రమణమ్మ (ఫైల్), కన్నప్ప (ఫైల్)
జనగామ రూరల్: చెల్లికి భూమి రాసి ఇచ్చి.. తనకు మాత్రం భూమి ఇవ్వడం లేదన్న కక్షతో కన్నతల్లిని ఓ కొడుకు అత్యంత కర్కశంగా చంపేశాడు. చికెన్‌కొట్టే కత్తితో తల్లి మెడ నరికి తలను వేరు చేశాడు. అనంతరం నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ దారుణ ఘటన జనగామ జిల్లా జనగామ మండలం మరిగడి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మరిగడి గ్రామానికి చెందిన కూరాకుల రాజయ్య, రమణమ్మలకు కుమారుడు కన్నప్ప, కూతురు లావణ్య ఉన్నారు. వీరికి పది ఎకరాల భూమి ఉంది.
పదేళ్ల క్రితం రాజయ్య పక్ష వాతంతో చనిపోయాడు. గతంలో చికెన్ దుకాణం నడిపిన కన్నప్ప రెండు నెలలుగా స్థానికంగా సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. కుమార్తె తన భర్తతో గొడవపడి మూడు నెలలనుంచి తల్లి వద్దే ఉంటోంది. ఈక్రమంలో కుమార్తెకు ఎలాంటి ఆధారం లేనందున ఉన్న భూమిలో కొంత ఇవ్వాలని తల్లి రమణమ్మ కొద్ది కాలంగా కుమారుడితో పట్టుబడుతోంది. ఇందుకు అతను సుముఖంగా లేకపోవడంతో పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలో కన్నప్పకు తెలియకుండా గత నెల 30న కుమార్తెకు 4ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేసింది.
విషయం తెలుసుకున్న కుమారుడు మిగిలిన భూమిని తనకు ఇవ్వాలని తల్లిని కోరాడు. ఇందుకు ఆమె ససేమిరా అంది. తాను బతికి ఉండగా ఆస్తిని ఇవ్వనని.. కుమారుడికి తెగేసి చెప్పడంతో కక్ష పెంచుకున్నాడు. నాలుగు రోజుల క్రితం ఇరువురూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకోగా కుమారుడిపై కేసు కూడా నమోదైంది. ఈ క్రమంలో గురువారం ఉదయం చెల్లి లావణ్య పాల కోసం బయటకు వెళ్లింది.
బైక్‌పై వచ్చిన కన్నప్ప వెంట తెచ్చుకున్న చికెన్ కొట్టే కత్తితో ఇంటిగడప వద్ద ఉన్న తల్లి రమణమ్మ (60) మెడపై నరికాడు. దీంతో ఆమె కుప్పకూలిపోయింది. ఆ తరువాత తలను వేరు చేసి దానిని పట్టుకుని ఇంటిముందు అటూ ఇటూ కాసేపు తిరిగాడు. అనంతరం బైక్‌పై వెళ్లి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. జనగామ డీసీపీ సీతారాం, ఏసీపీ దేవేందర్‌రెడ్డి, సీఐ, ఎస్సైలు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment