మణికంఠ వర్మ (ఫైల్)
సాక్షి, మేడ్చల్, మహబూబ్‌నగర్: మేడ్చల్ జిల్లా బాచుపల్లి మండలం ప్రగతినగర్‌లోని మధురానగర్ కాలనీకి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మణికంఠవర్మ (29) మృతి మిస్టరీగా మారింది. తన పెంపుడు కుక్కకు మందులు కొనేందుకు బుధవారం ఉదయం కారులో ఇంటి నుంచి బయలుదేరిన ఆయన వనపర్తి జిల్లా శ్రీరంగాపుర్ మండలం జానంపేట శివారులోని రామసముద్రం చెరువులో గురువారం శవమై తేలడం పలు అనుమానాలకు తావిస్తోంది.
మృతుడి తల్లి విష్ణుప్రియ, అక్క అన్నపూర్ణదేవి కథనం ప్రకారం.. బుధవారం ఉదయం కుక్కపిల్లకు మందులు తీసుకువస్తానని మణికంఠవర్మ కారులో ఇంటి నుంచి బయలుదేరాడు. అతను ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు అతడికి కాల్ చేయగా మొబైల్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దీంతో వారు అతడి స్నేహితులు, తమ బంధువులకు ఫోన్ చేసినా ప్రయోజనం లేకపోవడంతో సాయంత్రం జేఎన్‌టీయూ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. వారు ప్రగతినగర్ బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధికి వస్తుందని చెప్పడంతో బాచుపల్లి స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
రామసముద్రం చెరువులో శవమై..
వనపర్తి జిల్లా, శ్రీరంగాపుర్ మండలం, జానంపేట శివారులోని రామసముద్రం చెరువులో తూము వద్ద శవం ఉన్నట్లు గ్రామస్తులు గుర్తించి సర్పంచ్ వెంకటేశ్వర్‌రెడ్డికి తెలియజేయగా.. ఆయన పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని చెరువులో నుంచి మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడికి షర్టు లేదు.. ట్రాక్ ప్యాంట్‌కు కారు తాళం చెవి కట్టి ఉంది. పోలీసులు తాళం చెవి తీసుకుని కారును ఓపెన్ చేసి చూడగా.. అందులో స్విచ్ ఆఫ్ అయిన సెల్‌ఫోన్ లభించింది.
ఆన్‌చేసి ఓపెన్ చేసేందుకు ప్రయత్నం చేయగా లాక్‌వేసి ఉంది. పోలీసులు అందులోని సిమ్‌కార్డును తీసి మరో సెల్‌లో వేసి ఆన్ చేశారు. దీంతో అతడి మిత్రులు, బంధువులకు ఎస్‌ఎంఎస్ వచి్చంది. శివాజీ అనే వ్యక్తి వెంటనే కాల్ చేయగా.. కానిస్టేబుల్ విషయం చెప్పి రమ్మన్నారు. ఈ మేరకు కుటుంబసభ్యులు గురువారం సాయంత్రానికి వనపర్తికి చేరుకున్నారు. శుక్రవారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.
ఆస్తి వివాదమే కారణమా ?
కొన్నేళ్ల క్రితం గండిమైసమ్మ ప్రాంతంలో మృతుడి తండ్రి ఓ వెంచర్‌లో 340 గజాల ప్లాటు కొనుగోలు చేశాడు. దీని పక్కనే మేడ్చల్ జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ భవన్‌ను నిరి్మంచారు. దాని పార్కింగ్ కోసం ఆ పార్టీ నేతలు వెంచర్‌లోని ప్లాట్లను చదును చేసేందుకు యత్నించారు. దీంతో మణికంఠవర్మ, తనతో పాటు కొనుగోలు చేసిన వారితో కలిసి కోర్టులో కేసు వేశారు.
కోర్టు స్టే ఇవ్వగా.. తహసీల్దార్ స్వయంగా వచ్చి చదును చేసే పనులను నిలిపివేయించారు. ఈ క్రమంలో మణికంఠవర్మ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఆస్తి వివాదమే ప్రాణం తీసిందని.. ఈ వివాదం తప్ప తమకు ఎలాంటి సమస్యలు లేవని మృతుడి తల్లి, అక్క రోదిస్తూ తెలిపారు. పోస్టుమార్టం నివేదిక అందిన తర్వాత పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment