Jangaon SI Couple Suicide Within Hours Of Son Complaint To Police - Sakshi
Sakshi News home page

జనగామ ఎస్సై దంపతుల మృతి.. ఆత్మహత్యకు ముందు జరిగిందిదే!

Published Thu, Apr 6 2023 4:28 PM | Last Updated on Thu, Apr 6 2023 5:12 PM

Jangaon SI Couple Suicide Within Hours Son Complaint To Police - Sakshi

జనగామ ఎస్ఐ దంపతుల ఫైల్‌ ఫోటో.. రవితేజ ఫిర్యాదు కాపీ

సాక్షి, ఉమ్మడి వరంగల్‌: జనగామలో ఎస్సై శ్రీనివాస్‌ దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. తొలుత భార్య స్వరూప ఉరివేసుకొని చనిపోగా.. గంటల వ్యవధిలోనే ఎస్సై శ్రీనివాస్‌ కూడా తన సర్వీస్‌ రివాల్వర్‌లో కాల్చుకున్నారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఇద్దరి ప్రాణాలు బలితీసుకుంది. కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. తల్లిదండ్రులు ఇద్దరూ ఒకేసారి దూరమవ్వడంతో పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

తల్లిదండ్రుల మరణంపై కొడుకు రవితేజ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై విచారణ జరిపి, పోస్టుమార్టం అనంతరం అమ్మనాన్నల మృతదేహాలను అప్పగించాలని కోరారు. కొడుకు ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆత్మహత్య చేసుకున్న ప్రాంతాన్ని పరిశీలించారు. ఎస్సై దంపతుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దంపతులు ఆత్మహత్యపై పూర్తిస్థాయిలో విచారణ అనంతరం పూర్తి విషయాలు వెల్లడిస్తామని తెలిపారు.


జనగామ ఎస్ఐ దంపతుల ఆత్మహత్యపై కొడుకు ఫిర్యాదు కాపీ

అసలేం జరిగిందంటే
ఎస్సై కాసర్ల శ్రీనివాస్‌ గత ఎనిమిదేళ్లుగా జనగామ పట్టణంలో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. కొడుకు రవితేజకు ఇటీవలె వివాహమవ్వగా భార్యతో కలిసి హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తూ బేగంపేట్‌లో ఉంటున్నారు. ఎస్సై దంపతులిద్దరే జనగామలో నివాసముంటున్నారు. బుధవారం రాత్రి శ్రీనివాస్‌, స్వరూప మధ్య కుటుంబ, ఆర్థిక సంబంధిత విషయాలపై గొడవ జరిగింది.

గురువారం తెల్లవారుజామున పాలు పోసే వ్యక్తి వచ్చి డోర్‌ కొట్టగా ఎవరూ తలుపు తీయలేదు. దీంతో ఇంటి పక్కన నివాసముండే వ్యక్తిని పిలిచి ఇద్దరు కలిసి ఇంటి వెనకున్న డోర్‌ దగ్గరకు వెళ్లగా బయట ఉన్న బాత్‌రూమ్‌లో వెంటిలేటర్‌ ఇనుపరాడ్‌కు స్వరూప తన చీరతో ఉరివేసుకొని ఉండటం చూశారు. వెంటనే వెనుక డోర్‌ ద్వారా ఇంట్లోకి వెళ్లి శ్రీనివాస్‌ను నిద్రలేపారు.. ఎస్సై బాత్‌రూమ్‌కి వెళ్లి చూసేసరికి భార్య విగతజీవిగా కనిపించింది.

విషయం తెలుసుకున్న బంధువులు, స్నేహితులు ఇంటికి వచ్చి ఎస్సై శ్రీనివాస్‌ను పరామర్శించారు. అనంతరం ఎస్సై నివాసానికి ఏసీపీ దేవేందర్‌రెడ్డి, పట్టణ ఇన్‌ఛార్జ్‌ సీఐ నాగబాబు చేరుకుని పరిశీలించారు.భార్య మృతికి గల కారణాలను ఎస్సై శ్రీనివాస్‌ను ఉన్నతాధికారులు అడిగి తెలుసుకున్నారు. భార్య ఆత్మహత్య చేసుకోవడాన్ని తట్టుకోలేక మానసిక వేదనకు గురైన శ్రీనివాస్‌.. ఉదయం 10 గంటల సమయంలో వాష్‌రూమ్‌కు వెళ్తున్నానని చెప్పి వెళ్లి తుపాకీతో కాల్చుకున్నారు.

ఒక్కసారిగా కాల్పుల శబ్దం వినపడటంతో అప్పటికే ఇంట్లో ఉన్న ఏసీపీ, సీఐ బాత్‌రూమ్‌కి వెళ్లి చూడగా.. తన సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకొని రక్తపు మడుగులో శ్రీనివాస్‌ ప్రాణాలు కోల్పోయారు. గంటల వ్యవధిలో ఎస్సై దంపతులు మృతిచెందడంతో  ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఎస్సై తుపాకీని స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement