పోర్టు నిర్మాణం పేరిట అధికారులు, రైతుల అంగీకారంతో నిమిత్తం లేకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని చినకరగ్రహారం సర్పంచ్ నడకుదుటి వెంకటేశ్వరరావు ధ్వజమెత్తారు.
⇒ సర్కారు తీరుపై రైతుల మండిపాటు
⇒ అంగీకారం లేకుండా భూములు స్వాధీనం చేసుకుంటున్నారని ఆందోళన
⇒ నష్టపరిహారం ఇవ్వకుంటే తీవ్ర స్థాయిలో ఉద్యమం తప్పదని హెచ్చరిక
మచిలీపట్నం : పోర్టు నిర్మాణం పేరిట అధికారులు, రైతుల అంగీకారంతో నిమిత్తం లేకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని చినకరగ్రహారం సర్పంచ్ నడకుదుటి వెంకటేశ్వరరావు ధ్వజమెత్తారు. చినకరగ్రహారం రైతులు ఆది వారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరగ్రహారం, మంగినపూడి, తపసిపూడి, పోతేపల్లి గ్రామాల ఆయకట్టులోని అసైన్డ్, ప్రభుత్వ భూములు 3,014 ఎకరాలను కాకినాడ పోర్టు డైరెక్టర్‌కు అప్పగిస్తూ రెవెన్యూ అధికారులు నిర్ణయం తీసుకోవటం రైతులను మోసం చేయటమేనన్నారు.
ఎంతో కాలంగా సాగు చేసుకుంటున్న భూములను మత్స్యకారుల అనుమతి లేకుండా, అంగీకారం లేకుండా స్వాధీనం చేసుకోవటం సమంజసం కాదన్నారు. రైతుల మధ్య రెవెన్యూ అధికారులు విభేదాలు సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. భూములకు నష్టపరిహారం ఇవ్వకుండా సమీకరిస్తే తీవ్రస్థాయిలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.