missing dog
-
ఆచూకీ తెలిపితే బహుమతి
కూకట్పల్లి: తాము పెంచుకుంటున్న కుక్కపిల్ల ‘డ్యూక్’ అదృశ్యం కావడంతో ఆ ఇంట్లో విషాదం అలుముకుంది. 24 గంటలు గడిచినా ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబసభ్యులు వీధుల్లో గాలిస్తున్నారు. అయినా ఫలితం లేకపోవడంతో కుక్క ఫొటోతో కూడిన పోస్టర్లను కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో అంటించి ప్రచారం చేశారు. వివరాల్లోకి వెళితే.. కూకట్పల్లి ప్రాంతంలో ఉంటున్న ప్రసాద్ ‘డ్యూక్’ అనే కుక్క పిల్లను పెంచుకుంటున్నారు. అయితే బుధవారం సదరు కుక్క అకస్మాత్తుగా అదృశ్యమైంది. ఈ విషయాన్ని ప్రసాద్ రాంచీలో ఉంటున్న తన కుమార్తె సబితకు తెలియజేయడంతో ఆమె హుటాహుటిన విమానంలో హైదరాబాద్కు చేరుకుంది. రెండు రోజులుగా గాలింపు చేపట్టినా ప్రయోజనం లేకపోవడంతో పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. డ్యూక్ ఆచూకీ తెలిపిన వారికి విలువైన బహుమతి ఇవ్వనున్నట్లు పోస్టర్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. డ్యూక్ ఆచూకీ తెలిసిన వారు 98666 94700 ఫోన్ నంబర్లో సంప్రదించాలని కోరుతున్నారు. -
శునకం కోసం..
టీ.నగర్ ,చెన్నై: కనిపించకుండా పోయిన శునకం ఆచూ కీ తెలపాలంటూ యజమాని ఫ్లెక్సీలు ఏర్పాటుచేశాడు. ఆచూకీ తెలిపిన వారికి నగదు బహుమతి అందజేయనున్నట్లు ప్రకటించాడు. కోయంబత్తూరు వడవల్లికి చెందిన దీపక్ (45) వ్యాపారం చేస్తుంటారు. ఈయన ఆరు నెలలుగా శునకాన్ని పెంచుకుంటూ వచ్చాడు. శునకం గత జనవరి 24 నుంచి కనిపించకుండా పోయింది. అనేక చోట్ల గాలించినా ఫలితం లేదు. దీపక్ ప్రస్తుతం దీని ఆచూకీ కోసం నగరమంతటా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా ఒక టెంపోలో శునకం ఫొటోతో కూడిన ఫ్లెక్సీ నగరమంతటా సంచరిస్తోంది. శునకం ఆచూకీ తెలిపిన వారికి నగదు అందజేయనున్నట్లు దీపక్ తెలిపాడు. -
రూ. 2 లక్షల రివార్డు ఇస్తామంటే.. వద్దు పొమ్మంది!
ఇంట్లో పెంచుకునే కుక్కపిల్లలు అంటే సొంత పిల్లల కంటే ఎక్కువగా చూసుకుంటారు. అలాంటిది ఒక్కసారి కనపడకుండా పోతే.. వాటికోసం తమ ఆస్తి మొత్తం తాకట్టు పెట్టాలన్నా కూడా వెనకాడని పెద్దమనసు ఉంటుంది. తమ ఆస్తిపాస్తులను మొత్తం వాటికి రాసిచ్చిన సందర్భాలు కూడా లేకపోలేవు. గుర్గావ్లోని సెక్టార్ 49లో ఇలాగే రెక్సీ అనే కుక్క ఒకటి తప్పిపోయింది. దాని ఆచూకీ గురించి ఎవరైనా చెబితే వాళ్లకు రూ. 2 లక్షల రివార్డు ఇస్తామని కూడా దాని సంరక్షకులైన ఆస్ట్రేలియన్ దంపతులు వీనస్ గ్రీన్, రిక్ గ్రీన్ ప్రకటించారు. వాళ్లు రెక్సీ పోస్టర్లను నగరంలో పలుచోట్ల అతికించారు. సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. చాలామంది వాళ్లకు ఫోన్ చేసి తాము చూశామని చెప్పారు గానీ, ఏదీ వాళ్ల రెక్సీ కాదు. ఎట్టకేలకు మంగళవారం మధ్యాహ్నం సెక్టార్ 49లోని సిస్పల్ విహార్ ప్రాంతంలో ఉండే ఒక అమ్మాయి నుంచి వాళ్లకు ఫోన్ వచ్చింది. ఈసారైనా దొరుకుతుందో లేదో అన్న అనుమానంతో వెళ్లిన వాళ్లకు.. నిజంగానే అక్కడ తమ రెక్సీ కనిపించేసరికి ఒక్కసారిగా పొంగిపోయారు. తాము ఇస్తామని చెప్పిన రూ. 2 లక్షల రివార్డు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అయితే, సమాచారం చెప్పిన అమ్మాయి గానీ, ఆమె తల్లి గానీ ఆ డబ్బులు తీసుకోడానికి ఒప్పుకోలేదు. ఇది తాము సంతోషంగా ఇస్తున్నదని, ఎలాగోలా తీసుకొమ్మని ఎంతగా బతిమాలినా అంగీకరించలేదు. రెండున్నర రోజుల పాటు తమ కుక్క కనిపించలేదని అలాంటిది మళ్లీ తమ ఒడికి చేరగానే కళ్ల వెంబడి నీళ్లు వచ్చేశాయని ఆ ఆస్ట్రేలియన్ జంట చెప్పారు. బుధవారం మరోసారి వాళ్ల ఇంటికి వెళ్లి ఎలాగైనా వాళ్లకు నచ్చజెప్పి ఆ డబ్బులు ఇచ్చేద్దామనే అనుకుంటున్నామన్నారు. ఒకవేళ వాళ్లు మరీ వద్దంటే మాత్రం ఏదైనా జంతుప్రేమికుల సంస్థకు విరాళంగా ఇస్తామని వీనస్ గ్రీన్ చెప్పారు. -
ఎంపీగారి కుక్క దొరికిందోచ్!
లక్నో: ఉత్తరప్రదేశ్లో ఇటీవల వెలుగుచూస్తున్న అత్యాచారాలు, హత్యలతో సామాన్యులు హడలిపోతుంటే, పోలీసులు మాత్రం వీఐపీల సేవలో తరించిపోతున్నారు. ఇటీవల మంత్రి ఆజాంఖాన్కు చెందిన తప్పిపోయిన పశువులను పోలీసులు వెతికిపట్టుకోగా, తాజాగా కేంద్ర మాజీ మంత్రి, ఆగ్రా ఎంపీ రామ్ శంకర్ కథారియా కుక్క తప్పిపోయిందని ఫిర్యాదు చేసిన 24 గంటల్లోనే పోలీసులు వెతికి పట్టుకున్నారు. ఆగ్రాలో తప్పిపోయిన కుక్క ఢిల్లీలో తేలింది. తన పెంపుడు కుక్క కలు దొరికిందని రామ్ శంకర్ చెప్పారు. కుక్క కనిపించకుండా పోయిందని రామ్ శంకర్ భార్య మృదుల శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఈ రోజు ఉదయం దాన్ని కనుగొన్నారు. 'కలును ఎవరో తీసుకెళ్లి ఢిల్లీలో విడిచారు. ఇది కనిపించకపోయేసరికి మా ఇంట్లో ఉన్న మరో కుక్క భూరా చాలా బాధపడింది. నా భార్య మృదుల కూడా ఎక్కువ బాధపడింది. కుక్క దొరికిందని తెలియగానే అంతా సంతోషించాం. కుక్కను ఆగ్రాకు తెప్పిస్తున్నాం' అని రామ్ శంకర్ చెప్పారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే పోలీసులు ఎంపీగారి కుక్కను పోలిన మరో కుక్కను ఆగ్రాలో పట్టుకున్నారు. దీంతో నిజమైన పెంపుడు కుక్క కలు ఏది అనే విషయంలో గందరగోళం ఏర్పడింది. చివరకు ఢిల్లీలో కలు ఉన్నట్టు గుర్తించారు. -
ఎంపీ భార్య వింత ఫిర్యాదు!
ఆగ్రా: తప్పిపోయిన మంత్రి ఆజాంఖాన్ పశువులను వెతికి పట్టుకున్న ఉత్తరప్రదేశ్ పోలీసులకు మరో బాధ్యత నెత్తిన పడింది. ఈసారి కుక్కను వెతకాల్సిన పరిస్థితి వచ్చింది. తమ పెంపుడు కుక్క తప్పింపోయిందని బీజేపీ ఆగ్రా ఎంపీ రామశంకర్ కథిరియా భార్య మృదుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి అనిల్ చౌదరి, పార్టీ కార్యకర్తలతో కలిసి శుక్రవారం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తమ కుక్కను గుర్తు తెలియని దుండగులు మూడు రోజుల క్రితం ఎత్తుకుపోయారని ఫిర్యాదులో పేర్కొన్నారు. హరి పర్వత్ పోలీస్ స్టేషన్ లో ఈ మేరకు ఫిర్యాదు నమోదు చేశారు. తమ పెంపుడు కుక్క నలుపు రంగులో ఉంటుందని, లాబ్రడర్ జాతికి చెందినదని మృదుల తెలిపారు. అరుదైన, ఖరీదైన కుక్కని.. అంతకుమించి తమ కుటుంబంలో సభ్యురాలని పేర్కొన్నారు. మంత్రి ఆజాంఖాన్ పశువులను వెతికిపట్టుకున్న పోలీసులు తమ కుక్కను ఎందుకు వెతికి పెట్టకూడదని ఆమె ప్రశ్నించారు. ఆగ్రా యూనివర్సిటీలో హిందీ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ఆమె తనకు కేటాయించిన ఇంటిలో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నారు.