4,6,4,6,6... గౌతమ్‌ షో | Watch Video, Krishnappa Gowtham Smashes 35 Off 10 Balls | Sakshi
Sakshi News home page

4,6,4,6,6... గౌతమ్‌ షో

Published Tue, Nov 5 2019 2:06 PM | Last Updated on Fri, Mar 22 2024 10:57 AM

రాంచీ: దేవధార్‌ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్‌ కృష్ణప్ప గౌతమ్‌ దుమ్మురేపాడు. విజృంభించి ఆడి భారత్‌ ‘బి’ జట్టును విజేతగా నిలపడంతో కీలకపాత్ర పోషించాడు. భారత్‌ ‘సి’ జట్టుతో సోమవారం జరిగిన తుదిపోరులో గౌతమ్‌ చెలరేగిపోయాడు. 10 బంతుల్లోనే మూడు సిక్సర్లు, మూడు ఫోర్లతో 35 పరుగులు చేసి సత్తా చాటాడు. వరుస బంతుల్లో (4,6,4,2,6,6,0,4,2,1) ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అతడు బ్యాటింగ్‌కు వచ్చేటప్పటికీ ‘బి’టీమ్‌ 48 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 245 పరుగులు చేసింది. వచ్చి రావడంతో గౌతమ్‌ దంచుడు మొదలు పెట్టడంతో స్కోరు రాకెట్‌ వేగంతో దూసుకుపోయింది.

దివేశ్‌ పఠానియా వేసిన 49 ఓవర్‌లో 31 పరుగులు వచ్చాయి. ఇందులో గౌతమ్‌ ఒక్కడే 28 పరుగులు సాధించాడు. చివరి ఓవర్‌లోనూ బౌండరీ బాదాడు. గౌతమ్‌ విజృంభించిన వీడియోను బీసీసీఐ అధికారిక ట్విటర్‌లో షేర్‌ చేయడంతో అతడిపై క్రికెట్‌ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ట్వి20 సిరీస్‌కు గౌతమ్‌ లాంటి ఆటగాళ్లను ఎంపిక చేయాలని కోరుతున్నారు. బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి టి20లో టీమిండియా ఓటమిపాలైన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
 
Advertisement