‘మామ్’... సలామ్! | Successful Mars mission significant milestone for India | Sakshi
Sakshi News home page

‘మామ్’... సలామ్!

Published Thu, Sep 25 2014 2:01 AM | Last Updated on Sat, Sep 2 2017 1:54 PM

‘మామ్’... సలామ్!

‘మామ్’... సలామ్!

అంతరిక్షరంగంలో వరస విజయాలను నమోదు చేస్తున్న మన శాస్త్రవేత్తలు ఈసారి అత్యంత సంక్లిష్టమైన ప్రయోగంలో చిరస్మరణీయ మనదగ్గ అద్భుతాన్ని సాధించారు. అరుణగ్రహంపైకి నిరుడు నవంబర్‌లో ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) ఉపగ్రహాన్ని బుధవారం ఉదయాన ఆ గ్రహ కక్ష్యలోకి చాకచక్యంగా ప్రవేశపెట్టగలిగారు. ఇదెంత సంక్లిష్టమైనదో తెలియాలంటే ప్రపంచ అంతరిక్షయాన చరిత్రను ఒక్కసారి అవలోకించాలి. అంగారకుడిగా, మంగళగ్రహంగా, కుజుడిగా నామాంతరాలున్న అరుణగ్రహాన్ని పలకరించే సాహసాన్ని కలగన్న దేశాల సంఖ్య తక్కువేమీ కాదు. కానీ, దాన్ని సాకారం చేసుకున్నవి మూడే మూడు... అమెరికా, రష్యా, యూరోప్‌లు. అవి సైతం తొలి ప్రయోగాలను తుస్సుమనిపించాయి. తప్పటడుగులతో చతికిలబడ్డాయి. మొత్తంమీద 51సార్లు ప్రయత్నించి కేవలం 21 సార్లు మాత్రమే విజయం సాధించాయి. అంటే వైఫల్యాల వాటా 59 శాతమన్నమాట! రోదసి రంగంలో రెండు దశాబ్దాల అను భవం గల చైనా మూడేళ్లనాడు అంగారకుడే లక్ష్యంగా పంపిన ఉపగ్రహం భూకక్ష్యను దాటలేక ఉసూరన్నది. జపాన్ చరిత్ర కూడా డిటోయే. మన అంతరిక్ష శాస్త్రవేత్తలు మాత్రం తొలి ప్రయోగంలోనే సత్తా చాటారు. మన దేశాన్ని ఆసియాలోనూ, ప్రపంచంలోనూ అగ్రగామిగా నిలిపారు.
 
ఒక ఉపగ్రహాన్ని భూకక్ష్య దాటించాలంటే...గ్రహాంతరయానానికి పంపాలంటే అందుకెంతో కసరత్తు జరగాలి. బెంగళూరులోని ఇస్రో కమాండ్ సెంటర్‌నుంచి ఉపగ్రహానికి ఒక సంకేతం పంపాక దాని స్పందనెలా ఉన్నదో తెలుసుకోవాలంటే 40 నిమిషాలు పడుతుంది. ఈ వ్యవధి పొడవునా ఎంతో ఏకాగ్రత ఉండాలి. తదేక దృష్టితో దాని గమనాన్ని వీక్షిస్తుండాలి. అవసరాన్నిబట్టి దాని వేగాన్ని నిర్దేశించాలి. అంచనాల్లో ఖచ్చితత్వం లేకపోతే... మదిం పులో ఏమరుపాటుగా ఉంటే మొత్తం ప్రాజెక్టు బూడిదలో పోసిన పన్నీరవు తుంది. భూమికీ, అంగారకుడికీ మధ్య దూరం 65 కోట్ల కిలోమీటర్లు. ప్రతి 780 రోజులకూ అది భూమికి అత్యంత చేరువగా వస్తుంది. అలా వచ్చినప్పుడు అది మనకు 24 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ చేరువయ్యే సమయం సెప్టెంబర్ చివరినుంచి నవంబర్ వరకూ ఉంటుంది కనుక ఉపగ్రహాన్ని చేర్చడానికి సరిగ్గా ఈ సమయాన్ని శాస్త్రవేత్తలు ఎంచుకుంటారు. ఈ దూరాన్ని చేరుకోవడానికి ‘మామ్’ చేసే ప్రయాణ కాలం దాదాపు మూడొందల రోజులు.  కనుక ఈ కాలమంతా శాస్త్రవేత్తలు కళ్లలో ఒత్తులువేసుకుని ఉపగ్రహంలోని అన్ని వ్యవస్థల పనితీరునూ నిశితంగా పరిశీలిస్తుండాలి. దాన్ని పొత్తిళ్లలో బిడ్డగా భావించి అపురూపంగా చూసుకోవాలి. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇదంతా ఒక బృహత్తర క్రతువు. చంద్రయాన్-1లో తమకు ఎదురైన సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకున్న జాగ్రత్తలు ఒకటికి పదిసార్లు చూసుకుని చేయబట్టే ‘మామ్’విజయవంతంగా అంగారక కక్ష్యలోకి చేరగలిగింది. సరిగ్గా దీనికి రెండురోజుల ముందు అంటే...సోమవారంనాడు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా పంపిన మావెన్ ఉపగ్రహం కూడా అంగారక కక్ష్యలో చేరింది.
 
‘మామ్’ అంగారక కక్ష్యలోకి చేరుతూనే రంగుల ఛాయాచిత్రాలను పంపడం ప్రారంభించిందని చెబుతున్నారు. అది భవిష్యత్తులో చేయబోయే పనులు ఇంకా చాలా ఉన్నాయి. అంగారక గ్రహంపైనున్న వాతావరణాన్ని ‘మామ్’ గమనిస్తుంది. అందులోని తేమ ఎలా మాయమైందో కూపీ లాగుతుంది. అది పంపే డేటా వల్ల కోట్లాది సంవత్సరాలక్రితం ఆ గ్రహంపై ఏం జరిగిందో శాస్త్రవేత్తలు అంచనాకు రాగలుగుతారు. ఒకప్పుడు అది జీవరాశితో నిండివుండేదన్న ఊహల్లోని నిజమెంతో రాబడతారు. ఇప్పటికే ఆ గ్రహంపై వాలిన రోదసి నౌకలు అక్కడ మట్టి, రాళ్లు వంటివున్నట్టు తేల్చాయి. అవి దిగిన ప్రదేశాల్లో నీటి జాడ కనబడలేదు. కుజుడి చుట్టూ పరిభ్రమిస్తున్న ఉపగ్రహాలు కూడా ఆ గ్రహాన్ని జల్లెడపడుతున్నాయి. మన ‘మామ్’కూడా ఈ పరిశోధన లకు తోడవుతుంది. ఇన్ని పరిశోధనలకు పయనమైన ఈ ఉపగ్రహానికి అయిన వ్యయం రూ. 450 కోట్లు. అది ప్రయాణించిన దూరాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఒక్కో కిలోమీటరుకు అయిన ఖర్చు దాదాపు రూ. 6 అన్న మాట. ఎంత చౌక!! అందుకే ప్రధాని నరేంద్ర మోదీ హాలీవుడ్ చిత్రం ‘గ్రావిటీ’ నిర్మించడానికైన వ్యయం కంటే మామ్ ప్రాజెక్టుకు తక్కువ వ్యయమైందని శాస్త్రవేత్తలను ప్రశంసించారు.
 
నిశిరాతిరి ఆకాశ వీధిలో ఆరబోసిన ముత్యాల్లా కనబడుతూ కాంతులీనే తారల్లో అంగారకుడిది విశిష్ట స్థానం. ఎందుకంటే మిగిలిన తారలకు భిన్నంగా అంగారకుడు నిత్యం జ్వలిస్తున్నట్టు కనబడతాడు. ఆ గ్రహ ఉపరితలంపై ఆక్సయిడ్ రూపంలో ఉన్న ఇనుమువల్లే ఇలా అరుణవర్ణం కనబడుతుందని శాస్త్రవేత్తలు చెబుతారు. రూపాన్ని చూసి రోమన్లు అంగారకుణ్ణి యుద్ధానికి ప్రతీకగా భావించారు. మన పూర్వీకులు కూడా అరుణగ్రహంగా, అంగారకుడిగా పిలిచింది ఈ కారణంతోనే. నవగ్రహస్తోత్రం ధరణీగర్భ సంభూతుడంటుంది. అంటే భూమి పుత్రుడని అర్ధం. కువలయం అంటే భూమి గనుక కుజుడన్నా ఇదే అర్ధం. కుజుడు భూమిపుత్రుడో, కాదో చెప్పడానికి ఆధారాలేమీ లేవుగానీ... మన భూమికి మాత్రం అది సమీప బంధువు. భూమికి అటు శుక్రుడు, ఇటు కుజుడు ఉంటారు. అంగారకుణ్ణి భూమి పుత్రుడిగా సంభావించి ఆ గ్రహంతో చుట్టరికం కలుపుకున్న గడ్డపై నుంచి తొలిసారి జరిపిన ఈ ప్రయోగం విజయవంతం కావడం మన శాస్త్రవేత్తల దక్షతకూ, వారి పట్టుదలకూ తార్కాణం. స్వావలంబనతో సాధించిన ఈ విజయం భవిష్యత్తులో మరిన్ని విజయాలకు స్ఫూర్తినిస్తుందని ఘంటాపథంగా చెప్పవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement