Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Kremlin warns the West over dramatic escalation moment in Ukraine war1
ఉక్రెయిన్‌ చేతికి టోమాహాక్ క్షిపణి.. అమెరికాకు.. రష్యా వార్నింగ్‌!

మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తారాస్థాయికి చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్‌కు అమెరికా టోమాహాక్ క్షిపణులు పంపే యోచనపై రష్యా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. యుద్ధం అన్ని వైపుల నుండి తీవ్ర రూపం దాల్చడంతో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయని రష్యా హెచ్చరించింది.అయితే, డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్‌కు టోమాహాక్ క్షిపణులు ఇవ్వడంపై స్పష్టత ఇచ్చారు. ఈ క్షిపణులను పంపే ముందు, యుద్ధ తీవ్రత పెరగకుండా చూసుకుంటానని తెలిపారు. ఉక్రెయిన్ వాటిని ఎలా ఉపయోగించబోతుందో ముందుగా తెలుసుకోవాలని భావిస్తున్నానని చెప్పారు. ఈ అంశంపై తాను ఇప్పటికే నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు.‘టోమాహాక్‌ల అంశం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది’అని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ రష్యన్ ప్రభుత్వ మీడియా ఇంటర్వ్యూలో వెల్లడించారు. అన్ని వైపుల నుండి ఉద్రిక్తతలు పెరుగుతున్నాయనే వాస్తవం. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్‌లో అత్యంత ఘోరమైన ఉక్రెయిన్ యుద్ధం. 1962లో జరిగిన క్యూబా క్షిపణి సంక్షోభం తర్వాత, ఇప్పుడు రష్యా–పశ్చిమ దేశాల మధ్య జరుగుతున్న ఉక్రెయిన్ యుద్ధం అత్యంత తీవ్రమైన ఘర్షణగా మారిందని పేర్కొన్నారు. ప్రస్తుతం రష్యా.. పశ్చిమ దేశాలతో తీవ్రమైన రాజకీయ, దౌత్య వివాదంలో ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. మరి రష్యా కామెంట్స్‌పై ట్రంప్‌ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల మాట్లాడుతూ, టోమాహాక్ క్షిపణులను అమెరికా సైనికుల ప్రత్యక్ష సహకారం లేకుండా ఉపయోగించడం అసాధ్యం అని అన్నారు. అందువల్ల, ఈ క్షిపణుల సరఫరా యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసే దశకు తీసుకెళ్తుందని హెచ్చరించారు.టోమాహాక్ క్షిపణిటోమాహాక్ క్షిపణి 2,500 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటాయి. అంటే ఉక్రెయిన్ నుంచి వీటిని ప్రయోగిస్తే అవి మాస్కో, యూరోపియన్ రష్యాలోని చాలా ప్రాంతాలను సులభంగా చేరుకోగలవు. టోమాహాక్ అనేది అమెరికా నేవీ ఐకానిక్ సబ్సెనిక్ కూయిజ్ క్షిపణి. దీనిని 1970ల నుంచి అభివృద్ధి చేశారు. దీనిని ఓడలు, జలాంతర్గాములు, ల్యాండ్ లాంచర్ల నుంచి ఈజీగా ప్రయోగించవచ్చు. ఇది 1,000 మైళ్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా కచ్చితంగా చేదించగలదు. వీటిలో బ్లాక్ ఐవీ (TACTOM) వెర్షన్ అత్యంత అధునాతనమైనది. ఈ సూపర్ వెపన్‌కు మరో ప్రత్యేకత కూడా ఉంది. దీనిని విమానం నుంచి ప్రయోగించినప్పుడు ఒకసారి నిర్దేశించిన లక్ష్యాలను కూడా మార్చుకునే అవకాశం ఉంది. ఇప్పుడీ క్షిపణులను అమెరికా.. ఉక్రెయిన్‌కు ఇస్తుంటే రష్యా ఆందోళన వ్యక్తం చేస్తోంది.

AP Electricity employees  preparing for a Chalo Vijayawada2
విద్యుత్ ఉద్యోగుల ఛలో విజయవాడ

విజయవాడ తమ సమస్యలను పరిష్కరించకపోతే ‘పవర్‌’ ఏమిటో చూపిస్తామని ఇప్పటికే హెచ్చరించిన ఏపీ విద్యుత్‌ జేఏసీ.. రేపు(సోమవారం, అక్టోబర్‌ 13వ తేదీ) చలో విజయవాడకు పిలుపునిచ్చింది. విద్యుత్‌ జేఏసీ పిలుపుతో ఉద్యమానికి సిద్ధమైంది విద్యుత్‌ సిబ్బంది. వేతనాలు, సర్వీస్‌ హక్కులు, ప్రమోషన్లు, పెన్షన్‌ విధానం సహా 15 ప్రధాన డిమాండ్లు చేస్తుంది విద్యుత్‌ జేఏసీ. విద్యుత్తు యాజమాన్యాలు, ప్రభుత్వంతో పలు దఫాల చర్చలు జరిగినా పరిష్కారం రాకపోవడంతో సమ్మెకు సిద్ధమైంది. దీనిలో భాగంగా రేపు చలో విజయవాడకు పిలుపునిచ్చింది. 15వ తేదీ నాటికి తమ సమస్యలకు పరిష్కారం రాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్‌ ఉద్యోగులు సమ్మెకు దిగుతారని హెచ్చరించింది. సమ్మెలో పాల్గొనడానికి అరవై వేలమంది విద్యుత్‌ సిబ్బంది సన్నద్ధమైంది. రేపు చలో విజయవాడ కార్యక్రమానికి విద్యుత్‌ సిబ్బంది వేల సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. ఉద్యోగుల ముఖ్యమైన డిమాండ్లివీ» కాంట్రాక్ట్‌ లేబర్, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను విద్యుత్‌ సంస్థల్లో విలీనం చేయాలి.» విద్యుత్‌ ఉద్యోగులకు, పెన్షనర్లకు, వారి కుటుంబ సభ్యులకు నగదురహిత అపరిమిత వైద్య సౌకర్యం కల్పించాలి.» జూనియర్‌ లైన్‌మెన్‌ గ్రేడ్‌–2 (ఎనర్జీ అసిస్టెంట్‌)లకు పాత సర్వీసు నిబంధనలు వర్తింపజేయాలి. వారికి అసిస్టెంటు లైన్‌మెన్‌గా పదోన్నతి కల్పించాలి.» కారుణ్య నియామకాలు కల్పించటంలో కన్సాలిడేటెడ్‌ పే ఇస్తున్న పద్ధతిని రద్దుచేసి పాత పద్ధతినే కొనసాగించాలి.» పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏ/డీఆర్‌లను మంజూరు చేయాలి. ఆటోమేటిక్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కీమ్‌ ప్రకారం జీతం స్కేల్స్‌ రూపొందించాలి.» ఇంజనీరింగ్‌ డిగ్రీ కలిగిన జూనియర్‌ ఇంజనీర్లకు, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజ­నీర్లుగా పదోన్నతిలో ఒక ప్రత్యేకమైన అవకాశం కల్పించాలి.» అర్హులైన ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ (ఓఅండ్‌ఎం) తదితర సర్వీసులకు చెందిన ఉద్యోగులను జూనియర్‌ అసిస్టెంట్, జూనియర్‌ ఇంజనీర్‌ ఖాళీలలో నియమించాలి. » 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్లను కాంట్రాక్టుకు ఇవ్వడం ఉపసంహరించాలి.» అన్ని విభాగాల్లో ఖాళీలు భర్తీ చేయాలి. పని ప్రమాణాల ప్రకారం అదనపు పోస్టులు మంజూరు చేయాలి.» పర్సనల్‌ ‘పే’ని ఎన్‌క్యాష్‌మెంట్‌ లీవ్, పదవీ విరమణ చేసినప్పుడు టెర్మినల్‌ లీవుతో కలిపి పేమెంట్‌ చేయాలి.» విద్యుత్‌ సంస్థలలో ఉన్న అన్ని ట్రస్టులను బలోపేతం చేసి మూడు నెలలకు ఒకసారి ట్రస్టు అడ్వైజరీ కమిటీ మీటింగ్‌లను నిర్వహించాలి.ఇదీ చదవండి: మా ‘పవర్‌’ ఏమిటో చూపిస్తాం!

Rasi Phalalu: Daily Horoscope On 13-10-2025 In Telugu3
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. నూతన ఉద్యోగయోగం

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి: బ.సప్తమి రా.5.48 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం: ఆరుద్ర రా.6.27 వరకు, తదుపరి పునర్వసు, వర్జ్యం: తె.5.56 నుండి 7.28 వరకు (తెల్లవారితే మంగళవారం),దుర్ముహూర్తం: ప.12.09 నుండి 12.55 వరకు, తదుపరి ప.2.28 నుండి 3.14 వరకు, అమృత ఘడియలు: ఉ.9.02 నుండి 10.33 వరకు.సూర్యోదయం : 5.55సూర్యాస్తమయం : 5.38రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకుయమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు మేషం.... కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. కుటుంబసభ్యులతో వివాదాల పరిష్కారం. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో కొత్త ఆశలు.వృషభం... ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలు మందగిస్తాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో గందరగోళం.మిథునం.... పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలాభం. నూతన ఉద్యోగయోగం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకం.కర్కాటకం... వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.సింహం.... నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో పురోగతి. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.కన్య..... కొత్త పనులు ప్రారంభం. శుభవార్తలు. దైవదర్శనాలు. విందువినోదాలు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు.తుల.... పనులు వాయిదా. శ్రమ పెరుగుతుంది. సన్నిహితులతో మాటపట్టింపులు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. ఖర్చులు పెరుగుతాయి.వృశ్చికం... బంధువులతో స్వల్ప వివాదాలు. ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.ధనుస్సు... ఆకస్మిక ధనలాభం. పనులు సజావుగా సాగుతాయి. బంధువుల కలయిక. విందువినోదాలు. ఇంటర్వ్యూలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి..మకరం.... వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభం. విలువైన వస్తువులు సేకరిస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వాహనయోగం.కుంభం.... ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. పనుల్లో జాప్యం. వృత్తి, వ్యాపారాలలో మార్పులు. ఆలయదర్శనాలు.మీనం... చేపట్టిన కార్యక్రమాలు మందగిస్తాయి. వ్యయప్రయాసలు. మిత్రులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు.

Womens Cricket World Cup 2025: Australia Wins Over India4
IND VS AUS: టీమిండియాపై ఆస్ట్రేలియా విజయం

మహిళల వన్డే ప్రపంచకప్‌ 2025లో (Women's Cricket World Cup 2025) భాగంగా విశాఖ వేదికగా ఆస్ట్రేలియాతో ఇవాళ (అక్టోబర్‌ 12) జరిగిన మ్యాచ్‌లో (India vs Australia) భారత్‌పై ఆస్ట్రేలియా మహిళలు 3 వికెట్ల తేడాతో గెలిచారు. నిర్ణీత 49 ఓవర్లలో 331 పరుగులు చేసి టీమిండియాపై ఆస్ట్రేలియా విజయం సాధించింది. మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్‌కు వరుసగా ఇది రెండవ ఓటమి.తొలుత టాస్‌ ఓడి ఆస్ట్రేలియా ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌ చేసి 330 పరుగులు (48.5 ఓవర్లలో ఆలౌట్‌) చేసింది. ఓపెనర్లు స్మృతి మంధన (Smriti Mandhana), ప్రతిక రావల్‌ (Pratika Rawal) అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా మంధన తన సహజ శైలిలో చెలరేగిపోయింది. 66 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసింది. మంధనతో పోలిస్తే ప్రతిక రావల్‌ కాస్త నిదానంగా ఆడింది. 96 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 75 పరుగులు చేసింది.ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో అలీస్సా హీలీ: 142 పరుగులు (107 బంతుల్లో) చేసి తన అద్భుత ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను గెలిపించింది దాంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది.ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది, అయితే చివరి ఓవర్లలో ఆసీస్ విజయం సాధించింది. భారత్ మంచి స్కోరు చేసినా, హీలీ అద్భుత ప్రదర్శనతో మ్యాచ్‌ను ఆసీస్ చేతుల్లోకి తీసుకెళ్లింది.

Grant in Aid from Central Govt not as expected by Telangana Govt5
లోటు.. లక్ష కోట్లు

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రం ఆశించిన గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ గత కొన్నేళ్లుగా అతి తక్కువగా వస్తోంది. 2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ రూపంలో కేంద్రం నుంచి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం ఆశించి వార్షిక బడ్జెట్‌లో ప్రతిపాదిస్తున్న నిధులకు, ఆ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి కేంద్రం ఇచ్చే మొత్తానికి పొంతన ఉండటం లేదు. గత ఐదేళ్లలో రాష్ట్రం ఆశించిన మొత్తంలో రూ.లక్ష కోట్లకు పైగా లోటు ఉండడం గమనార్హం. గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ నిధులను 2020–21లో చివరిసారి రాష్ట్రం ఆశించిన మేరకు కేంద్రం ఇచ్చింది. ఆ ఏడాదిలో రూ.10 వేల కోట్లు ఈ పద్దు కింద వస్తాయని అంచనా వేస్తే రూ.15 వేల కోట్ల వరకు ఇచ్చింది. దీంతో మరుసటి ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.38 వేల కోట్లు వస్తాయని అంచనా వేసి వార్షిక బడ్జెట్‌లో ప్రతిపాదించింది. కానీ, ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి 31 నాటికి కేంద్రం నుంచి వచ్చింది రూ.8 వేల కోట్లు మాత్రమే. అప్పటి నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వరకు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ నిధుల విషయంలో భారీ అంతరం కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆశించినదాంట్లో గరిష్టంగా 30 శాతం నిధులు కూడా ఈ పద్దు కింద రావడం లేదని కాగ్‌ గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద రూ.22,782.50 కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసి బడ్జెట్‌లో పెడితే.. తొలి ఐదు నెలల్లో (2025, ఆగస్టు 31 నాటికి) ఇచ్చింది రూ.1,673.43 కోట్లు మాత్రమే. గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ అంటే...గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ అంటే సాయం కింద ఇచ్చే మొత్తం అని చెప్పొచ్చు. ఈ గ్రాంట్‌ను తిరిగి ఇవ్వాల్సిన పని ఉండదు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం తిరిగి చెల్లించే షరతు ఉంటుంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చినా, రాష్ట్రం నుంచి ఏదైనా శాఖకు వెళ్లినా, ఎన్జీవోలు, విద్యాసంస్థలైనా ఇదే నిబంధన ఉంటుంది. వివిధ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ప్రాధాన్యతా ప్రాజెక్టులకు ఈ పద్దు కింద కేంద్రం నిధులు ఇచ్చే వెసులుబాటు ఉంది. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద కూడా ఇవ్వొచ్చు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఈ నిధులను మంజూరు చేయవచ్చు. అయితే, ఈ నిధులను ఏ కారణం కోసం అయితే ఇచ్చారో వాటికి మాత్రమే వినియోగించుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రాల స్వతంత్ర ఆలోచలను దెబ్బతీసే చర్య కేంద్ర ప్రభుత్వాల పెత్తందారీ వైఖరి కారణంగానే రాష్ట్రాలకు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ నిధులు రావడం లేదు. ఈ పద్దు కింద రాష్ట్రాలకు కేంద్రం నిధులు వస్తే తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఆయా రాష్ట్రాలకు ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. కానీ, కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆర్థిక అధికారాల కేంద్రీకరణ మాత్రం ఏటేటా పెరుగుతోంది. రాష్ట్రాలను ఆదాయ వనరులుగా చూస్తున్నారే తప్ప సాయం చేయడం లేదు. సెస్‌ల రూపంలో కేంద్రమే పన్నులు వసూలు చేసుకుంటోంది. ఆ పన్నుల్లో వాటా ఆశించినంతగా ఇవ్వడం లేదు. గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కూడా మంజూరు చేయడం లేదు. అనేక రకాలుగా కేంద్రంపై రాష్ట్రాలు ఆధారపడే విధంగా చేయడం ద్వారా ఆయా రాష్ట్రాల స్వతంత్ర ఆలోచనను కేంద్ర ప్రభుత్వం దెబ్బతీస్తోంది. ఈ ఆర్థిక అసమతుల్యత గతంలోనూ ఉన్నదే అయినా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత పెరిగింది. – ప్రొఫెసర్‌ అందె సత్యం, ఆర్థిక నిపుణులు

Sakshi Guest Column On Pakistan, India Issues6
మాటల్లో తెంపరితనం వద్దు!

