బీజేపీ ఎంపీ, జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ రామ్‌శంకర్ కథేరియా వివాదంలో చిక్కుకున్నారు. ఆగ్రా నుంచి ఎతావా వెళ్తున్న క్రమంలో ఆయన అంగరక్షకులు టోల్‌ప్లాజా సిబ్బందిని చితకబాదారు. దాంతోపాటు అంగరక్షకుల్లోని ఒకరు గాల్లోకి కాల్పులు జరపడం కలకలం రేపింది. ఎంపీ కారుతో పాటు మరో 5 కార్లు, ఒక బస్ శనివారం తెల్లవారుజామున 3.52 గంటలకు టోల్ ప్లాజా వద్దకు చేరుకున్నాయి.
అయితే, ఇతర వాహనాలకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదాని తర్వాత ఒకటి రావాలని టోల్ ప్లాజా సిబ్బంది సూచించారు. దీంతో ఆగ్రహించిన ఎంపీ బాడీగార్డులు వీరంగం సృష్టించారు. ఎంపీ కాన్వాయ్‌కే అడ్డుతగులుతావా అంటూ దాడి చేశారు. దాడి చేసిన వారిలో ఎంపీతో పాటు ప్రయాణిస్తున్న అతని మద్దతుదారు కూడా ఉన్నాడు. ఇంత గొడవ జరుగుతున్నా అక్కడే ఉన్న పోలీసులు మిన్నకుండిపోవడం గమనార్హం.