Attack with a stick
-
రెచ్చిపోయిన ఇసుక స్మగ్లర్లు
మల్లాపూర్ (కోరుట్ల): ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నారన్న ఆగ్రహంతో స్మగ్లర్లు ఏకంగా పోలీసులపైనే దాడి చేశారు. రాళ్లు, కర్రలు, పారలతో ట్రైనీ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను విచక్షణా రహితంగా కొట్టారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని వేంపల్లి శివారు పెద్దవాగులో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. రాయికల్ మండలం కొత్తపేట వడ్డెర కాలనీ గ్రామానికి చెందిన కొందరు వేంపల్లి పెద్దవాగులోంచి ఇసుక అక్రమంగా తరలించేందుకు మూడు, నాలుగు రోజులుగా యత్నిస్తున్నారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే సోమవారం అర్ధరాత్రి 20 ట్రాక్టర్లలో, సుమారు 60 మందికి పైగా స్మగ్లర్లు పెద్దవాగులోకి చేరుకుని ఇసుకను తోడుతున్నారు. సమాచారం అందుకున్న ట్రైనీ ఎస్సై వెంకటేశ్, పోలీస్ కానిస్టేబుళ్లు శ్రీనివాస్, రాజ్‌కుమార్ అక్కడకు వెళ్లి రవాణాకు సిద్ధంగా ఉన్న ట్రాక్టర్లను అడ్డుకున్నారు. దీంతో సుమారు 40 మందికి పైగా దుండగులు పోలీసులతో వాగ్వాదానికి దిగుతూ రాళ్లు, కర్రలు, పారలతో దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ట్రైనీ ఎస్సైకి స్వల్ప గాయాలయ్యాయి. ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్రగాయాలయ్యాయి. ప్రాణ భయంతో పరుగులు తీసిన పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో మెట్పల్లి డీఎస్పీ గౌస్‌బాబా, సీఐ శ్రీనివాస్, సబ్‌డివిజన్ పరిధిలోని ఎస్సైలు, పోలీసులతో వేంపల్లికి చేరుకున్నారు. గాయపడ్డ కానిస్టేబుళ్లకు వైద్యసేవలు అందించారు. అనంతరం ఇసుక ట్రాక్టర్లను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా పోలీసులపై దాడి చేసిన 24 మందిపై కేసు నమోదు చేశామని, 10 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని సీఐ శ్రీనివాస్ తెలిపారు. ట్రైనీ ఎస్సైపై దాడి జరగలేదని, ఇద్దరు కానిస్టేబుళ్లపై దుండగులు దాడి చేసి గాయపరిచారని సీఐ వివరించారు. -
యూపీలో కశ్మీరీలపై దుండగుల దాడి
-
యూపీలో కశ్మీరీలపై దుండగుల దాడి
లక్నో : పుల్వామా ఉగ్రదాడి, ఇండో-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో యూపీలో ఇద్దరు కశ్మీరీలపై కొందరు దాడికి పాల్పడటం కలకలం రేపింది. లక్నోలో డ్రైఫ్రూట్స్ విక్రయించే ఇద్దరు కశ్మీరీలపై హిందూ అతివాద గ్రూపునకు చెందిన కొందరు బుధవారం సాయంత్రం కర్రలతో దాడి చేశారు. బాధితులు లక్నోలో కొన్నేళ్లుగా వీధి వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు. కాగా వీరిని వేధింపులకు గురిచేసిన వారిలో ఓ వ్యక్తి దాడికి సంబంధించిన వీడియోను షేర్ చేయడంతో ఈ ఉదంతం వెలుగుచూసింది. వారు కశ్మీర్‌కు చెందిన వారు కావడంతోనే చితకబాదుతున్నామని దాడికి పాల్పడిన వ్యక్తి చెబుతుండటం గమనార్హం. ఈ ఘటనను చూసిన స్ధానికులు డ్రైఫ్రూట్ విక్రేతలను కాపాడి, దాడికి పాల్పడే వ్యక్తిని నిలువరించారు. దాడి ఘటనపై కేసు నమోదు చేశామని ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. కశ్మీరీలపై దాడి కేసులో ప్రధాన నిందితుడు విశ్వ హిందూ దళ్ అధ్యక్షుడిగా గుర్తించారు. కాగా ఇప్పటివరకూ ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేయలేదు. పుల్వామా దాడి అనంతరం దేశంలో పలుచోట్ల కశ్మీరీలను టార్గెట్ చేసి దాడులు చోటుచేసుకుంటున్న ఉదంతాలు వెలుగుచూశాయి. -
కర్రతో మనవడి దాడి
► తల పగిలి వృద్ధురాలు మృతి ► పోలీసుల అదుపులో మనవడు, కొడుకు పుట్లూరు : మనవడు కర్రతో దాడి చేయడంతో వృద్ధురాలు తల పగిలి మృతి చెందింది. ఈ సంఘటన గోపురాజుపల్లిలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు... గ్రామానికి చెందిన లక్ష్మిదేవి, చెన్నారెడ్డి దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. రెండేళ్ల కిందట చెన్నారెడ్డి మరణించాడు. లక్ష్మిదేవి (75) గ్రామంలోని బీసీ కాలనీలో ఒంటరిగా నివసిస్తోంది. సోమవారం ఉదయం కుమారుడు చంద్రారెడ్డి, మనవడు విశ్వనాథ్‌రెడ్డి ఆమె ఇంటి వద్దకు వెళ్లి గొడవపడ్డారు. ఆగ్రహంతో ఊగిపోయిన మనవడు కర్ర తీసుకుని లక్ష్మిదేవి తలపై బలంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తర్వాత పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఆ తర్వాత చంద్రారెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆస్తి తగాదాతోనే... లక్ష్మిదేవి మృతికి ఆస్తి తగాదాలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. ఈమె పేరుతో శనగలగూడూరు రెవెన్యూ పరిధిలో 8.20 ఎకరాల పొలం, గోపురాజుపల్లిలో 80 సెంట్ల స్థలం, ఒక ఇంటితో పాటు రూ.3 లక్షల నగదు ఉన్నాయి. పొలాన్ని కుమారుడు చంద్రారెడ్డి సాగు చేసుకుంటూ తల్లి జీవనం కోసం ఏటా రూ.12 వేలు అందించేవాడు. అయితే.. వృద్ధాప్యంలో తనకు అన్నం పెట్టని కొడుకుకు ఆస్తి ఇవ్వనని, కూతుళ్లకు రాసిస్తానని గ్రామంలో లక్ష్మిదేవి చెబుతుండేది. ఎప్పటికైనా ఆస్తిని కూతుళ్ల పేరుపై రాసిస్తుందన్న అనుమానంతోనే దాడి చేసి ఉంటారని గ్రామస్తులు అంటున్నారు. -
అన్న చేతిలో తమ్ముడు హతం
► కిష్టునాయక్ తండాలో దారుణ హత్య ► లైంగిక వేధింపులే కారణం ► పోలీసులకు లొంగిపోయిన నిందితుడు ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట పంచాయతీ పరిధి కిష్టునాయక్ తండాలో దరావత్ గన్యానాయక్(35)తన అన్న చేతిలో సోమవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. సిరిసిల్ల రూరల్ సీఐ రంగయ్యగౌడ్ కథనం ప్రకారం.. గన్యానాయక్ తన అన్న కిషన్‌నాయక్ మధ్య కొంతకాలంగా భూవివాదం నడుస్తోంది. ఈ సమస్య పరిష్కారం కాకుండానే కిషన్ నాయక్ బతుకుదెరువు కోసం రెండేళ్ల క్రితం గల్ఫ్ వెళ్లాడు. దీంతో గన్యానాయక్ తరచూ కిషన్ కుటుంబ సభ్యులతో భూవివాదంపై ఘర్షణపడేవాడు. అంతేకాకుండా అన్న కూతురును లైంగికంగా వేధించేవాడు. తన కూతురును గన్యానాయక్ వేధిస్తున్నాడంటూ కిషన్ భార్య కనుకవ్వ పోలీసులకు నెలక్రితం ఫిర్యాదు చేసింది. పోలీసులు గన్యానాయక్ను ఇరవై రోజుల క్రితం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. షయం తెలుసుకున్న గల్ఫ్‌లోని కిషన్‌నాయక్ వారం క్రితం స్వగ్రామానికి వచ్చాడు. గన్యానాయక్ సైతం రెండు రోజుల క్రితం జైలు నుంచి విడుదలై ఇంటికి వచ్చాడు. అప్పట్నుంచి కిషన్‌నాయక్‌ను చంపాలని తిరుగుతున్నాడు. ఈవిషయం తెలుసుకున్న కిషన్‌నాయక్ అప్రమత్తమై తానే గన్యానాయక్పై కర్రతో దాడి చేసి హత్య చేశాడు. కాగా, కిషన్‌నాయక్‌ను చంపడానికి తిరుగుతున్న గన్యానాయక్ నుంచి పోలీసులు ఆదివారమే కత్తి స్వాధీనం చేసుకున్నారు. ఆ కత్తి కోసం గన్యానాయక్ సోమవారం ఉదయం ఠాణాకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. హత్య కేసులో నిందితుడు కిషన్‌నాయక్ పోలీసులకు లొంగిపోయాడు. మృతుడికి భార్య మణి, కుమారుడు సాయి, కూతురు సరిత ఉన్నారు. కిషన్నాయక్పై హత్య కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. సంఘటనా స్థలాన్ని సీఐతోపాటు ఎస్సై ఉపేందర్ పరిశీలించారు.