‘‘వ్యూహాత్మకంగా మన శత్రువులందరినీ మనం తృణీకరించవచ్చు. కానీ, తార్కికంగా మనం వారందరినీ సీరియస్‌గా తీసుకుని తీరాలి.’’ మావో జెడాంగ్‌ 1957లో చేసిన ఈ వ్యాఖ్య లోతైనది. ‘‘ప్రభుత్వ సౌజన్యంతో సాగే ఉగ్రవాదాన్ని పాకిస్తాన్‌ కొనసాగిస్తే, భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌–1 సందర్భంగా చూపిన సంయమనాన్ని ఈసారి ప్రదర్శించకపోవచ్చు, ఈసారి మేం మరో అడుగు ముందుకేసి, నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తాం. అది ప్రపంచ పటంలో తాము కొనసాగాలో వద్దో పాక్‌ ఆలోచించుకొనేటట్లు చేస్తుంది’’ అని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేదీ ఇటీవల అన్న మాటలు విన్నవెంటనే మావో వ్యాఖ్య గుర్తుకు వచ్చింది.మొన్న మే నెలలో, స్వల్పకాలికమే అయినా నిర్ణయాత్మకమైన రీతిలో చేసిన పోరాటంలో పాక్‌ వైమానిక దళం ఎంతటి భారీ నష్టాన్ని చవిచూసిందీ భారత వైమానిక దళ చీఫ్‌ ఎ.పి.సింగ్‌ ఒక పత్రికా సమావేశంలో వివరించిన తర్వాత ద్వివేదీ నుంచి ఆ రకమైన ప్రకటన వెలువడింది. భారత్‌ వైపు చోటుచేసుకున్నట్లు చెబుతున్న నష్టాలను సింగ్‌ తోసిపుచ్చారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కూడా వారిద్దరి కేమీ తీసిపోనన్నట్లుగా మాట్లాడారు. వివాదాస్పద సర్‌ క్రీక్‌ ప్రాంతంలో పాక్‌ ఎటువంటి దుస్సాహసానికి దిగినా, భారత్‌ ఇచ్చే దీటైన జవాబు పాకిస్తాన్‌ ‘‘చరిత్రను, భౌగోళిక స్వరూపాన్ని రెండింటినీ’’ మార్చివేస్తుందని తన భుజ్‌ పర్యటనలో హెచ్చరించారు.తానేం తక్కువ తినలేదు!వీటిపై పాక్‌ అసాధారణమైన రీతిలో స్పందించింది. భారత దేశంలో ఏ మూలనైనా దాడి చేయగల సామర్థ్యం తమ సొంతమని ప్రకటించింది. ఒకవేళ అణ్వాయుధాలతో పాక్‌ను నిర్మూలించ దలిస్తే, అది పరస్పరమైనదిగా ఉంటుందని కుండబద్దలు కొట్టింది. అణ్వాయుధ సంపత్తి కలిగిన పాకిస్తాన్‌ విఫల రాజ్యమనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అది గత 40 ఏళ్ళుగా భారత్‌పై ఉగ్రవాదాన్ని ఎగదోస్తూనే ఉంది. చేబదుళ్ళు తెచ్చుకుంటూ రోజులు నెట్టు కొస్తోంది. అయినప్పటికీ, 6,60,000 బలగం కలిగిన పాక్‌ సైన్యాన్నీ, దాని అణ్వాయుధాలనూ భారత్‌ తేలిగ్గా తీసుకోవడానికి లేదు.ప్రపంచం పటం నుంచి తుడిచిపెట్టేస్తూంటే పాక్‌ అణ్వాయుధాలను ప్రయోగించకుండా కళ్ళప్పగించి చూస్తూ ఊరుకుంటుందను కోవడం అవివేకం. అంత తేలికేం కాలేదు!పాక్‌ విజయ తంత్రాలను 1965లో ఛేదించడంలో భారత్‌ సఫలమైన మాట నిజమే కానీ, ఆ యుద్ధం ఒక రకంగా డ్రాగా ముగిసింది. రెండు పక్షాలూ ప్రత్యర్థి భూభాగాల నుంచి చెరికొంత ప్రయోజనాలను మూటగట్టుకున్నాయి. ఇక, పాక్‌తో భారత్‌ 1947 – 48 యుద్ధాన్ని కొనసాగించి ఉంటే మొత్తం జమ్ము–కశ్మీర్‌ విముక్త మయ్యేదనే అభిప్రాయం చాలా మందిలో బలంగా ఉంది. దేశ విభజన రక్తపు చారికలు ఆరకముందే, ఒక దేశంగా ఇంకా పూర్తిగా పటిష్ఠం కాకముందే, ఆ యుద్ధం జరిగివుంటే మరింత వినాశకర పర్యవసానాలకు దారితీసి ఉండేది. మనం 1971లో తూర్పున చేసిన యుద్ధం బ్రహ్మాండంగా విజ యవంతమైంది. కానీ, అది మనం ఓటమికి అణువంత అవకాశం కూడా ఇవ్వకూడని యుద్ధమనే సంగతిని మరచిపోకూడదు. ఈ విషయమై పాశ్చాత్యుల కథనం మాత్రం వేరు. పాక్‌ ఆకాశంలో సత్తా చూపలేక, చతికిలపడి ఉండవచ్చు. కానీ, క్షేత్ర స్థాయిలో మనం గడించిన లాభాలు అంతంతమాత్రమే! పైగా మనం ఛంబ్‌ (పీఓకే)ను కోల్పోవలసి వచ్చింది.ఇక కార్గిల్‌ సంగతికొస్తే ఎత్తుగడ రీత్యా అది ఒక పరిమిత యుద్ధం. భారత్, పాక్‌ రెండూ అపుడు అణ్వాయుధ దేశాలు. భౌగో ళికపరంగా, తీవ్రత పరంగా యుద్ధాన్ని కొంత మేరకే పరిమితం చేయా లనే వ్యూహాన్ని న్యూఢిల్లీ అనుసరించింది. ఈ సందర్భంగా భారత్‌కు అంతర్జాతీయంగా లభించిన మద్దతు పెద్ద ఫలితాన్ని ఇచ్చింది. ముఖ్యంగా అమెరికా నుంచి లభించిన మద్దతు వల్ల కార్గిల్‌లోని మిగి లిన పర్వత శిఖరాల నుంచి పాక్‌ సేనలు తోక ముడవవలసి వచ్చింది. 2002లో నిర్వహించిన ‘ఆపరేషన్‌ పరాక్రమ్‌’ భారత్‌–పాక్‌ సేనల సమీకరణను చూసింది. కానీ, తొమ్మిది నెలల తర్వాత, తుది ఫలితం అనుకూలంగా వస్తుందనే పూచీ లేకపోవడం వల్ల, భారత్‌ దాన్ని విరమించుకోవాల్సి వచ్చింది. ముంబయ్‌పై 2008 దాడి నేపథ్యంలోనూ అదే రకమైన పరిణామం చోటుచేసుకుంది.‘ఆపరేషన్‌ పరాక్రమ్‌’ ఉపసంహరణ తర్వాత, ఆ సారాంశాన్ని పర్వేజ్‌ ముషారఫ్‌ బాగా వివరించారు. ‘‘వారు (భారత్‌) మాపై దాడికి దిగరని, రెండు సైనిక శక్తులనూ బేరీజు వేసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాను. దాడికి దిగే సేన విజయం సాధించేందుకు సైనికపరంగా ఒక నిర్దిష్ట నిష్పత్తి అవసరం. మేం నిర్వహిస్తూ వస్తున్న ఆ నిష్పత్తులు అంతకన్నా ఎక్కువగా ఉన్నాయి. ఆత్మరక్షణ చేసు కోవాల్సిన పక్షం తనను తాను కాపాడుకునేందుకు అవసరమైన దానికన్నా ఎక్కువ నిష్పత్తిలోనే ఉన్నాయి’’ అని ఆయన అన్నారు.ఇప్పుడేం మారిందని?పాక్‌పై భారత్‌ పదాతి దళాలతో దాడికి దిగితే విజయం ఖాయ మని సూచించేంతగా సంఖ్యలు, మోహరణలు, రక్షణ సామగ్రి పరంగా పరిస్థితిలో తేడా ఏమీ రాలేదు. మనం ఎంత చక్కగా సమా యత్తమై, ప్రేరణతో ఉన్నామో, అవతలి పక్షంవారు కూడా అలాగే ఉన్నారు. పైగా, వాస్తవాధీన రేఖ వెంబడి చైనా సేనల మోహరింపును ఎదుర్కొనేందుకు గడచిన ఐదేళ్ళుగా భారత్‌ తన సేనల కదలికలను నిశితంగా మార్చుకోవాల్సి వస్తోంది. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ నేపథ్యంలో, పాకిస్తానీ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో, ప్రధాని మోదీ నూతన మార్గదర్శక సూత్రాలను నిర్దేశించారు. పాక్‌ను శిక్షించేందుకు అణు, సంప్రదాయ ఘర్షణల మధ్య తేడాను మెరుగైన రీతిలో వినియోగించుకోవాల్సి ఉందని ఆ మార్గదర్శక సూత్రాలు డిమాండ్‌ చేస్తున్నాయి. నాశనమైపోతారు జాగ్రత్తంటూ ప్రత్యర్థులను హెచ్చరించే బదులు, ప్రధాని చెప్పినట్లు నడచుకునేందుకు తగిన వ్యూహాలను పన్నడంపై సైన్యాధికారులు దృష్టి కేంద్రీకరించాలి. మనోజ్‌ జోషీవ్యాసకర్త న్యూఢిల్లీలోని ‘అబ్జర్వర్‌ రిసెర్చ్‌ ఫౌండేషన్‌’లో విశిష్ట పరిశోధకుడు (‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)

Sakshi Editorial On Laszlo Krasznahorkai winning Nobel Prize7
యుగాంత రచయిత

ఆధునిక యూరప్‌ సాహిత్యంలోనైనా, ఏ తరపు యూరప్‌ సాహిత్యంలోనైనా విశిష్ట స్థానం ఉన్న హంగెరీ రచయిత లాస్లో క్రాస్‌నాహోర్‌కైయేను ఈ యేటి సాహిత్య నోబెల్‌ పురస్కారం వరించింది. ‘ప్రళయ భయాల మధ్యలోనూ కళాశక్తిని తిరిగి ధ్రువీకరించే... ఆకర్షణీయమైన, దూరదృష్టి గల సాహిత్య కృతుల సమాహారానికిగానూ’ 1954లో జన్మించిన ఈ 71 ఏళ్ల ‘హంగేరియన్‌ రుషి’కి ఈ గౌరవం దక్కింది. తన తొలి నవల ‘సాటాన్‌టాంగో’(1985)కు మూడు దశాబ్దాల తర్వాత వెలువడిన ఆంగ్లానువాదానికిగానూ 2015లో ‘మ్యాన్‌ బుకర్‌ ఇంటర్నేషనల్‌ ప్రైజ్‌’ అందుకున్న లాస్లో సరిగ్గా దశాబ్దం తర్వాత మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ఏకాంతంగా ఉండటానికి ఇష్టపడే ఆయన ‘ద మెలంకలీ ఆఫ్‌ రెసిస్టెన్స్‌’ (1989), ‘వార్‌ అండ్‌ వార్‌’ (1999), ‘బారన్‌ వెంక్‌హెయిన్స్‌ హోమ్‌కమింగ్‌’ (2016) లాంటి ఇతర పోస్ట్‌మాడర్న్‌ నవలలు రాశారు.కథకుడు కూడా అయిన లాస్లో క్రాస్‌నాహోర్‌కైయే ప్రధానంగా హంగేరియన్‌ భాషలోనూ, చాలాకాలంగా నివాసం ఉండటం వల్ల జర్మన్‌లోనూ రాస్తారు. ఆయన సాహిత్యంలో ప్రపంచం వల్ల గాయపడిన మనుషులు కనిపిస్తారు. భయ పీడనలను వాళ్లు తప్పించుకోలేరు. సామాజిక అభద్రత, అశాంతి, భరించలేని ఉక్కపోత, నియంతృత్వపు అరాచకాల ఈ అపసవ్య ప్రపంచంలో జరిగే కర్కశ పోరాటాలను ఆయన చిత్రించారు. అందానికీ అవినీతికీ, అమాయకత్వానికీ కపటానికీ, బలహీనతకూ మొరటు బలానికీ మధ్య జరిగే ఎడతెగని పోరు; ప్రతి ఎత్తునూ ఒక అగాథానికి లాగే, ప్రతి స్వర్గాన్నీ ఒక నరకానికి నేలకూల్చే దారుణాలు ఆయన వస్తువులు. అందుకే అమెరికన్‌ విమర్శకురాలు సూసన్‌ సోంటాగ్‌ ఆయన్ని యుగాంత సాహిత్యపు గురువుగా అభివర్ణించారు. ఆయన కళ ఎల్లప్పుడూ అసంబద్ధతకు ఆతిథ్యంగా నిలుస్తుంది– ప్రపంచం తానే ఒక వ్యక్తిత్వాన్ని సంతరించుకొని, దయలేని ప్రతిద్వంద్విగా మారే మార్గాలకు సదా తెరిచి ఉంటుందని వ్యాఖ్యానిస్తారు బ్రిటిష్‌ రచయిత ఆడమ్‌ థర్ల్‌వెల్‌.కాఫ్కా ‘ద క్యాజిల్‌’, దోస్తోవ్‌స్కీ ‘ది ఇడియట్‌’ను అభిమానించే లాస్లో ఎన్నడూ రచయిత కావాలని అనుకోలేదు. 1970ల్లో ఆయన పాస్‌పోర్టును కమ్యూనిస్టు అధికారులు జప్తు చేశారు. దానివల్ల బొగ్గు గని కార్మికుడిగా పనిచేశారు. ఆవుల కొట్టాలకు రాత్రుళ్లు కావలి కాశారు. బార్లలో పియానో వాయించారు. గ్రామాల్లో పేదలతో కలిసి బతికారు. వీధుల్లోని జన భాషను ఒంటబట్టించుకున్నారు. మూడు నాలుగు నెలలకోసారి కొత్త పనులు వెతుక్కుంటూ తిరిగారు. ఈ అశాశ్వత ప్రపంచానికి కళ ఒక్కటే అతివిశిష్టమైన ప్రతిస్పందన అని నమ్మి రచనా వ్యాసంగం వైపు మళ్లారు. లాస్లో లాగే రాజ్య వ్యవస్థ బాధితుడైన హంగెరీ దిగ్దర్శకుడు బేలా టార్‌ ఆయనతో జట్టు కట్టడం యావత్‌ ప్రపంచ సినిమాకే మేలు చేసింది. బేలా టార్‌ను బేలా టార్‌గా నిలబెట్టిన సినిమాల రచయితగా లాస్లో పనిచేశారు. ‘డామ్నేషన్‌’, ‘ద లాస్ట్‌ బోట్‌– సిటీ లైఫ్‌’, ‘వెర్క్‌మెయిస్టర్‌ హార్మనీస్‌’, ‘ద ట్యూరిన్‌ హార్స్‌’తో పాటు ఏడు గంటల నిడివుండే ‘సాటాన్‌టాంగో’ వీరి కాంబినేషన్లో వెలువడ్డాయి. నలుపు తెలుపుల్లో తీయడం,దీర్ఘ షాట్లు, మౌనం మాట్లాడటం, ఏమీ జరగకుండానే ఎంతో జరిగినట్టనిపించడం వీటి ప్రత్యేకత.లాస్లో వచనంలో అన్నీ గుక్క తిప్పుకోలేని దీర్ఘ వాక్యాలే. ఫుల్‌స్టాపులు దేవుడికి సంబంధించినవంటారాయన. గుర్రాలు, గ్రహణాలు, తిమింగళాలు, ఇంకా మానవ ఉనికితో సహా ఈ విశ్వంలోని ప్రతిదాన్నీ అందమైనదిగా, అద్భుతమైనదిగా విశ్వసించే సాధారణ మనుషులు ఆయన సాహిత్యంలో ఆశావహ ప్రపంచపు ప్రతినిధులుగా కనబడతారు. కానీ ఆ ఆశ అనేది ఎప్పటికీ భవిష్యత్తుకు సంబంధించినదే; అలాంటి భవిష్యత్తుతో మనల్ని మనం భ్రమింపజేసుకుంటాం, ఆ భవిష్యత్తు ఎప్పటికీ రాదు; ఉన్నది వర్తమానం మాత్రమే అంటారు బౌద్ధ తాత్విక చింతనను ఇష్టపడే లాస్లో. యుగాంతం ఎప్పుడో సంభవించేది కాదనీ, అది ఇక్కడే ఉంది; అది సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ప్రక్రియ అనీ పాఠకులను అప్రమత్తం చేస్తారు. ఈ చీకటి యుగంలో బతకడానికి చదవడం మరింత శక్తినిస్తుందంటారు.

Teachers to inspect schools Controversial orders surface again8
స్కూళ్ల తనిఖీకి టీచర్లు

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసే అధికారం ఉపాధ్యాయులకు ఇస్తూ విద్యాశాఖ మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల వారీగా బృందాలను ఏర్పాటు చేస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ ఆదేశాలు ఇచ్చారు. ప్రాథమిక పాఠశాలలకు 168, ప్రాథమికోన్నత పాఠశాలలకు 35, ఉన్నత పాఠశాలలకు 96 బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో ఆయా స్థాయిల ప్రధానోపాధ్యాయుడు నోడల్‌ అధికారిగా, సెకండరీ గ్రేడ్‌ టీచర్లు సభ్యులుగా ఉంటారు. ప్రైమరీ, ప్రాథమికోన్నత పాఠశాలల్లో వేసే కమిటీల్లో ముగ్గురు, హైస్కూల్‌ స్థాయిలో 9 మంది సభ్యులు ఉంటారు. ప్రస్తుతం ప్రతీ మండల పరిధిలో స్కూళ్ల తనిఖీకి కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలు, మండల విద్యాశాఖాధికారులు పనిచేస్తున్నారు. తాజా కమిటీలు జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో ఏర్పడతాయి. ఏప్రిల్‌ 4వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ నేపథ్యంలో పాఠశాల తనిఖీలు విస్తృతం చేయాలని, ఇవి నిరంతరంగా ఉండాలని పేర్కొన్నారు. దీంతో తనిఖీలకు ఉపాధ్యాయులనే నియమించేందుకు విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. కమిటీలు ఏం చేస్తాయి? పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, మధ్యాహ్న భోజన నిర్వహణ, ఉపాధ్యాయుల హాజరు ఏ విధంగా ఉంది? ఎప్పుడు వస్తున్నారు ? బోధన ప్రణాళికను ఎలా అమలు చేస్తున్నారు? విద్యార్థుల హాజరు శాతం? ఇతర ప్రధాన కార్యక్రమాలు ఎలా అమలు చేస్తున్నారు? అనే అంశాలను ఈ కమిటీలు పరిశీలిస్తాయి. ఆ వివరాలను జిల్లా విద్యాశాఖ అధికారులకు అందిస్తాయి. జిల్లా అధికారులు ప్రతీ నెలా 5వ తేదీన రాష్ట్ర విద్యాశాఖ ప్రధాన కార్యాలయానికి వాటిని పంపుతారు. కలెక్టర్ల సమావేశంలో ప్రతీనెలా ప్రభుత్వం ఈ అంశాలపై చర్చిస్తుంది. కమిటీల్లో ఎంపికయ్యే టీచర్లు ఏడాదిపాటు ఇదే పనిలో ఉంటారు. బోధన చేపట్టాల్సిన అవసరం ఉండదు. – పర్యవేక్షణ కమిటీ కోసం ఎంపిక చేసే టీచర్లు కనీసం పదేళ్ల పాటు టీచర్‌గా ప్రభుత్వ స్కూళ్లల్లో పనిచేసిన అనుభవం ఉండాలి. ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎంలు, లేదా ఎస్‌జీటీలను నియమిస్తారు. వీరు ప్రతీ రోజు రెండు స్కూళ్లను విధిగా తనిఖీ చేయాలి. – ప్రాథమికోన్నత పాఠశాలలకు ఎంపిక చేసే టీచర్లు కూడా పదేళ్ల అనుభవం కలిగి ఉండాలి. స్కూల్‌ అసిస్టెంట్లను నియమిస్తారు. వీరు రోజుకు రెండు స్కూళ్లను తనిఖీ చేయాలి. – ఉన్నత పాఠశాలలకు కూడా పదేళ్ల అనుభవం ఉన్న స్కూల్‌ అసిస్టెంట్లు అర్హులు. వీరు రోజూ ఒక స్కూల్‌ను, మూడు నెలల్లో 50 స్కూళ్లను తనిఖీ చేయాలి. కొంతకాలం బ్రేక్‌ తర్వాత.. మళ్లీ వాస్తవానికి పాఠశాలల తనిఖీకి ఉపాధ్యాయులను నియమిస్తూ జూన్‌ 21వ తేదీన విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. వీటిపై ఉపాధ్యాయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. స్కూల్‌ అసిస్టెంట్‌ స్థాయి టీచర్‌.. గెజిటెడ్‌ హెచ్‌ఎం పనిచేసే స్కూల్‌ను తనిఖీ చేయడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమైంది. ఇప్పటికే కాంప్లెక్స్‌ హెచ్‌ఎం, ఎంఈఓలతో పాటు అభ్యసన సామర్థ్య పరిశీలనకు ప్రత్యేకంగా ఐదు స్థాయిల అధికారులను నియమించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకెన్ని తనిఖీ వ్యవస్థలను ఏర్పాటు చేస్తారని పలు సంఘాలు విద్యాశాఖ కార్యదర్శి వద్ద అభ్యంతరం తెలిపాయి. ఇప్పటికే స్కూళ్లల్లో సబ్జెక్టు టీచర్ల కొరత ఉందని, కొత్త కమిటీల వల్ల ప్రతీ జిల్లాలోనూ రెండు శాతం టీచర్లు తనిఖీ అధికారులుగా వెళతారని తెలిపారు. దీంతో ఇచ్చిన ఉత్తర్వులను మధ్యలో నిలిపివేశారు. తనిఖీలు చేపట్టాల్సిందేనని, టీచర్లే తనిఖీలు చేస్తే వాస్తవాలు తెలుస్తాయని ఉన్నతాధికారులు భావించారు. దీంతో మళ్లీ తనిఖీ బృందాల ఏర్పాటుకు ఆదేశాలిచ్చారు.

YSRCP Calls Protest Against Fake Liquor Racket9
నకిలీ మద్యం కుంభకోణం.. ఏపీ రాష్ట్రవ్యాప్త నిరసనలకు వైఎస్సార్‌సీపీ పిలుపు

తాడేపల్లి : నకిలీ మద్యం కుంభకోణంతో కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న క్రమంలో రేపు(సోమవారం, అక్టోబర్‌ 13వ తేదీ) రాష్ట్ర వ్యాప్త నిరసనలకు వైఎస్సార్‌సీపీ పిలుపునిచ్చింది. నకిలీ మద్యం తయారీని చంద్రబాబు సర్కార్ కుటీర పరిశ్రమలా మార్చిన నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ నిరసనలకు పిలుపునిచ్చింది. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోని ఎక్సైజ్‌ కార్యాలయాల ఎదుట నిరసనలు చేపట్టనుంది. నకిలీ మద్యం రాకెట్‌లో ఉన్న వారందర్నీ అరెస్ట్‌ చేయాలనే డిమాండ్‌తో ఆందోళనలకు పిలుపునిచ్చింది వైఎస్సార్‌సీపీ. నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలను బలపీఠంపై పెట్టడంపై నెట్టింట ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఇదీ చదవండి: నకిలీ మద్యంలో ఈ ప్రశ్నలకు బదులేది..?

Railway Board plans to manufacture Vande Bharat sleeper trains at Kazipet10
వందే భారత్‌ స్లీపర్‌ @ కాజీపేట

సాక్షి, హైదరాబాద్‌: కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీలో వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లను తయారు చేయాలని రైల్వే బోర్డు భావిస్తోంది. వచ్చే సంవత్సరం మార్చిలో దీనికి సంబంధించిన ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. తొలుత కాజీపేటలో సాధారణ రైళ్లకు వినియోగించే ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు, ఎంఎంటీఎస్‌ తరహా రైళ్లకు వినియోగించే ఎలక్ట్రిక్‌ మల్టిపుల్‌ యూనిట్స్‌ (ఈఎంయూ), సాధారణ వందేభారత్‌ కోచ్‌లను తయారు చేయాలని బోర్డు భావించింది. కానీ, ప్రస్తుతం దేశవ్యాప్తంగా వీలైనన్ని వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లను అందుబాటులోకి తేవాలని నిర్ణయించిన నేపథ్యంలో కాజీపేట కొత్త కోచ్‌ ఫ్యాక్టరీని అందుకు కేటాయించాలని తాజాగా నిర్ణయించినట్టు తెలిసింది. ఈ కోచ్‌ ఫ్యాక్టరీ దాదాపు సిద్ధమైనా, ఇప్పటివరకు కోచ్‌ల తయారీ ఆర్డర్‌ను ఇవ్వలేదు. వాటి స్థానంలో వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లను తయారు చేయిస్తేనే బాగుంటుందన్న భావనతోనే వర్క్‌ ఆర్డర్‌ జారీలో జాప్యం చేస్తున్నట్టు తెలుస్తోంది. వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లకు డిమాండ్‌ ఎక్కువ ఉండటంతో... ప్రస్తుతం దేశవ్యాప్తంగా 19 రూట్లలో 76 వందేభారత్‌ రైళ్లు నడుస్తున్నాయి. వీటిల్లో 33 రైళ్లు మాత్రమే 20, 16 కోచ్‌లతో నడుస్తుండగా మిగతావన్నీ 8 కోచ్‌లతో కూడిన మినీ వందేభారత్‌ సర్వీసులుగా సేవలందిస్తున్నాయి. వందేభారత్‌ రైళ్లు ప్రారంభించిన కొత్తలో వాటికి విపరీతమైన డిమాండ్‌ ఏర్పడి అన్ని రాష్ట్రాలు వాటి కోసం పోటీలో నిలిచాయి. కానీ, టికెట్‌ ధర ఎక్కువగా ఉండటం, అవి కేవలం పగటి పూట మాత్రమే నడుస్తుండటంతో వాటిపై రానురాను ఆసక్తి సన్నగిల్లుతోంది. ఇదే సమయంలో కేంద్రం వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లను అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటికే ఒక ప్రోటోటైప్‌ రైలు ట్రయల్స్‌ కూడా పూర్తి చేసుకుంది. రెండోది త్వరలో ట్రయల్స్‌కు సిద్ధమవుతోంది. ఆ వెంటనే వీటిని పట్టాలెక్కించనున్నారు. వీటి గరిష్ట వేగం గంటకు 180 కి.మీ.లు కావటంతోపాటు ఇవి స్లీపర్‌ మోడ్‌ రైళ్లు అయినందున రాత్రివేళ తిరుగుతాయి. దూరప్రాంతాల మధ్య తిరిగే రైళ్లలో పగటివేళ ప్రయాణానికి ఎక్కువ మంది ఆసక్తి చూపరు. దానివల్ల పనులు చేసుకునే పగటి సమయం వృథా అవుతుండటమే కారణం. దీంతో ఇప్పుడు సాధారణ వందేభారత్‌ రైళ్లకు బదులు తమకు వందేభారత్‌ స్లీపర్‌ సర్వీసులు కేటాయించాలని రాష్ట్రాలు కోరుతున్నాయి. దీంతో క్రమంగా సాధారణ వందేభారత్‌ రైళ్ల డిమాండ్‌ తగ్గుతూ వస్తోంది. 200 వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లు... వీలైనంత తొందరలో దేశవ్యాప్తంగా 200 వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లను ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. క్రమంగా ప్రస్తుతం తిరుగుతున్న రాజధాని, దురొంతో ప్రీమియం కేటగిరీ సహా సూపర్‌ ఫాస్ట్‌ రైళ్ల స్థానంలో వాటిని ప్రవేళపెట్టే యోచనలో ఉంది. ఇది జరగాలంటే తక్కువ సమయంలో వీలైనన్ని రేక్స్‌ తయారు కావాల్సి ఉంటుంది. – ప్రస్తుతం చెన్నై ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో తొలి ప్రోటోటైప్‌ రైలు తయారు కాగా, అక్కడ మరిన్ని రైళ్లను తయారు చేయనున్నారు. – రష్యాకు చెందిన కినెత్‌ రైల్వే సొల్యూషన్స్‌తో కలిసి రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ జాయింట్‌ వెంచర్‌గా ఏర్పడి 120 రైళ్లను తయారు చేయనుంది. లాతూర్‌లోని మరాటా్వడా కోచ్‌ ఫ్యాక్టరీలో ఇవి తయారవుతాయి. – బెంగళూరులోని భారత్‌ ఎర్త్‌మూవర్స్‌ లిమిటెడ్‌ (బీఈఎంఎల్‌)లో రెండో ప్రోటోటైప్‌ రైలు సిద్ధమవుతుండగా, ఇక్కడ వెంటనే మరిన్నింటి తయారీ కొనసాగనుంది. – కోల్‌కతా శివారులోని టీటాగర్‌ రైల్‌ సొల్యూషన్స్‌ ఫ్యాక్టరీ, ఉత్తరప్రదేశ్‌లోని మోడ్రన్‌ కోచ్‌ ఫ్యాక్టరీలను కూడా ఇందుకు వినియోగించనున్నారు. అయితే డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా ఉండాలంటే మరిన్ని కోచ్‌ ఫ్యాక్టరీల్లో కూడా వాటి తయారీ అవసరమని తాజాగా రైల్వే శాఖ భావిస్తోంది. దీంతో కొత్తగా అందుబాటులోకి వస్తున్న కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీని కూడా ఇందుకు వినియోగించాలని భావిస్తోంది. ఈమేరకు ఇటీవల అధికారులు కోచ్‌ ఫ్యాక్టరీని సందర్శించి వెళ్లారు. ఈ సంవత్సరం చివరి నాటికి అది పూర్తిస్థాయిలో సిద్ధం కానుంది. మార్చి నుంచి ఉత్పత్తి ప్రారంభించొచ్చని అధికారులు తేల్చారు. ఆ మేరకు రైల్వే బోర్డు ఉన్నతాధికారులు ఢిల్లీలో కూడా సమావేశమై దీనిపై చర్చించినట్టు తెలిసింది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement