కర్రతో మనవడి దాడి
► తల పగిలి వృద్ధురాలు మృతి
► పోలీసుల అదుపులో మనవడు, కొడుకు
పుట్లూరు : మనవడు కర్రతో దాడి చేయడంతో వృద్ధురాలు తల పగిలి మృతి చెందింది. ఈ సంఘటన గోపురాజుపల్లిలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు... గ్రామానికి చెందిన లక్ష్మిదేవి, చెన్నారెడ్డి దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. రెండేళ్ల కిందట చెన్నారెడ్డి మరణించాడు. లక్ష్మిదేవి (75) గ్రామంలోని బీసీ కాలనీలో ఒంటరిగా నివసిస్తోంది. సోమవారం ఉదయం కుమారుడు చంద్రారెడ్డి, మనవడు విశ్వనాథ్‌రెడ్డి ఆమె ఇంటి వద్దకు వెళ్లి గొడవపడ్డారు. ఆగ్రహంతో ఊగిపోయిన మనవడు కర్ర తీసుకుని లక్ష్మిదేవి తలపై బలంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తర్వాత పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఆ తర్వాత చంద్రారెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆస్తి తగాదాతోనే...
లక్ష్మిదేవి మృతికి ఆస్తి తగాదాలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. ఈమె పేరుతో శనగలగూడూరు రెవెన్యూ పరిధిలో 8.20 ఎకరాల పొలం, గోపురాజుపల్లిలో 80 సెంట్ల స్థలం, ఒక ఇంటితో పాటు రూ.3 లక్షల నగదు ఉన్నాయి. పొలాన్ని కుమారుడు చంద్రారెడ్డి సాగు చేసుకుంటూ తల్లి జీవనం కోసం ఏటా రూ.12 వేలు అందించేవాడు. అయితే.. వృద్ధాప్యంలో తనకు అన్నం పెట్టని కొడుకుకు ఆస్తి ఇవ్వనని, కూతుళ్లకు రాసిస్తానని గ్రామంలో లక్ష్మిదేవి చెబుతుండేది. ఎప్పటికైనా ఆస్తిని కూతుళ్ల పేరుపై రాసిస్తుందన్న అనుమానంతోనే దాడి చేసి ఉంటారని గ్రామస్తులు అంటున్నారు.