పంజా విసిరిన నేరగాళ్లు | Thrown claw criminals | Sakshi
Sakshi News home page

పంజా విసిరిన నేరగాళ్లు

Published Sun, Dec 29 2013 4:28 AM | Last Updated on Sat, Aug 11 2018 8:48 PM

Thrown claw criminals

=నేరాలతో అట్టుడికిన జిల్లా
 =పోలీసులకే కరువైన రక్షణ
 =పోలీసు, అటవీ ఉద్యోగుల     దారుణహత్య
 =పుత్తూరులో పట్టుబడ్డ కరుడుగట్టిన తీవ్రవాదులు
 =రూ.25.97 కోట్ల ఎర్రచందనం స్వాధీనం
 =పెరిగిన రోడ్డు ప్రమాదాలు లైంగిక దాడులు

 
 2013 సంవత్సరంపై ‘ఎర్ర’ మరక పడింది. శేషాచలం కొండల్లో ఇద్దరు అటవీ ఉద్యోగులు హత్యకు గురయ్యారు. పలమనేరు గాంధీనగర్ అటవీ ప్రాంతంలో  కానిస్టేబుల్, మరో హోం గార్డును దుండగులు హతమార్చారు. పుత్తూరులో తీవ్రవాదులు పట్టుబడ్డారు.
 
చిత్తూరు (క్రైమ్), న్యూస్‌లైన్: నేరాలు, హత్యలతో జిల్లా అట్టుడికింది. ఒక విధంగా పోలీసులకే రక్షణ కరువైంది. ఇద్దరు కానిస్టేబుళ్లు, ఇద్దరు అటవీ ఉద్యోగులు దారుణహత్యకు గురయ్యారు. అటవీ ఉద్యోగుల హత్యకేసులో నిందితులను 24 గంటల వ్యవధిలోనే పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల హత్య జరిగి నెల అయినా నిందితుల ఆచూకీ లేదు. అదే విధంగా కరుడుగట్టిన ఇద్దరు తీవ్రవాదులు పుత్తూరులో పట్టుబడ్డారు. 2012తో పోల్చితే ఈ ఏడాది నేరాల శాతం పెరిగింది. అదే సమయంలో రికవరీ శాతం పడిపోయింది.

జిల్లాలో 2013 సంవత్సరంలో 71 హత్యలు, 632 దొంగతనాలు జరిగా యి. రోడ్డు ప్రమాదాల్లో 573 మంది మృతి చెందారు. మొత్తం 2041 మంది గాయపడ్డారు. ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో 1166 మంది అరెస్ట్ అయ్యారు. సుమారు రూ.25.97 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టుబడింది. రికార్డులు సరిగా లేని, ట్రాఫిక్ నిబంధనలు పాటించని 58,597 వాహనదారులపై ఎంవీఐ అధికారులు కేసులు నమోదు చేశారు. వీరి నుంచి రూ.1.31 కోట్ల అపరాధ రుసుం రాబట్టారు.
 
పట్టుబడ్డ తీవ్రవాదులు
 
అక్టోబర్ 4న గేట్‌పుత్తూరులోని ముస్లింవీధిలో తీవ్రవాదులు తలదాచుకున్నట్టు పోలీసులు గుర్తించారు. తమిళనాడు పోలీసులు, చిత్తూరు ఎస్పీ కాంతిరాణాటాటా సంయుక్తంగా ఆక్టోపస్ బలగాలతో ఆపరేషన్ నిర్వహిం చారు. ఇస్లామిక్ లిబరేషన్ సంస్థకు చెందిన బిలాల్ మాలి క్, పన్నా ఇస్మాయిల్ అలియాస్ మహమ్మద్ ఇస్మాయిల్ అనే తీవ్రవాదులను పట్టుకున్నారు. ఈ ఘటనలో జీనత్‌ఖాన్ అనే పీసీ, ఎస్‌పీ అంగరక్షకుడు గాయపడ్డారు.
 
పోలీసుల దారుణ హత్య

 
డిసెంబర్ 1వ తేదీ సాయంత్రం పలమనేరు సమీపంలోని గాంధీనగర్ అటవీ ప్రాంతంలో కానిస్టేబుల్ జవహర్‌లాల్ నాయక్, హోంగార్డ్ దేవేంద్రకుమార్ దారుణహత్యకు గురయ్యారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, ఐదుగురు సీఐలు విచారణ చేపట్టారు. అయితే హత్యలు జరిగి నెల అవుతున్నా కేసులో ఎలాంటి పురోగతీ లేదు.
 
అటవీ ఉద్యోగుల హత్య
 
డిసెంబర్ 15వ తేదీ శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకునేందుకు వెళ్లిన ఇద్దరు అటవీ ఉద్యోగులు హత్యకు గురయ్యారు. స్మగ్లర్లు, కూలీలు అటవీశాఖ అధికారులపై దాడి చేయడంతో తిరుపతి వన్యప్రాణి అటవీ విభాగం తిరుమల శాఖ డెప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఎన్‌ఆర్.శ్రీధర్ (50), అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ డేవిడ్ కరుణాకర్(49) ప్రాణాలు కోల్పోయారు. మరో సెక్షన్ ఆఫీసర్ రమణ, బీట్ ఆఫీసర్ చంద్రశేఖర్‌రాజు, వాచర్ నరేష్ తీవ్రంగా గాయపడ్డారు. రంగంలోకి దిగిన భద్రతాదళాలు శేషాచలం అడవులను జల్లెడ పట్టాయి. రెండు రోజుల్లో 400 మంది కూలీలు పట్టుబడ్డారు. అటవీశాఖ అధికారుల ను హతమార్చిన ఏడుగురిని అరెస్ట్ చేశారు. అటవీ అధికారుల హత్యను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం అటవీ శాఖ ఉద్యోగులకు తుపాకులు పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement