విప్రో లాభం 2,388 కోట్లు | Wipro Q1 net grows 12.6 persant to Rs 2,388 cr | Sakshi

విప్రో లాభం 2,388 కోట్లు

Jul 18 2019 5:01 AM | Updated on Jul 18 2019 5:11 AM

Wipro Q1 net grows 12.6 persant to Rs 2,388 cr - Sakshi

న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం విప్రో నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ క్వార్టర్‌లో 12 శాతం వృద్ధితో రూ.2,388 కోట్లకు పెరిగింది. అయితే సీక్వెన్షియల్‌గా చూస్తే, (గత క్యూ4లో వచ్చిన నికర లాభం రూ.2,484 కోట్లుతో పోల్చితే) 4 శాతం తగ్గింది. గత క్యూ1లో రూ.13,978 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం 5 శాతం వృద్ధితో రూ.14,716 కోట్లకు పెరిగిందని విప్రో కంపెనీ తెలిపింది. సీక్వెన్షియల్‌గా చూస్తే, 9% తగ్గింది. సెప్టెంబర్‌ క్వార్టర్‌లో ఆదాయం 2% మేర పెరగగలదని ఈ కంపెనీ అంచనా వేస్తోంది. కాగా ఇటీవలే ఫలితాలు వెల్లడించిన టీసీఎస్, ఇన్ఫోసిస్‌ల కంటే విప్రో ఆదాయం విషయంలో వెనకబడిపోయింది. టీసీఎస్‌ ఆదాయం 11% వృద్ధితో రూ.38,172 కోట్లకు, ఇన్ఫోసిస్‌ ఆదాయం 14% వృద్ధితో రూ.21,803 కోట్లకు పెరిగాయి.  

నిర్వహణ లాభం 6 శాతం డౌన్‌...
కంపెనీకి కీలకమైన ఐటీ సర్వీసుల విభాగం ఆదాయం 2 శాతం తగ్గి 203 కోట్ల డాలర్లకు చేరిందని విప్రో వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్‌లో ఈ విభాగం ఆదాయం 204–208 కోట్ల డాలర్ల(0–2% వృద్ధి)రేంజ్‌లో ఉండగలదని పేర్కొంది. సీక్వెన్షియల్‌గా చూస్తే, ఈ విభాగం నిర్వహణ లాభం 6% తగ్గి రూ.2,652 కోట్లకు చేరిందని, మార్జిన్‌ 1% తగ్గి 18.4 శాతానికి చేరిందని తెలిపింది. వేతనాల వ్యయం అధికంగా ఉండటం, రూపాయి బలపడటం దీనికి కారణాలని వివరించింది.  

పరిస్థితులు మెరుగుపడతాయ్‌...!  
10 కోట్ల డాలర్లకు మించిన డీల్స్‌ మూడు సాధించామని విప్రో కంపెనీ విప్రో సీఈఓ  ఈడీ, అబిదాలి   నీమూచ్‌వాలా పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్‌ నిలకడగానే ఉందన్నారు. అయితే ఆర్థిక వ్యవస్థ మందగమనంగా ఉండటం వల్ల బ్యాంకింగ్, ఆర్థిక, బీమా రంగ కంపెనీలు నిర్ణయాలు తీసుకునే విషయంలో వెనకాడుతున్నాయని వివరించారు. ఇది తాత్కాలికంగానే ఉంటుందని, రోజులు గడుస్తున్న కొద్దీ పరిస్థితులు మెరుగుపడగలవన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.  

షేర్ల బైబ్యాక్‌ పూర్తి చేస్తాం...
సెబీ ఆమోదం రాగానే రూ.10,500 కోట్ల షేర్ల బైబ్యాక్‌ను పూర్తి చేస్తామని విప్రో తెలిపింది. ఈ షేర్ల బైబ్యాక్‌లో భాగంగా ఈ కంపెనీ ఒక్కో షేర్‌ను రూ.325 ధరకు మొత్తం 32.31 కోట్ల షేర్లను బైబ్యాక్‌ చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం మందగమనంగానే మొదలైందని విప్రో సీఎఫ్‌ఓ జతిన్‌ దలాల్‌ చెప్పారు. భవిష్యత్తులో  మంచి వృద్ధి సాధన దిశగా ప్రతిభ, సామర్థ్యాలపై పెట్టుబడులు కొనసాగిస్తామన్నారు.
మార్కెట్లో ట్రేడింగ్‌ ముగిసిన తర్వాత కంపెనీ ఆర్థిక ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాలపై అనిశ్చితి కారణంగా బీఎస్‌ఈలో విప్రో షేర్‌ 0.13 శాతం నష్టంతో రూ.260 వద్ద ముగిసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement