జార్ఖండ్ పీఠాన్ని జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) మరోసారి దక్కించుకోనుంది. కాంగ్రెస్-జేఎంఎం సంకీర్ణ ప్రభుత్వంలో జేఎంఎం నాయకుడు, గిరిజన నేత శిబుసోరెన్ కుమారుడు హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి పదవి అధిష్టించనున్నారు. 2014 సాధారణ ఎన్నికల్లో సాధ్యమైనన్ని లోక్‌సభ సీట్లను దక్కించుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకు అడుగేసింది. జార్ఖండ్‌లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుతో పాటు లోక్‌సభ ఎన్నికలలో మెజార్టీ సీట్లు తనకు కేటాయించేలా జేఎంఎంతో ఒప్పందానికి వచ్చింది. శుక్రవారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, జార్ఖండ్ ఇన్‌చార్జి బి.కె.హరిప్రసాద్‌తో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో సమావేశమైన హేమంత్ ఆ తరువాత పొత్తు వివరాలను వెల్లడించారు. ఈ ప్రకారం సీఎం పీఠం జేఎంఎంకు దక్కింది. అలాగే వచ్చే సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 14 లోక్‌సభ స్థానాల్లో 10 కాంగ్రెస్‌కు, 4 జేఎంఎంకు కేటాయిస్తారు. కాంగ్రెస్ తరఫున హరిప్రసాద్ కూడా జేఎంఎంతో పొత్తు విషయాన్ని ధ్రువీకరించారు. శాసనసభ స్పీకర్ పదవి కాంగ్రెస్‌కు దక్కనుంది. కొత్త ప్రభుత్వానికి ఆర్జేడీ మద్దతు ఉంటుందని ఆ పార్టీ నాయకుడు లాలూ ప్రసాద్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆర్జేడీకి కూడా సంకీర్ణ ప్రభుత్వంలో చోటు కల్పించనున్నారు. ఏ పార్టీకెన్ని మంత్రి పదవులు ఇవ్వాలి, ప్రభుత్వం ఉమ్మడి ఎజెండా తదితర అంశాలపై గత నాలుగు రోజులుగా రాజధానిలో ఏకే ఆంటోనీ తదితర కాంగ్రెస్ నాయకులతో సుదీర్ఘ చర్చలు జరిగాయి. 81 మంది సభ్యులుగల జార్ఖండ్ శాసనసభలో జేఎంఎంకు 18, కాంగ్రెస్‌కు 13 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మరో 11 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ సభలో ఆర్జేడీకి ఐదుగురుతో పాటు సీపీఐ(ఎంఎల్), మార్క్సిస్ట్ కోఆర్డినేషన్ పార్టీ, జార్ఖండ్ పార్టీ (ఎక్కా), జార్ఖండ్ జనాధికార్ మంచ్, జైభారత్ సమతాపార్టీలకు ఒక్కొక్కరు చొప్పున ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరుగాక ఒక్క స్వతంత్య్ర సభ్యుడు ఉన్నారు. అర్జున్ ముండా నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి జేఎంఎం ఈ ఏడాది జనవరి 8న మద్దతు ఉపసంహరించుకున్నప్పటి నుంచి జార్ఖండ్‌లో రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. దీని గడువు ఈనెల 18న ముగుస్తుంది. 2000లో బీహార్ నుంచి వేరుపడిన జార్ఖండ్‌లో రాజకీయ అనిశ్చితి ఫలితంగా మూడుసార్లు (2009, 2010, 2013లో) రాష్ట్రపతి పాలన విధించారు.
Published Sat, Jul 6 2013 4:45 PM | Last Updated on Thu, Mar 21 2024 9:14 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement