పుల్వామా ఉగ్రదాడి, ఇండో-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో యూపీలో ఇద్దరు కశ్మీరీలపై కొందరు దాడికి పాల్పడటం కలకలం రేపింది. లక్నోలో డ్రైఫ్రూట్స్ విక్రయించే ఇద్దరు కశ్మీరీలపై హిందూ అతివాద గ్రూపునకు చెందిన కొందరు బుధవారం సాయంత్రం కర్రలతో దాడి చేశారు. బాధితులు లక్నోలో కొన్నేళ్లుగా వీధి వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు. కాగా వీరిని వేధింపులకు గురిచేసిన వారిలో ఓ వ్యక్తి దాడికి సంబంధించిన వీడియోను షేర్ చేయడంతో ఈ ఉదంతం వెలుగుచూసింది. వారు కశ్మీర్‌కు చెందిన వారు కావడంతోనే చితకబాదుతున్నామని దాడికి పాల్పడిన వ్యక్తి చెబుతుండటం గమనార్హం.
ఈ ఘటనను చూసిన స్ధానికులు డ్రైఫ్రూట్ విక్రేతలను కాపాడి, దాడికి పాల్పడే వ్యక్తిని నిలువరించారు. దాడి ఘటనపై కేసు నమోదు చేశామని ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. కశ్మీరీలపై దాడి కేసులో ప్రధాన నిందితుడు విశ్వ హిందూ దళ్ అధ్యక్షుడిగా గుర్తించారు. కాగా ఇప్పటివరకూ ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేయలేదు. పుల్వామా దాడి అనంతరం దేశంలో పలుచోట్ల కశ్మీరీలను టార్గెట్ చేసి దాడులు చోటుచేసుకుంటున్న ఉదంతాలు వెలుగుచూశాయి.