చైనా ఆధిపత్యానికి చెక్‌ పెట్టే దిశగా.. | India Readies For QUAD And 2 Plus 2 Dialogue | Sakshi
Sakshi News home page

చైనాకు చెక్‌ పెట్టేందుకు ఆ 4 దేశాలు..

Published Fri, Sep 18 2020 2:55 PM | Last Updated on Fri, Sep 18 2020 3:43 PM

India Readies For QUAD And 2 Plus 2 Dialogue - Sakshi

న్యూఢిల్లీ: ఇండో- ఫసిఫిక్‌ సముద్రజలాలపై ఆధిపత్యం సాధించే దిశగా చైనా చేస్తున్న ప్రయత్నాలు తిప్పికొట్టేందుకు అమెరికా, భారత్‌, జపాన్‌, ఆస్ట్రేలియా పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. డ్రాగన్‌ ప్రణాళికలకు చెక్‌ చెక్‌పెట్టేలా పరస్పర సైన్య సహకారాలు అందించుకునేందుకు ఉద్దేశించిన క్వాడ్‌(క్వాడ్రిలాటరల్‌ సెక్యూరిటీ డైలాగ్‌) గురించి చర్చించేందుకు త్వరలోనే సమావేశం కానున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే నెలాఖరులో భారత్‌, అమెరికా విదేశాంగ మంత్రులు న్యూఢిల్లీలో 2+2 చర్చలకు సిద్ధమైనట్లు సమాచారం. ఇక విదేశీ వ్యవహారాల మంత్రి జైశకంర్‌, అగ్రరాజ్య విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియోతో పాటు జపాన్‌ విదేశాంగ మంత్రి తోషిమిత్సు మెటేగి, ఆస్ట్రేలియా ఫారిన్‌ మినిస్టర్‌ మారిస్‌ పైన్‌ తదితరులు భేటీ అయి తాజా అంతర్జాతీయ పరిణామాలు, శాంతి సుస్థిరతకై ప్రణాళికలతో పాటు ఆయా దేశాలకు సంబంధించిన వివిధ అంశాల గురించి చర్చించనున్నారు. (చదవండి: మన గస్తీని ఏ శక్తీ అడ్డుకోలేదు)

చైనా ఆట కట్టించేందుకు..
ఇప్పటికే ఈ సమావేశానికి సంబంధించిన వేదిక, తేదీని ఖరారు చేయాల్సి ఉంది. అయితే జపాన్‌లో ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ విషయంలో కాస్త ఆలస్యం జరిగినట్లు తెలుస్తోంది. కాగా షింజో అబే ప్రధాని పదవి నుంచి తప్పుకోవడంతో ఆయన స్థానంలో యోషిహిడే సుగా ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇక 2+2 చర్చల్లో భాగంగా అమెరికా, భారత రక్షణ మంత్రులు కూడా న్యూఢిల్లీలో సమావేశమై తాజా పరిస్థితుల గురించి చర్చించనున్నారు. ఇక క్వాడ్‌ ప్రత్యేకంగా ఏ దేశాన్ని టార్గెట్‌ చేయనప్పటికీ వాస్తవాధీన రేఖ వెంబడి చైనా ఆర్మీ దుందుడుకు చర్యలు, ఇండో- ఫసిఫిక్‌, దక్షిణ చైనా సముద్ర జలాల్లో డ్రాగన్‌ దేశం అనుసరిస్తున్న వైఖరి తదితర అంశాలపైనే ప్రధానంగా చర్చ జరుగనున్నట్లు సమాచారం. (చదవండి: ప్రచార యుద్ధంలో చైనా కొత్త తంత్రం)

అదే విధంగా దక్షిణ చైనా సముద్రంపై పైచేయి సాధించేందుకు చైనా చేస్తున్న కుట్రలను తిప్పికొట్టేందుకు, మలబార్‌ తీరంలో ఈ నాలుగు దేశాలు సంయుక్తంగా మరోసారి నావికా దళ విన్యాసాలు నిర్వహించే అంశం గురించి కూడా ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఇండో- ఫసిఫిక్‌ జలాల్లో కృత్రిమ నిర్మాణాలు చేపట్టకుండా, అక్కడ జరుగుతున్న పరిణామాలపై ఓ కన్నేసి ఉంచి, పరస్పరం సమాచారం అందజేసుకునే ఉద్దేశంతో రూపొందిన క్వాడ్‌ చర్చలో భాగంగా జియోస్సేషియల్‌ డేటాతో పాటు పెండింగ్‌లో ఉన్న పలు ప్రాథమిక ఒప్పందాల(సైన్య సహకారం) గురించి ఇండియా-అమెరికాల మధ్య ఈ భేటీలో ఏకాభిప్రాయం కుదిరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

వాణిజ్యపరంగానూ చెక్‌ పెట్టేలా!
కాగా అత్యున్నత స్థాయి మిలిటరీ హార్డ్‌వేర్‌ పరికరాలు, ఆర్మ్‌డ్‌ డ్రోన్స్‌ భారత్‌కు సరఫరా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు అమెరికా ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ప్రపంచ వాణిజ్యంలో చైనా ఆధిపత్యానికి గండికొట్టే దిశగా భారత్‌, ఆస్ట్రేలియా, జపాన్‌ కలిసి పనిచేయనున్నట్లు ఇటీవల పలు నివేదికలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న డ్రాగన్‌ దేశానికి చెక్‌ పెట్టే ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టేందుకు భారత్‌ సిద్ధంగా లేదని, దిగ్గజ దేశాలతో సమన్వయం చేసుకుంటూ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement