర్ఘకాలం ప్రయాణించి 2021లో దాదాపు 2 మిలియన్ డిగ్రీల ఫారన్‌హీట్ ఉష్ణోగ్రత ఉండే సూర్యుడి కరోనాను(సూర్యుడి చుట్టూ ఉండే వలయం) తాకింది. అక్కడ ధూళి కణాలు, అయస్కాంత క్షేత్రాలకు సంబంధించిన కొన్ని నమూనాలను సేకరించి పంపించింది. నాసా ప్రకారం ఓ రోదసీ నౌక సూర్యుడి ఉపరితల వాతావారణాన్ని తాకడం అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో ఇదే తొలిసారి. దీని వ్యయం లక్ష కోట్లు..(1.5 బిలియన్ డాలర్లు)
చదవండి: ఆదిత్య-ఎల్ 1 ప్రయోగం.. ఇస్రో చైర్మన్ ప్రత్యేక పూజలు
అంతకముందు 1995 డిసెంబర్‌లో నాసా, ఈఎస్‌ఏ (యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ), జక్సా (జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ) సంయుక్తంగా సోలార్ అండ్ హీలియోస్పిరిక్ అబ్జర్వేటరీ (SOHO)ను ప్రారంభించాయి. 1997 ఆగస్టులో అధునాతన కంపోజిషన్ ఎక్స్‌ప్లోరర్, అక్టోబర్ 2006లో సోలార్ టెరెస్ట్రియల్ రిలేషన్స్ అబ్జర్వేటరీ, ఫిబ్రవరి 2010లో సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ, జూన్ 2013లో ఇంటర్‌ఫేస్ రీజియన్ ఇమేజింగ్ స్పెక్ట్రోగ్రాఫ్ వంటి ఇతర క్రియాశీల సౌర మిషన్లను నాసా ప్రయోగించింది.
2020 ఫిబ్రవరిలోనూ.. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీతో కలిసి నాసా మరోసారి సోలార్ ఆర్బిటర్‌ను ప్రయోగించింది. దీనిని సూర్యుడి సృష్టి, సౌర వ్యవస్థలో నిరంతరం మారుతున్న వాతావరణాన్ని సూర్యుడు ఎలా నియంత్రిస్తున్నాడో తెలుసుకునేందుకు రూపొందించారు. అయితే నాసా ప్రయోగించిన వాటన్నింటిలో సూర్యడికి అతి దగ్గరగా వెళ్లిన స్పేస్ క్రాఫ్ట్ పార్కర్ సోలార్ ప్రోబ్ మాత్రమే. ఏడేళ్ల పాటు పనిచేసేలా తయారు చేసిన ఈ స్పేస్ క్రాఫ్ట్ సాధారణంగా భూమికి, సూర్యుడికి మధ్య దూరంలో పావు వంతు దూరంలో పరిభ్రమిస్తుంటుంది.
జపాన్
ఇక జపాన్‌కు చెందిన జక్సా (జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ) 1981లో తమొదటి సౌర పరిశీలన ఉపగ్రహం హినోటోరి Hinotori (ASTRO-A)ను ప్రారంభించింది. హార్డ్ ఎక్స్-కిరణాలను ఉపయోగించి సౌర మంటలను అధ్యయనం చేయడం దీని లక్ష్యం. దీని తర్వాత 1991లో Yohkoh (SOLAR-A). 1995లో NASA, ESA సమన్వయంతో SOHO, 1998లో నాసాతో కలిసి ట్రాన్సియెంట్ రీజియన్, కరోనల్ ఎక్స్‌ప్లోరర్ (TRACE), 2006లో హినోడ్ (సోలార్-బీ)ను ప్రయోగించింది. యూఎస్, యూకే సహకారంతో జపాన్ దీనిని ప్రయోగించింది. ఇది భూమిపై చంద్రుడి ప్రభావాన్ని అధ్యయనం చేస్తుంది.
యూరప్
1990 అక్టోబర్‌లో యూరప్ (యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ) సూర్యుని పైన, దిగువన ఉన్న అంతరిక్ష వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి యులిసెస్‌ను ప్రారంభించింది. NASA ,JAXA సహకారంతో కాకుండా ESA 2001 అక్టోబర్‌లో ప్రోబా-2ను ప్రయోగించింది. ఇది దాదాపు ఎనిమిది సంవత్సరాలు విజయవంతమైన ప్రోబా-1 సిరీస్‌కు కొనసాగింపు. ప్రోబా-2లో నాలుగు ప్రయోగాలు కొనసాగుతుండగా.. రెండు సూర్యుడికి సంబంధించినవి. ప్రోబా పూర్తి పేరు ప్రాజెక్ట్ ఫర్ ఆన్-బోర్డ్ అటానమీ. ఇక యూరప్ ప్రయోగించే రాబోయే సౌర మిషన్‌లలో 2024లో ప్రోబా-3, 2025లో స్మైల్ మిషన్లు ఉన్నాయి.
చైనా
2022 అక్టోబర్ 8న అడ్వాన్స్‌డ్ స్పేస్-బేస్డ్ సోలార్ అబ్జర్వేటరీని (ASO-S) నేషనల్ స్పేస్ సైన్స్ సెంటర్, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (CAS) విజయవంతంగా ప్రారంభించింది.
ఇప్పుడు ఇస్రో ప్రయోగించే ఆదిత్య ఎల్1 ప్రయోగం ద్వారా సూర్యుని గురించి అధ్యయనం చేస్తున్న అతి కొద్ది దేశాల సరసన భారత్ నిలవబోతోంది. అలాగే వారి కన్నా మెరుగ్గా తక్కువ సమయంలో ఈ ప్రయోగం చేసి పలు రికార్డులు నెలకొల్పడం కూడా ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ఇస్రో చేపట్టబోయే ఆదిత్య ఎల్ 1 ప్రయోగాన్ని ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment