బీజింగ్: ప్రపంచంలోని కొన్ని దేశాలు చైనాను బూచిగా చూపుతూ ప్రత్యేక కూటములుగా ఏర్పడుతున్నాయని, కానీ ఈ ప్రయత్నాలన్నీ చివరకు విఫలమయ్యేవేనని చైనా విమర్శించింది. ఇండోపసిఫిక్ ప్రాంత పరిరక్షణకు భారత్, యూఎస్, ఆస్ట్రేలియా, జపాన్ కలిసి క్వాడ్ కూటమిగా జట్టుకట్టిన సంగతి తెలిసిందే! తాజాగా ఈ కూటమి నేతలు సమావేశమై స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం ప్రతినబూనారు. ఈ ప్రాంతంలో కొన్నాళ్లుగా చైనా మిలటరీ విన్యాసాలు నిర్వహిస్తూ, దీనిపై పట్టుకు యత్నిస్తోంది. తనకు పోటీగా జట్టుకట్టిన క్వాడ్ కూటమిపై చైనా పరోక్ష విమర్శలు గుప్పించింది. చదవండి: (భారతీయులపై ఆంక్షలు.. సమర్థించుకున్న చైనా)
క్వాడ్ సమావేశాన్ని గమనించామని, పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని చైనా ప్రతినిధి హువా చునైంగ్ చెప్పారు. కొన్నాళ్లుగా కొన్ని దేశాలు చైనాపై దాడికి తహతహలాడుతున్నాయని ఆరోపించారు. నిబంధనల ఆధారిత నియతి పేరుతో చైనాను బూచిగా చూపే యత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. ప్రపంచ శాంతికి చైనా పాటుపడుతోందని, ప్రపంచాభివృద్ధికి చైనా అభివృద్ధి కీలకమని మర్చిపోవద్దన్నారు. అంతర్జాతీయ నియతిని తామేమీ ఉల్లంఘించడంలేదన్నారు. ఐరాస నిర్ధారిత నియమాలను, చట్టాలను చైనా గౌరవిస్తోందని తెలిపారు. చదవండి: (సిక్కు మెరైన్‌కు తలపాగా ధరించే అవకాశం.. 250 ఏళ్ల చరిత్రలో)
నిబంధనలు కొన్ని దేశాలు మాత్రమే రూపొందిస్తాయని తాము భావించడం లేదని, అమెరికా మాత్రం తాను నిర్దేశించే నియమాల ప్రకారం ప్రపంచం నడవాలని భావిస్తోందని దుయ్యబట్టారు. అమెరికా, కొన్ని దేశాలు కలిసి ఇలా సొంత నిబంధనలు ఏర్పరిచి ఏదో సాధిస్తామంటే చివరకు ఏమీ జరగదని, అవన్నీ విఫలమవుతాయని అభిప్రాయపడ్డారు. ప్రచ్ఛన్న యుద్ధంనాటి ఆలోచనల నుంచి ఆయా దేశాలు బయటకురావాలన్నారు. చదవండి: (సరిహద్దులో చైనా దూకుడు!)
Comments
Please login to add a commentAdd a comment