చెప్పేస్తాడనే చంపేశాడు...
► బాలుడిపై లైంగికదాడి, హత్య కేసులో నిందితుడి అరెస్టు
► డీఎన్‌ఏ పరీక్ష ద్వారా మృతుడి గుర్తింపు
రాజేంద్రనగర్: మైలార్‌దేవ్‌పల్లి ఠాణా పరిధిలో మూడు నెలల క్రితం జరిగిన బాలుడి కిడ్నాప్, లైంగికదాడి, దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని గురువారం అరెస్టు చేశారు. చిన్నారిపై తాను జరిపిన పాశవిక చర్యను బయటపెడతాడనే చంపేశానని నిందితుడు వెల్లడించాడు. రాజేంద్రనగర్ ఏసీపీ గంగారెడ్డి, సీఐ వెంకట్‌రెడ్డి, ఎస్సై లక్ష్మీకాంత్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... మొఘల్స్ కాలనీ నివాసి సయ్యద్ మునిరుద్దీన్ కుమారుడు సయ్యద్ అభిదుద్దీన్ (9) స్థానిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. గతేడాది డిసెంబర్ 23 మధ్యాహ్నం ఒంటి గంటకు అభిదుద్దీన్ తన చిన్నాన్న కుమారుడితో కలిసి కిరణాషాపునకు వెళ్లాడు.
అదే సమయంలో వట్టెపల్లి నూర్ కాలనీకి చెందిన సయ్యద్ మహ్మద్ ఇర్ఫాన్ అలియాస్ సోహెల్ (27) మీర్‌చౌక్ ఠాణా పరిధిలో అప్పుడే దొంగిలించిన బైక్‌పై అక్కడికి చేరుకున్నాడు. మద్యం, గంజాయి మత్తులో ఉన్న ఇర్ఫాన్ రోడ్డుపై వెళ్తున్న అభిద్దుదీన్‌ను బడా మజీద్ ఎక్కడని ప్రశ్నించాడు. తనకు తెలుసు అని చెప్పడంతో బైక్‌పై ఎక్కించుకున్నాడు. చిన్నాన్న కొడుకు కూడా బైక్ ఎక్కడానికి యత్నించగా ఎక్కించుకోలేదు. గతంలో ఇర్ఫాన్ కుటుంబం ఈ బాలుడి ఇంటి పక్కనే ఉండేది. రైల్వే ట్రాక్ ప్రాంతంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అభిదుద్దీన్‌పై ఇర్ఫాన్ లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలుడు ఈ విషయం తన తల్లిదండ్రులకు చెప్తానని అనడంతో భయపడ్డ ఇర్ఫాన్ గొంతు నులిమి అతడిని చంపేశాడు.
ఇంకా బతికి ఉండవచ్చనే అనుమానంతో రాయితో తలపై బలంగా మోదాడు. అంతటితో ఆగకుండా కత్తితో చాతీలో విచక్షణ రహితంగా పొడిచాడు. బాలుడి వంటిపై దస్తులు తీసి తగులబెట్టాడు. శవాన్ని నాలాలోకి విసిరేశాడు. ఇదిలా ఉండగా కుమారుడు కనిపించకపోవడంతో అభిదుద్దీన్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. జనవరి 14న నాలాలో బాలుడి శవం కనిపించింది. అప్పటికే పూర్తిగా కుళ్లిపోయింది. ఘటనా స్థలంలో పోలీసులకు కత్తి, చెప్పుల జత దొరికాయి. ఆ శవం తన కుమారుడిది కాదని అభిదుద్దీన్ తండ్రి మొదట అన్నాడు. దీంతో పోలీసులు ఘటనా స్థలంలో లభించిన ఎముకలు, తండ్రి రక్తం సేకరించి డీఎన్‌ఏ పరీక్ష చేయించగా ఆ శవం అభిదుద్దీన్‌దే అని తేలింది.
హతుడు చిన్నాన్న కుమారుడు నిందితుడు ఇర్ఫాన్‌ను గుర్తుపట్టి ఇతనే అభిదుద్దీన్ తీసుకెళ్లాడని గతంలోనే పోలీసులకు చెప్పాడు. కానీ ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అదుపులోకి తీసుకోలేదు. అప్పటి నుంచి తప్పించుకొని తిరుగుతున్న ఇర్ఫాన్‌ను గురువారం ఉదయం అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడు.
గతంలో ఇలాంటి కేసులోనే...
ఇర్ఫాన్ గతంలో శాలిబండ ఠాణా పరిధిలో ఓ బాలుడి పై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈకేసులో పోలీసులు రిమాండ్‌కు తరలించారు. జైలు నుంచి వచ్చాక ఇర్షాన్ మళ్లీ బైక్ చోరీలకు పాల్పడుతున్నాడు.