
ముంబై: అమెరికా – చైనా మధ్య తాజా ఉద్రిక్తతలు డాలర్ మారకంలో రూపాయి విలువను బలహీనపరిచాయి. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ గత శుక్రవారంతో పోల్చితే 18 పైసలు తగ్గి, 69.40కి చేరింది. చైనా దిగుమతులపై సుంకాలు పెంచుతామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు ఈక్విటీ మార్కెట్లకు కూడా ప్రతికూలం కావడం రూపాయి సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. క్యాపిటల్ మార్కెట్లలో ఫారెన్ ఇన్వెస్టర్లు నికర అమ్మకాలు జరిపారు. సోమవారం ట్రేడింగ్ మొదట్లోనే రూపాయి బలహీనంగా 69.38 వద్ద ప్రారంభమైంది.
క్రూడ్ ధరలు, ఎన్నికల ఫలితంపై అనిశ్చితి వంటి అంశాల నేపథ్యంలో మే నెల మొత్తం రూపాయి తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యే అవకాశం ఉందని నిపుణుల అంచనా. సమీప కాలంలో 70–68 శ్రేణిలో స్థిరీకరణ పొందే అవకాశాలు ఉన్నాయన్నది విశ్లేషణ. అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అయితే క్రూడ్ ధరల పతనం భారీ పతనం, ఎన్నికల అనంతరం మోదీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందన్న అంచనాల నేపథ్యంలో రూపాయి రెండు నెలల క్రితం 68 స్థాయినీ చూసింది.