రూ. 2 లక్షల రివార్డు ఇస్తామంటే.. వద్దు పొమ్మంది!
ఇంట్లో పెంచుకునే కుక్కపిల్లలు అంటే సొంత పిల్లల కంటే ఎక్కువగా చూసుకుంటారు. అలాంటిది ఒక్కసారి కనపడకుండా పోతే.. వాటికోసం తమ ఆస్తి మొత్తం తాకట్టు పెట్టాలన్నా కూడా వెనకాడని పెద్దమనసు ఉంటుంది. తమ ఆస్తిపాస్తులను మొత్తం వాటికి రాసిచ్చిన సందర్భాలు కూడా లేకపోలేవు. గుర్‌గావ్‌లోని సెక్టార్ 49లో ఇలాగే రెక్సీ అనే కుక్క ఒకటి తప్పిపోయింది. దాని ఆచూకీ గురించి ఎవరైనా చెబితే వాళ్లకు రూ. 2 లక్షల రివార్డు ఇస్తామని కూడా దాని సంరక్షకులైన ఆస్ట్రేలియన్ దంపతులు వీనస్ గ్రీన్, రిక్ గ్రీన్ ప్రకటించారు. వాళ్లు రెక్సీ పోస్టర్లను నగరంలో పలుచోట్ల అతికించారు. సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. చాలామంది వాళ్లకు ఫోన్ చేసి తాము చూశామని చెప్పారు గానీ, ఏదీ వాళ్ల రెక్సీ కాదు.
ఎట్టకేలకు మంగళవారం మధ్యాహ్నం సెక్టార్ 49లోని సిస్పల్ విహార్ ప్రాంతంలో ఉండే ఒక అమ్మాయి నుంచి వాళ్లకు ఫోన్ వచ్చింది. ఈసారైనా దొరుకుతుందో లేదో అన్న అనుమానంతో వెళ్లిన వాళ్లకు.. నిజంగానే అక్కడ తమ రెక్సీ కనిపించేసరికి ఒక్కసారిగా పొంగిపోయారు. తాము ఇస్తామని చెప్పిన రూ. 2 లక్షల రివార్డు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అయితే, సమాచారం చెప్పిన అమ్మాయి గానీ, ఆమె తల్లి గానీ ఆ డబ్బులు తీసుకోడానికి ఒప్పుకోలేదు. ఇది తాము సంతోషంగా ఇస్తున్నదని, ఎలాగోలా తీసుకొమ్మని ఎంతగా బతిమాలినా అంగీకరించలేదు. రెండున్నర రోజుల పాటు తమ కుక్క కనిపించలేదని అలాంటిది మళ్లీ తమ ఒడికి చేరగానే కళ్ల వెంబడి నీళ్లు వచ్చేశాయని ఆ ఆస్ట్రేలియన్ జంట చెప్పారు. బుధవారం మరోసారి వాళ్ల ఇంటికి వెళ్లి ఎలాగైనా వాళ్లకు నచ్చజెప్పి ఆ డబ్బులు ఇచ్చేద్దామనే అనుకుంటున్నామన్నారు. ఒకవేళ వాళ్లు మరీ వద్దంటే మాత్రం ఏదైనా జంతుప్రేమికుల సంస్థకు విరాళంగా ఇస్తామని వీనస్ గ్రీన్ చెప్పారు.