అమెరికాలో క్వాడ్ సదస్సు జరుగుతుంటే చైనా ఎందుకు ఉలిక్కిపడుతోంది? అమెరికా, భారత్, ఆ్రస్టేలియా, జపాన్ దేశాలు భద్రతలో పరస్పరం సహకరించుకుంటే చైనాకు వచి్చన ఇబ్బందేంటి? అసలు ఎందుకీ క్వాడ్ ఏర్పాటైంది? దాని లక్ష్యాలేంటి?
క్వాడిలేటరలర్ సెక్యూరిటీ డైలాగ్, సింపుల్‌గా క్వాడ్..అమెరికా, భారత్, ఆ్రస్టేలియా, జపాన్ దేశాలు ఇండో పసిఫిక్ ప్రాంతంలో తమ ప్రయోజనాలు కాపాడుకుంటూ భద్రతలో ఒకరికొకరు సహకరించుకోవడం దీని లక్ష్యం. 2004లో సునామీ అల్లకల్లోలం తర్వాత విపత్తుల సమయంలో సహకరించుకోవడానికి ఏర్పడిన ఈ కూటమి 2007లో అప్పటి జపాన్ ప్రధాని షింజో అబె చొరవతో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో శాంతి భద్రతల స్థాపనే లక్ష్యంగా రూపాంతరం చెందింది.
ఇప్పటివరకు క్వాడ్ సమావేశాలు విదేశాంగ మంత్రులు, దౌత్య ప్రతినిధుల మధ్య మాత్రమే జరిగాయి. ఈ ఏడాది మార్చిలో కరోనా విజృంభణ కారణంగా నాలుగు దేశాల అధినేతలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని యోషిహిడే సుగా తొలిసారిగా ప్రత్యక్షంగా ఈ నెల 24 (శుక్రవారం)న వాషింగ్టన్‌లో సమావేశమవుతున్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యం పెరిగిపోతూ ఉన్న నేపథ్యంలో ఈ క్వాడ్ సదస్సు జరగడం చైనా గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.
చైనాతో చిక్కులు
క్వాడ్ భాగస్వామ్య దేశాలన్నీ చైనాతో ఏదో రకంగా సమస్యల్ని ఎదుర్కొంటున్నాయి. తూర్పు లద్దాఖ్‌లో గత ఏడాది మేలో చైనా బలగాలు భారత్ సైనికులపై దాడి చేసిన తర్వాత వాస్తవాధీన రేఖ వెంబడి ఏర్పడిన ఉద్రిక్తతలు ఇంకా చల్లారలేదు. అంతర్జాతీయ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ ఆర్థికంగా, మిలటరీ శక్తితో భారత్‌కు చైనా సవాళ్లు విసురుతోంది. ఇక డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం నడిచింది.
కరోనా సంక్షోభం సమయంలో ట్రంప్ దానిని చైనా వైరస్ అనడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. ఇక దక్షిణ చైనా సముద్ర జలాలపై చైనా సార్వభౌమాధికారాన్ని ప్రకటించుకోవడం, సెంకకు, డయోయూ దీవులపై డ్రాగన్ దేశానికున్న ఆసక్తి జపాన్‌కు ప్రమాదకరంగా మారింది. కరోనా వైరస్ వూహాన్ ల్యాబ్ నుంచి లీకైందన్న ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని ఆ్రస్టేలియా డిమాండ్ చేయడంతో చైనా ఆ దేశంపై గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ నాలుగు దేశాల కూటమి కలిసి చర్చించుకుంటున్నాయంటే చైనాలో కలవరం మొదలైంది.
చర్చకు వచ్చే అంశాలు
► ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా పట్టు పెరిగిపోతున్న నేపథ్యంలో స్వేచ్ఛాయుత వాణిజ్యం నెలకొల్పడం
► దక్షిణ కొరియా, న్యూజిలాండ్, వియత్నాం దేశాలను కూడా కలుపుకొని క్వాడ్ ప్లస్ కూటమి ఏర్పాటు
► కరోనా సంక్షోభం నేపథ్యంలో ప్రపంచదేశాలన్నింటికీ అందేలా వ్యాక్సిన్ పంపిణీ
► పర్యావరణ మార్పుల్ని ఎదుర్కోవడం
► సైబర్ స్పేస్, జీ5 టెక్నాలజీలో పరస్పర సహకారం
ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా సవాళ్లు
ఇండో పసిఫిక్ ప్రాంతంలో నానాటికీ చైనా ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వస్తోంది. దక్షిణ చైనా సముద్రంలోని దీవుల్లో మిలటరీ స్థావరాలను నిర్మించడం మొదలు పెట్టింది. ఇవన్నీ అమెరికాను ఎక్కువగా ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎందుకంటే అమెరికా వాణిజ్య కార్యకలాపాలాన్నీ ఈ సముద్రం ప్రాంతం ద్వారా ఎక్కువగా జరుగుతాయి. 2019లో 1.9 లక్షల కోట్ల డాలర్ల వ్యాపారం ఇండో పసిఫిక్ ప్రాంతం ద్వారానే జరిగింది. ఈ ఏడాది ఇప్పటి వరకు ప్రపంచ ఎగుమతుల్లో 42 శాతం, దిగుమతుల్లో 38 శాతం ఈ ప్రాంతం ద్వారా జరిగాయని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. అలాంటప్పుడు చైనా ఆ ప్రాంతంలో పట్టుబిగించడం అన్ని దేశాలకు తలనొప్పిగానే మారింది.
మొదట్నుంచీ క్వాడ్ కూటమిని వ్యతిరేకిస్తూ వస్తున్న చైనా.. ఇండో పసిఫిక్ ప్రాంతంలో అనుసరించాల్సిన వ్యూహాలపై క్వాడ్ చర్చిస్తుందన్న వార్తల నేపథ్యంలో ఏం చేయాలో తెలియక రగిలిపోతోంది. దేశాల మధ్య ఒప్పందాలు, ఆయా దేశాల ప్రయోజనాలు కాపాడుకోవడం, వారి మధ్య విశ్వాసం పెరగడానికి దోహదం చేయాలి తప్ప మూడో దేశాన్ని మధ్యలోకి లాగకూడదని చైనా అంటోంది. మూడో పక్షాన్ని టార్గెట్ చేసే ఏ సదస్సు కూడా తన లక్ష్యాలను చేరుకోలేదన్నది చైనా వాదనగా ఉంది. మరోవైపు అమెరికా అఫ్గాన్ నుంచి సేనల్ని వెనక్కి తీసుకు వచ్చాక చైనాను ఎదుర్కోవడంపైనే దృష్టి సారించింది. అంతర్జాతీయంగా అమెరికా తన పూర్వవైభవాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తోంది.
– నేషనల్ డెస్క్, సాక్షి
Comments
Please login to add a commentAdd a comment