ఎంపీగారి కుక్క దొరికిందోచ్!
లక్నో: ఉత్తరప్రదేశ్లో ఇటీవల వెలుగుచూస్తున్న అత్యాచారాలు, హత్యలతో సామాన్యులు హడలిపోతుంటే, పోలీసులు మాత్రం వీఐపీల సేవలో తరించిపోతున్నారు. ఇటీవల మంత్రి ఆజాంఖాన్కు చెందిన తప్పిపోయిన పశువులను పోలీసులు వెతికిపట్టుకోగా, తాజాగా కేంద్ర మాజీ మంత్రి, ఆగ్రా ఎంపీ రామ్ శంకర్ కథారియా కుక్క తప్పిపోయిందని ఫిర్యాదు చేసిన 24 గంటల్లోనే పోలీసులు వెతికి పట్టుకున్నారు. ఆగ్రాలో తప్పిపోయిన కుక్క ఢిల్లీలో తేలింది. తన పెంపుడు కుక్క కలు దొరికిందని రామ్ శంకర్ చెప్పారు.
కుక్క కనిపించకుండా పోయిందని రామ్ శంకర్ భార్య మృదుల శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఈ రోజు ఉదయం దాన్ని కనుగొన్నారు. 'కలును ఎవరో తీసుకెళ్లి ఢిల్లీలో విడిచారు. ఇది కనిపించకపోయేసరికి మా ఇంట్లో ఉన్న మరో కుక్క భూరా చాలా బాధపడింది. నా భార్య మృదుల కూడా ఎక్కువ బాధపడింది. కుక్క దొరికిందని తెలియగానే అంతా సంతోషించాం. కుక్కను ఆగ్రాకు తెప్పిస్తున్నాం' అని రామ్ శంకర్ చెప్పారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే పోలీసులు ఎంపీగారి కుక్కను పోలిన మరో కుక్కను ఆగ్రాలో పట్టుకున్నారు. దీంతో నిజమైన పెంపుడు కుక్క కలు ఏది అనే విషయంలో గందరగోళం ఏర్పడింది. చివరకు ఢిల్లీలో కలు ఉన్నట్టు గుర్తించారు.