అందరి బంధువయా | Shilparamam in Handicraft Artists | Sakshi

అందరి బంధువయా

Published Sat, Dec 6 2014 11:41 PM | Last Updated on Mon, Aug 20 2018 4:42 PM

అందరి బంధువయా - Sakshi

అందరి బంధువయా

పట్నం తీరు గురించి నాంపల్లి స్టేషన్‌కాడ రాజలింగాన్ని అడిగితే.. ఉందామంటే నెలవే లేదు.. చేద్దామంటే కొలువే లేదని గోడు వెళ్లబోసుకుంటాడు.

పట్నం తీరు గురించి నాంపల్లి స్టేషన్‌కాడ రాజలింగాన్ని అడిగితే.. ఉందామంటే నెలవే లేదు.. చేద్దామంటే కొలువే లేదని గోడు వెళ్లబోసుకుంటాడు. కళను నమ్ముకుని కలలు తీర్చుకునే  దారిలో హైదరాబాద్‌కు వచ్చిన కళాకారులను ఇదే ప్రశ్న అడిగి చూడండి.. భాగ్యనగరాన్ని కళల కాణాచిగా అభివర్ణిస్తారు. పొట్టచేత పట్టుకుని ఒట్టి చేతులతో ఇక్కడకు వచ్చే వారిని సైతం ఆదరించే ఈ నగరం.. హస్తకళను పట్టుకుని వచ్చిన వారిని మాత్రం పట్టించుకోకుండా ఉంటుందా..! వారి కళకు సలామ్ చేస్తోంది. కలకాలం నిలిచేలా చేస్తుంది. ఇదే మాటను నొక్కి మరీ చెబుతున్నారు.. పలు రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన కళాకారులు. సిటీ అందరి బంధువని కొనియాడుతున్నారు. హస్తకళను నమ్ముకుని శిల్పారామం వేదికగా ఏళ్లకేళ్లుగా జీవనం సాగిస్తున్న కళాకారుల మనసులో మాట...
 - శిరీష చల్లపల్లి

ఆదరణకు పెట్టనికోట...

మాకు బతుకుదెరువు ఇచ్చింది హైదరాబాదే. 14 ఏళ్లుగా ఈ సిటీనే నమ్ముకుని నా కుటుంబాన్ని పోషిస్తున్నా. మా ఫ్యామిలీ కోల్‌కతాలోనే ఉంటుంది. నేను, మా తమ్ముడు ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నాం. టైట బొమ్మలంటే దేశవ్యాప్తంగా మంచిపేరు ఉంది. హైదరాబాద్‌వాసులు మా బొమ్మలను ఆదరిస్తున్నారు. ఆత్మీయంగా వాళ్ల ఇళ్లలో చోటిస్తున్నారు. వాటిని చూసి బాగున్నాయని పొగుడుతుంటే హ్యాపీగా ఉంటుంది. మా కళను ఆదరిస్తున్న ఈ మహానగరం అంటే మాకెంతో అభిమానం. ఇక్కడ మా స్టాల్ అద్దె ఆరు వేల రూపాయలు. మా ఇంటి అద్దె రెండున్నర వేలు. అన్ని ఖర్చులు పోగా నెలకు రూ.15 వేలు మిగులుతోంది. ఈ మొత్తాన్ని మా ఇంటికి పంపిస్తాం.
 - పింటూ పురమని, కోల్‌కతా
 
బొమ్మల కొలువు  
స్వస్థలం నెల్లూరు జిల్లా కావలి. చదివింది పదో తరగతే. పదేళ్ల కిందట మా ఆయనతో కలసి హైదరాబాద్ వచ్చా. మొదట్లో ప్రింటింగ్, డిజైనింగ్ చేసుకునేవాళ్లం. ఎనిమిదేళ్ల కిందట శిల్పారామంలో వండర్ డాల్స్ పేరుతో సాఫ్ట్ టాయ్స్ స్టాల్ నిర్వహిస్తున్నాం. మా దగ్గర 15 మంది పని చేస్తున్నారు. అందరూ ఆడపిల్లలే. సైడ్ పౌచెస్, టెడ్డీబేర్స్, జంతువులు, పక్షుల బొమ్మలు, ఇంటీరియర్ డెకార్స్, దేవుని ప్రతిమలు ఇలా అనేక రకాల కళాకృతులు తయారు చేస్తున్నాం. మా వ్యాపారం బాగుంది. నగరంలోని మరిన్ని ప్రాంతాల్లో మా ఉత్పత్తులు అమ్ముకునేలా ప్రాంచైజీలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
 - ఇందిర, కావలి
 
బేరాలాడకుంటే...
మాది ఒడిశా. బట్ట ముక్కలతో వాల్ హ్యాంగిగ్స్, కొబ్బరి పీచుతో పిచ్చుక గూడు, జంతువుల బొమ్మలు, అద్దాలతో మోడ్రన్ ఆప్లిక్, బెడ్ కవర్లు... ఇలా రకరకాల గృహాలంకరణ వస్తువులు రూపొందిస్తుంటాం. నాలుగు రోజులు 9 గంటల చొప్పున కుడితే గానీ ఒక బెడ్‌షీట్ పూర్తికాదు. మేం తిన్నా తినకపోయినా.. ఒంట్లో బాగున్నా లేకున్నా.. పని చేయాల్సిందే. 15 ఏళ్లుగా మా కుటుంబాన్ని ఆదరించిన శిల్పారామం, హైదరాబాదీలన్నా మాకు ఎనలేని గౌరవం.  
 - శైలబాల సాహూ, ఒడిశా
 
కశ్మీర్ కీ కథ...
కశ్మీర్ నుంచి బతుకుదెరువు కోసం 11 ఏళ్ల కిందట నగరానికి వచ్చా. మా కశ్మీరీ ప్రొడక్ట్స్‌కు ఇక్కడ ఆదరణ ఎక్కువ. కలప, పేపర్ మేడ్ వస్తువులు, వాల్ హ్యాంగింగ్స్, జ్యువెలరీ బాక్సులు, బ్యాంగిల్స్, బెడ్ ల్యాంప్స్, క్యాండెల్ స్టాండ్స్ ఇలా ఎన్నో చేసి అమ్ముతుంటా. ఒక్క గాజును కశ్మీరీ డిజైన్‌లో తీర్చిదిద్దడానికి 4 గంటలు పడుతుంది. శిల్పారామంలో మా స్టాల్ ఉంది.

కొండాపూర్‌లో
అద్దెకుంటున్నా. నా భార్య, పిల్లలు కశ్మీర్‌లోనే ఉంటున్నారు. మూడు నెలలకోసారి మా ఇంటికి వెళ్లొస్తా. నేను అక్కడికి వెళ్లగానే నా భార్య ఇక్కడికి వస్తుంది. ఇలా కష్టపడితేగానీ పూట గడవదు. మా కష్టాన్ని గుర్తించి మాకు జీవనోపాధి కల్పిస్తున్న హైదరాబాదీలను ఎన్నటికీ మరచిపోలేను.  
 - జావీద్, కశ్మీర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement