టీ కాంగ్రెస్ నేతల్లో ‘తెలంగాణ’ గుబులు మొదలైంది. ‘విభజన’ ప్రక్రియ మొదలైందంటూనే.. కేంద్రం అడుగు కూడా ముందుకు వేయకపోవడంపై వారిలో ఆందోళన చెలరేగుతోంది. విభజన ఆగిపోయిందంటూ సీమాంధ్ర కాంగ్రెస్ నేతల ప్రచారం.. ‘తెలంగాణ’ ప్రకటించి నెలన్నర దాటిపోతున్నా ఏర్పాటు అంశం కదలకపోవడం వారికి మింగుడు పడడం లేదు. దీంతోపాటు ‘విభజన’పై కాంగ్రెస్ అధిష్టానం పునరాలోచనలో పడినట్లుగా జరుగుతున్న ప్రచారంతో టీ కాంగ్రెస్ నేతలకు ఊపిరి ఆడడం లేదు. దీంతో ‘తెలంగాణ’పై తేల్చుకోవడానికి మరోసారి హస్తిన యాత్రకు సిద్ధమయ్యారు. ఈ నెల 22న మంత్రులు సహా తెలంగాణ ప్రజాప్రతినిధులంతా ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించారు. ఆదివారం మధ్యాహ్నం మంత్రుల నివాస ప్రాంగణంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. దాదాపు ఐదు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో తొమ్మిది మంది మంత్రులు, 20 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎంపీలు, 15 మంది ఎమ్మెల్సీలతో పాటు డీసీసీల అధ్యక్షులు, డీసీసీబీ, డీసీఎంఎస్, పీసీసీ ఆఫీస్ బేరర్లు సహా సుమారు 90 మంది నేతలు హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఈ సమావేశానికి హాజరు కాలేదు. రేణుక రాకపై రగడ: ఎన్నడూ లేనివిధంగా తెలంగాణ నేతల సమావేశానికి ఎంపీ రేణుకాచౌదరి రావడం చర్చనీయాంశమైంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. రేణుకాచౌదరి రాకపట్ల సమావేశం ఆరంభంలోనే మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, ఎంపీ పొన్నం ప్రభాకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పదేపదే తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన ఆమెను సమావేశానికి ఎందుకు పిలిచారని నిర్వాహకులను నిలదీశారు. ‘కనీసం ఆత్మ గౌరవం లేకుంటే ఎలా? పిలిస్తే మాత్రం ఎందుకు వచ్చినట్లు? తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వచ్చారు? సిగ్గూ, జ్ఞానం ఉన్నవారెవరూ రారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పకుండా సమావేశానికి రావడం అవివేకం’ అని మండిపడ్డారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఒక దశలో వారిద్దరూ సమావేశం నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధమవ్వగా జానారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి సర్దిచెప్పారు. ఇంత జరుగుతున్నా రేణుకా చౌదరి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉండిపోయారని సమాచారం. కాగా, సమావేశం జరుగుతుండగానే ఉస్మానియా జేఏసీ విద్యార్థులు అక్కడికి వచ్చారు. వెంటనే పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలని నినాదాలు చేశారు. ఢిల్లీ వెళితే వాస్తవాలు: కేంద్రం తెలంగాణ ఇస్తున్నట్లు ప్రకటన చేసి 45 రోజులైనా.. ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోవడం పట్ల సమావేశంలో నేతలంతా ఆందోళన వ్యక్తం చేశారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ మాత్రం తెలంగాణ విషయంలో పార్టీ అధిష్టానం వెనక్కి వెళ్లే ప్రసక్తే ఉండదని, ఎవరూ ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు. అయితే, హైదరాబాద్ విషయంలోనే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని డీఎస్ పేర్కొన్నారు. హెచ్‌ఎండీఏ పరిధిని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా విస్తరిస్తూ పోతోందని.. దాని వెనుక ఏదో మతలబు ఉందనే అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ వెళ్లి వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరముందని నేతలంతా అభిప్రాయపడటంతో.. ఈ నెల 22న ఢిల్లీ వెళ్లి అధిష్టానం పెద్దలను కలవాలని తీర్మానించారు. తేలని ‘సభ’: సికింద్రాబాద్‌లోని పరేడ్ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలనే అంశంపై సమావేశంలో ఏకాభిప్రాయం రాలేదు. ఇప్పుడే బహిరంగ సభలు వద్దని కొందరు, తొలుత నియోజకవర్గ స్థాయి నుంచి సభలు నిర్వహిస్తే బాగుంటుందని మరికొందరు చెప్పారు. సికింద్రాబాద్ కాకుండా నిజామాబాద్‌లో తొలి సభ పెడదామని సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్ ప్రస్తావించగా.. అప్పుడే తొందరపడొద్దని డీఎస్ వారించారు. దీంతో ఢిల్లీ పర్యటన అనంతరం దీనిపై నిర్ణయం తీసుకుందామని అభిప్రాయపడ్డారు. రేపటి నుంచి విస్తృతంగా కార్యక్రమాలు: తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేసినప్పటికీ ఈ ప్రాంతంలో కాంగ్రెస్‌కు సరైన ప్రయోజనం కలగడం లేదని సమావేశంలో నేతలంతా అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో 17వ తేదీ నుంచి విస్తృత కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. 17 నుంచి 24 వరకు ‘ఊరూరా కాంగ్రెస్ జెండా-సోనియాకు అండ’ పేరుతో ఇంటింటికీ వెళ్లి ప్రచా రం చేయాలని తీర్మానించారు. 20న జిల్లాల్లో డీసీసీ సమావేశాలను ఏర్పాటు చేసి సోనియాగాంధీకి ధన్యవాదాలు చెబుతూ తీర్మానాలు చేయాలని నిర్ణయించారు. సీఎం వ్యవహారంపై ఆగ్రహం.. తెలంగాణకు వ్యతిరేకంగా సీఎం, సీమాంధ్ర మంత్రులు వ్యవహరిస్తున్న తీరుపై ఎంపీలు వీహెచ్, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, పొన్నం తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అధిష్ఠానం తెలంగాణపై ప్రకటన చేసిన తరువాత కూడా సీఎం వ్యతిరేకంగా మాట్లాడుతుంటే మౌనంగా ఎందుకు ఉండాలని ప్రశ్నిం చారు. సీమాంధ్రలో ఉద్యమం పేరుతో తెలంగాణ ప్రజలకు అందాల్సిన రేషన్‌కార్డులు, ఇతర ప్రయోజనాలను సీఎం కావాలనే దక్కకుండా చేస్తున్నారని ఆరోపించారు. మరికొందరు నేతలు కూడా సీఎం వైఖరిని తప్పుబట్టడంతో.. సీఎంపై అధిష్టానం పెద్దలకు ఫిర్యాదు చేయాలని నిర్ణయానికి వచ్చారు. సమావేశం తీర్మానాలు.. తెలంగాణ ఇవ్వాలన్న సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీకి ధన్యవాదాలు. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ఇవ్వాలని నిర్ణయించిన తర్వాత కూడా.. దానికి వ్యతిరేకంగా పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. కేంద్రం నిర్ణయాన్ని గందరగోళ పరిచేలా వ్యవహరిస్తున్న శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని 17న తెలంగాణలో గ్రామగ్రామానా కాంగ్రెస్ జెండాలను ఎగరేయాలి. విమోచన దినోత్సవాలను జయప్రదం చేయాలి. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమే. సీడబ్ల్యూసీ నిర్ణయం మేరకు తెలంగాణకు హైదరాబాద్ కేంద్రంగా ఉంటుంది. దాంట్లో ఎలాంటి సందేహమూ అక్కర్లేదు. హైదరాబాద్‌లో నివసించే వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు, ఉద్యోగులు, ప్రజలకు రక్షణ, వారి వ్యాపారాలకు భద్రత వంటి అంశాలు రాజ్యాంగం, చట్టాలకు లోబడే ఉంటాయి. విద్యార్థులు, యువత, ప్రజలు తెలంగాణ ఏర్పాటుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆవేశంలో అవాంఛనీయ ఘటనలకు పాల్పడవద్దు. ప్రత్యేక రాష్ట్రం కోసం మరణించిన వారికి ఈ సమావేశం నివాళులు అర్పిస్తోంది. తెలంగాణ రాష్ర్టం తొందరగా ఏర్పాటు కావాలని ప్రయత్నిస్తున్న వారందరికీ సంఘీభావం వ్యక్తం చేస్తున్నాం.
Published Mon, Sep 16 2013 7:37 AM | Last Updated on Thu, Mar 21 2024 9:10 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement