అన్న చేతిలో తమ్ముడు హతం
► కిష్టునాయక్ తండాలో దారుణ హత్య
► లైంగిక వేధింపులే కారణం
► పోలీసులకు లొంగిపోయిన నిందితుడు
ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట పంచాయతీ పరిధి కిష్టునాయక్ తండాలో దరావత్ గన్యానాయక్(35)తన అన్న చేతిలో సోమవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. సిరిసిల్ల రూరల్ సీఐ రంగయ్యగౌడ్ కథనం ప్రకారం.. గన్యానాయక్ తన అన్న కిషన్‌నాయక్ మధ్య కొంతకాలంగా భూవివాదం నడుస్తోంది. ఈ సమస్య పరిష్కారం కాకుండానే కిషన్ నాయక్ బతుకుదెరువు కోసం రెండేళ్ల క్రితం గల్ఫ్ వెళ్లాడు. దీంతో గన్యానాయక్ తరచూ కిషన్ కుటుంబ సభ్యులతో భూవివాదంపై ఘర్షణపడేవాడు. అంతేకాకుండా అన్న కూతురును లైంగికంగా వేధించేవాడు. తన కూతురును గన్యానాయక్ వేధిస్తున్నాడంటూ కిషన్ భార్య కనుకవ్వ పోలీసులకు నెలక్రితం ఫిర్యాదు చేసింది. పోలీసులు గన్యానాయక్‌ను ఇరవై రోజుల క్రితం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
షయం తెలుసుకున్న గల్ఫ్‌లోని కిషన్‌నాయక్ వారం క్రితం స్వగ్రామానికి వచ్చాడు. గన్యానాయక్ సైతం రెండు రోజుల క్రితం జైలు నుంచి విడుదలై ఇంటికి వచ్చాడు. అప్పట్నుంచి కిషన్‌నాయక్‌ను చంపాలని తిరుగుతున్నాడు. ఈవిషయం తెలుసుకున్న కిషన్‌నాయక్ అప్రమత్తమై తానే గన్యానాయక్‌పై కర్రతో దాడి చేసి హత్య చేశాడు. కాగా, కిషన్‌నాయక్‌ను చంపడానికి తిరుగుతున్న గన్యానాయక్ నుంచి పోలీసులు ఆదివారమే కత్తి స్వాధీనం చేసుకున్నారు. ఆ కత్తి కోసం గన్యానాయక్ సోమవారం ఉదయం ఠాణాకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. హత్య కేసులో నిందితుడు కిషన్‌నాయక్ పోలీసులకు లొంగిపోయాడు. మృతుడికి భార్య మణి, కుమారుడు సాయి, కూతురు సరిత ఉన్నారు. కిషన్‌నాయక్‌పై హత్య కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. సంఘటనా స్థలాన్ని సీఐతోపాటు ఎస్సై ఉపేందర్ పరిశీలించారు.