శుభమంగళం | isro grand success in first attempt | Sakshi
Sakshi News home page

శుభమంగళం

Published Thu, Sep 25 2014 1:20 AM | Last Updated on Sat, Sep 2 2017 1:54 PM

శుభమంగళం

శుభమంగళం

తొలి యత్నంలోనే ఇస్రో ఘనవిజయం  
అమెరికా, రష్యా, ఈయూల సరసన భారత్
బుధవారం తెల్లవారుజామున మొదలైన ప్రక్రియ
7:17 గంటలకు ఇంధన దహనం ప్రారంభం
24:13 నిమిషాల పాటు మండిన ప్రధాన లామ్ ఇంజన్
7:59కి అంగారక కక్ష్యలోకి ప్రవేశించిన మామ్

 
‘‘చరిత్ర సృష్టించాం..’’ ‘‘అసాధ్యాన్ని సుసాధ్యం చేసేశాం.’’ బుధవారం ఉదయం బెంగళూరులోని ఇస్రో కమాండ్ సెంటర్‌లో ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలివి. తొలి ప్రయత్నంలోనే అంగారకుడిపైకి విజయవంతంగా ఉపగ్రహాన్ని ప్రయోగించిన తరువాత ఇస్రో శాస్త్రవేత్తలను అభినందిస్తూ మోదీ చేసిన ఈ వ్యాఖ్యలు అక్షరాలా సత్యం. ఎందుకంటే ఒకప్పుడు అగ్రరాజ్యం అమెరికా కూడా నాలుగైదు సార్లు ప్రయత్నిస్తేగానీ మార్స్‌పైకి ఓ ఉపగ్రహాన్ని పంపడం సాధ్యం కాలేదు. అంతరిక్ష ప్రయోగాలకు నాంది పలికిన... ఒకప్పటి కమ్యూనిస్టు దిగ్గజం సోవియట్ యూనియన్‌కు కూడా వరుస పరాజయాల తరువాత గానీ విజయం వరించలేదు. యూరోపియన్ యూనియన్ పరిస్థితి కూడా ఇదే. చైనా, జపాన్‌లు ఇప్పటికీ తడబడుతూనే ఉంటే మనం మాత్రం ఒకడుగు ముందుకేసి తొలి ప్రయత్నంలోనే అరుణ గ్రహంపై జెండా పాతేశాం! అందుకే... ఎన్నడూ లేనంతగా ఇస్రో కేంద్రంలో శాస్త్రవేత్తలు, ప్రధాని మోదీ బుధవారం ఆనందంలో మునిగితేలారు. చప్పట్లతో పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తం చే శారు. కరచాలనాలు చేసుకుంటూ.. పరస్పరం కౌగిలించుకుంటూ.. అభినందనలు తెలుపుకొంటూ.. చిన్నపిల్లల్లా కేరింతలు కొట్టారు. దేశం యావత్తూ విజయగర్వంతో పొంగిపోయింది. ప్రపంచం ముందు భారత కీర్తి పతాకను సగర్వంగా ఎగరేసిన ఇస్రోకు సెల్యూట్ చేసింది! అంతరిక్ష ప్రయోగాల్లో అగ్రగామి దేశాలుగా ఉన్న అమెరికా, రష్యా సైతం భళా భారత్ అని ప్రశంసించాయి.
 
 సాక్షి, హైదరాబాద్/సాక్షి, బెంగళూరు: ప్రపంచం యావత్తూ ఉత్కంఠతో ఎదురు చూసిన మంగళ్‌యాన్ ఉపగ్రహం అరుణ గ్రహంపైకి అడుగుపెట్టింది. భారతీయ అంతరిక్ష పరిశోధనలో సువర్ణ ఘట్టంగా లిఖించదగిన ఈ పరిణామంతో భారత కీర్తి పతాకం విను వీధుల్లో రెపరెపలాడింది. బుధవారం ఉదయం ఇస్రో శాస్త్రవేత్తలు 440 న్యూటన్ ద్రవ ఇంజన్‌ను 24 నిమిషాల పాటు మండించడం ద్వారా వ్యోమ నౌక వేగాన్ని తగ్గించి అంగారక కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టగలిగారు. రెండు గంటల అనంతరం అంగారక గ్రహం నుంచి తొలి చిత్రాలను ఉపగ్రహం పంపించిం ది. ఈ అపురూప ఘట్టాన్ని వీక్షించడానికి ప్రధా ని నరేంద్ర మోదీ ఉదయం ఏడు గంటలకే బెంగళూరులోని ఇస్రో నియంత్రణ కేంద్రానికి చేరుకున్నారు. మార్స్ ఆర్బిటర్ మిషన్(మామ్) తుది ఘట్టాన్ని ఆయనతో పాటు ఇస్రో శాస్త్రవేత్తలు ఉత్కంఠతో వీక్షించారు. ఎట్టకేలకు ఉదయం 7:59 గంటలకు ఉపగ్రహం అంగారక కక్ష్యలోకి ప్రవేశించినట్లు సమాచారం అందడంతో శాస్త్రవేత్తలు, ప్రధాని హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఒకరినొకరు అభినందించుకున్నారు.
 
 అంగారక విజయంతో సాధించేదేమిటి..?  
 నవంబరు 5, 2013న శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్‌ఎల్వీ సీ25 రాకెట్‌పై మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రయోగం జరిగినప్పుడు దీనిపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు కూడా పెద్ద అంచనాలేవీ లేవు. గ్రహాంతర ఉపగ్రహ ప్రయోగం మనకు సాధ్యమవుతుందా? లేదా? అందుకు తగ్గ శాస్త్ర, సాంకేతిక సామర్థ్యం మనకు ఉందా? లేదా? అన్నది పరీక్షించుకునేందుకే ఈ ప్రయోగం చేపట్టినట్లు ఇస్రో చెప్పుకుంది. ఒకవేళ దాదాపు 15 కిలోల బరువున్న శాస్త్రీయ పరికరాలను మోసుకెళుతున్న ఉపగ్రహం అరుణగ్ర హ కక్ష్యలోకి చేరితే ఆ గ్రహంపై ఎప్పుడైనా జీవం ఉండిందా? అన్నది తెలుసుకునేందుకు కొన్ని ప్రయోగాలు చేయాలన్నది ఈ ప్రయోగం లక్ష్యాల్లో ఒకటి. అయితే పది నెలల తరువాత... దాదాపు 66.6 కోట్ల కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం తరువాత ఇస్రో ఈ లక్షా్యాన్ని సులువుగానే ఛేదించింది. ప్రపంచ దేశాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. అన్నింటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అంశం దీనికైన ఖర్చు గురించి. మామ్ ప్రయోగానికి ఇస్రో చేసిన ఖర్చు కేవలం 450 కోట్ల రూపాయలు మాత్రమే. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ఇటీవల ఇదే గ్రహంపైకి ప్రయోగించిన మావెన్ అభివృద్ధికి దాదాపు 4,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది!
 
 సుదీర్ఘ ప్రయాణం తరువాత....
 గత ఏడాది డిసెంబరు ఒకటిన భూ కక్ష్యా మార్గాన్ని వీడిన మార్స్ ఆర్బిటర్ మిషన్ పది నెలల సుదీర్ఘ ప్రయాణం తరువాత సెప్టెంబరు 22న అంగారకుడి సమీపానికి చేరింది. భారతీయ కాలమానం ప్రకారం ఉదయం 6.56 నిమిషాలకు ప్రారంభమైన ఈ ప్రక్రియ దాదాపు 72 నిమాషాలపాటు కొనసాగింది. అంగారకుడికి ఆవలివైపున ఉన్న ఉపగ్రహంలోని ప్రధాన ఇంజిన్‌తోపాటు ఎనిమిది థ్రస్టర్లను  దాదాపు 24 నిమిషాల 13 సెకన్లపాటు మండించారు. దీంతో అప్పటివరకూ సెకనుకు 22.14 కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతున్న మామ్ మందగిం చడం మొదలైంది. సెకనుకు 4.4 కిలోమీటర్ల వేగానికి చేరుకోగానే... అంగారకుడి కక్ష్యలోకి చేరడం పూర్తయింది. అంతే... ఇస్రో కేంద్రంలో హర్షధ్వానాలు మిన్నంటాయి!
 
కేసీఆర్ అభినందనలు
అంగారక గ్రహంపై పరిశోధనల కోసం పంపిన మార్స్ ఆర్బిటర్ మిషన్(మామ్)ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. అంతరిక్ష ప్రయోగాల్లో ఎన్నో అద్భుత విజయాలను సాధించడం దేశ పౌరులందరికీ గర్వకారణమని కేసీఆర్ ప్రశంసించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement