Ram Shankar Katheria
-
వరుసలో రమ్మన్నందుకు చితక్కొట్టారు..!
ఆగ్రా : బీజేపీ ఎంపీ, జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ రామ్‌శంకర్ కథేరియా వివాదంలో చిక్కుకున్నారు. ఆగ్రా నుంచి ఎతావా వెళ్తున్న క్రమంలో ఆయన అంగరక్షకులు టోల్‌ప్లాజా సిబ్బందిని చితకబాదారు. దాంతోపాటు అంగరక్షకుల్లోని ఒకరు గాల్లోకి కాల్పులు జరపడం కలకలం రేపింది. ఎంపీ కారుతో పాటు మరో 5 కార్లు, ఒక బస్ శనివారం తెల్లవారుజామున 3.52 గంటలకు టోల్ ప్లాజా వద్దకు చేరుకున్నాయి. అయితే, ఇతర వాహనాలకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదాని తర్వాత ఒకటి రావాలని టోల్ ప్లాజా సిబ్బంది సూచించారు. దీంతో ఆగ్రహించిన ఎంపీ బాడీగార్డులు వీరంగం సృష్టించారు. ఎంపీ కాన్వాయ్‌కే అడ్డుతగులుతావా అంటూ దాడి చేశారు. దాడి చేసిన వారిలో ఎంపీతో పాటు ప్రయాణిస్తున్న అతని మద్దతుదారు కూడా ఉన్నాడు. ఇంత గొడవ జరుగుతున్నా అక్కడే ఉన్న పోలీసులు మిన్నకుండిపోవడం గమనార్హం. ఇక ఈ ఘటనపై టోల్ సిబ్బంది పోలీసుకు ఫిర్యాదు చేశారు. అకారణంగా తమపై దాడి చేశారని పేర్కొన్నారు. ఎంపీ ఒత్తిళ్లతో తమ ఉద్యోగానికి ఎసరు రావొచ్చని వారు వాపోయారు. తమ ప్రాణాలకు ముప్పు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక టోల్‌ప్లాజా సిబ్బంది తన బాడీగార్డులపై దాడికి పాల్పడ్డారని, ఆత్మరక్షణకోసమే వాళ్లు గాల్లోకి కాల్పులు జరిపారని ఎంపీ రామ్‌శంకర్ చెప్తున్నారు. సెక్యూరిటీ సిబ్బంది దాడి దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. -
వరుసలో రమ్మన్నందుకు చితక్కొట్టారు..!
-
ఎంపీగారి కుక్క దొరికిందోచ్!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల వెలుగుచూస్తున్న అత్యాచారాలు, హత్యలతో సామాన్యులు హడలిపోతుంటే, పోలీసులు మాత్రం వీఐపీల సేవలో తరించిపోతున్నారు. ఇటీవల మంత్రి ఆజాంఖాన్‌కు చెందిన తప్పిపోయిన పశువులను పోలీసులు వెతికిపట్టుకోగా, తాజాగా కేంద్ర మాజీ మంత్రి, ఆగ్రా ఎంపీ రామ్ శంకర్ కథారియా కుక్క తప్పిపోయిందని ఫిర్యాదు చేసిన 24 గంటల్లోనే పోలీసులు వెతికి పట్టుకున్నారు. ఆగ్రాలో తప్పిపోయిన కుక్క ఢిల్లీలో తేలింది. తన పెంపుడు కుక్క కలు దొరికిందని రామ్ శంకర్ చెప్పారు. కుక్క కనిపించకుండా పోయిందని రామ్ శంకర్ భార్య మృదుల శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఈ రోజు ఉదయం దాన్ని కనుగొన్నారు. 'కలును ఎవరో తీసుకెళ్లి ఢిల్లీలో విడిచారు. ఇది కనిపించకపోయేసరికి మా ఇంట్లో ఉన్న మరో కుక్క భూరా చాలా బాధపడింది. నా భార్య మృదుల కూడా ఎక్కువ బాధపడింది. కుక్క దొరికిందని తెలియగానే అంతా సంతోషించాం. కుక్కను ఆగ్రాకు తెప్పిస్తున్నాం' అని రామ్ శంకర్ చెప్పారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే పోలీసులు ఎంపీగారి కుక్కను పోలిన మరో కుక్కను ఆగ్రాలో పట్టుకున్నారు. దీంతో నిజమైన పెంపుడు కుక్క కలు ఏది అనే విషయంలో గందరగోళం ఏర్పడింది. చివరకు ఢిల్లీలో కలు ఉన్నట్టు గుర్తించారు. -
ఎంపీ భార్య వింత ఫిర్యాదు!
ఆగ్రా: తప్పిపోయిన మంత్రి ఆజాంఖాన్ పశువులను వెతికి పట్టుకున్న ఉత్తరప్రదేశ్ పోలీసులకు మరో బాధ్యత నెత్తిన పడింది. ఈసారి కుక్కను వెతకాల్సిన పరిస్థితి వచ్చింది. తమ పెంపుడు కుక్క తప్పింపోయిందని బీజేపీ ఆగ్రా ఎంపీ రామశంకర్ కథిరియా భార్య మృదుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి అనిల్ చౌదరి, పార్టీ కార్యకర్తలతో కలిసి శుక్రవారం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తమ కుక్కను గుర్తు తెలియని దుండగులు మూడు రోజుల క్రితం ఎత్తుకుపోయారని ఫిర్యాదులో పేర్కొన్నారు. హరి పర్వత్ పోలీస్ స్టేషన్ లో ఈ మేరకు ఫిర్యాదు నమోదు చేశారు. తమ పెంపుడు కుక్క నలుపు రంగులో ఉంటుందని, లాబ్రడర్ జాతికి చెందినదని మృదుల తెలిపారు. అరుదైన, ఖరీదైన కుక్కని.. అంతకుమించి తమ కుటుంబంలో సభ్యురాలని పేర్కొన్నారు. మంత్రి ఆజాంఖాన్ పశువులను వెతికిపట్టుకున్న పోలీసులు తమ కుక్కను ఎందుకు వెతికి పెట్టకూడదని ఆమె ప్రశ్నించారు. ఆగ్రా యూనివర్సిటీలో హిందీ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ఆమె తనకు కేటాయించిన ఇంటిలో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నారు. -
ఎఫ్ఐఆర్ లో కేంద్ర మంత్రి పేరు
ఆగ్రా: వీహెచ్‌పీ నేత హత్య నేపథ్యంలో ఆగ్రాలో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన నలుగురుపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీ నేత, కార్పొరేటర్ కుందనిక శర్మ, మరో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇటీవల హత్యకు గురైన వీహెచ్‌పీ నేత అరుణ్ సంస్మరణసభలో కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి రాంశంకర్ కఠేరియా, భాజపా ఎంపీ బాబూలాల్, సాధ్వి ప్రాచి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. వీరిపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీంతో స్పందించిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ లో వీరు పేర్లు కూడా ఉన్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఇద్దరు ఎంపీలు, ఎమ్మెల్యే పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చినట్టు తెలిపాయి. అయితే కేంద్రమంత్రి పేరు ఎఫ్ఐఆర్ లో లేదని అంతకుముందు వార్తలు వచ్చాయి. తాను విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయలేదని చేయలేదని కఠేరియా పేర్కొన్నారు. -
కేంద్ర మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు
ఆగ్రా: అధికార బీజేపీ నేతలు వివాదస్పద వ్యాఖ్యలు కొనసాగిస్తున్నారు. తాజాగా కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి, ఆగ్రా ఎంపీ రామశంకర్ కతిరియా సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింలను సైతానులు, రావణ సంతతిగా వర్ణించారు. ఇటీవల హత్యకు గురైన వీహెచ్ పీ కార్యకర్త అరుణ్ మహౌర్ సంస్మరణ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... 'పూజలు ముగించుకుని తిరిగి వస్తున్న అరుణ్ ను హత్య చేశారు. మనం శక్తి పుంజుకోవాల్సిన అవసరం ఉంది. పోరాటం మొదలు పెట్టాలి. పోరాటం ఆరంభించకపోతే ఈరోజు అరుణ్ కోల్పోయాం, తర్వాత మరొకరు బలౌతారు. మరొకర్ని కోల్పోక ముందే మన బలమెంతో చూపాలి. అదిచూసి హంతకులు పారిపోయాల'ని వ్యాఖ్యానించారు. ఫతేపూర్ సిక్రీ ఎంపీ బాబూలాల్, బీజేపీ స్థానిక నేతలు, ఆగ్రా వీహెచ్ పీ నేత అశోక్ లావణ్య కూడా ముస్లింలను లక్ష్యంగా చేసుకుని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే తాను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదని కతిరియా తెలిపారు. ప్రతీకారం తీర్చుకోవాలని తాను అనలేదని, నివాళులు మాత్రమే అర్పించానని వివరణయిచ్చారు.