'ఎండలు మరెంత భగ్గుమంటాయో' | Heatwaves increse in india; but government has fail to take necessary actions | Sakshi

'ఎండలు మరెంత భగ్గుమంటాయో'

Apr 8 2017 5:28 PM | Updated on Aug 17 2018 5:55 PM

'ఎండలు మరెంత భగ్గుమంటాయో' - Sakshi

'ఎండలు మరెంత భగ్గుమంటాయో'

ఏప్రిల్‌ నెలలో అడుగుపెట్టి పట్టుమని పది రోజులు కూడా కాకముందే దేశవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి.

న్యూఢిల్లీ: ఏప్రిల్‌ నెలలో అడుగుపెట్టి పట్టుమని పది రోజులు కూడా కాకముందే దేశవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ ఇప్పటికే ఎండల తీవ్రత 40 డిగ్రీల సెల్సియస్‌ దాటి పోయింది. మే నెలల్లో ఎండలు మరెంత భగ్గుమంటాయో అన్న ఆందోళన అప్పడే ప్రజలను పిండేస్తోంది. ఎండలు ఎంత ఎక్కువ ఉంటే ఆ తర్వాత అంత ఎక్కువ వర్షాలు పడతాయని ప్రజలు భావిస్తారు. కానీ అది అన్ని కాలాల్లో నిజం కాదు. భారత ప్రభుత్వ వాతావరణ శాఖ ఈ సారి వర్షాలు ఎలా ఉంటాయో ఇప్పటివరకు వెల్లడించలేదు. కానీ సాధారణ వర్షపాతం కన్నా తక్కువగా వర్షాలు కురుస్తాయని  ప్రైవేటు వాతావరణ అధ్యయన సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. 
 
ఇప్పటికే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కరవు పరిస్థితులు తాండివిస్తున్నాయి. రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తమను ఆదుకోవాల్సిందిగా కోరుతూ తమిళనాడు రైతులు కపాలాలతో ఢిల్లీ కపాలం అదిరేలా నిరసన వ్యక్తం చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదు. దేశంలో కరవు పరిస్థితులు నెలకొన్నప్పుడల్లా ఆ నెపాన్ని అనూహ్య వాతావరణ పరిస్థితులపైకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెట్టేస్తున్నాయి. అందుకు భూతాపోన్నతి కారణమంటూ ఓ భూతాన్ని చూపిస్తున్నాయి. భూతాపోన్నతికి ఎవరు కారణం ? మరి భూతాపోన్నతి తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలేమిటీ? భూతాపోన్నతి పెరిగినా కరవు పరిస్థితుల ప్రభావం ఉండకుండా ప్రభుత్వాలు తీసుకుంటున్న ప్రత్యామ్నాయ చర్యలేమిటీ? ఏనాడైనా ఆలోచించాయా?
 
మార్చి 30 నాటి లెక్కల ప్రకారం కేంద్ర జల సంఘం పర్యవేక్షణలో ఉన్న 91 శాతం పెద్ద రిజర్వాయర్లలో నీటి నిల్వలు 52,63,200 కోట్ల క్యూబిక్‌ మీటర్లకు పడిపోయింది. అంటే మొత్తం రిజర్వాయర్ల సామర్థ్యంలో 33 శాతానికి పడిపోయింది. నీటి పొదుపునకు కేంద్ర జల సంఘం ఇప్పటికే అత్యవసర చర్యలు తీసుకోవాలి. అలాంటి సూచనలేవి కనిపించడం లేదు. దేశవ్యాప్తంగా భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో అనేక రాష్ట్రాలు రక్షిత మంచినీటి కోసం తల్లడిల్లి పోతున్నాయి. సమస్య వచ్చే వరకు కదలక పోవడమన్న జాడ్యం పార్టీలకు అతీతంగా ప్రభుత్వాలకు పాకడంతోనే దేశంలో దారుణ పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. 
 
దేశంలో సగానికి సగం జనాభా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నా.. వ్యవసాయ ఉత్పత్తులు జాతీయ స్థూల ఉత్పత్తిలో 12 శాతం మాత్రమే ఉందంటే అది ఎవరిది తప్పు? నీటి పారుదల ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం, తప్పనిసరిగా ప్రతి రైతు భూగర్భ జలాల రక్షణకు చర్యలు తీసుకోవాలనే నిబంధనలు అమలయ్యేలా చూడకపోవడం ప్రభుత్వాల తప్పుకాదా? మొత్తం రైతుల్లో 61 శాతం రైతులు ఇప్పటికీ వర్షాధార పంటలపైనే ఆధారపడడానికి కారణం ఎవరు? అన్న విషయాన్ని ఈ ప్రభుత్వాలు ఒక్కసారైనా ఆలోచిస్తున్నాయా?
 
అళ్వార్‌లోని తరుణ్‌ భారత్‌ సంఘ్, పుణెలోని వాటర్‌షెడ్‌ ఆర్గనైజేషన్‌ ట్రస్ట్, చండీగఢ్‌ శివారులోని సుఖోమజిరి, మహారాష్ట్రలోని రాలేగావ్‌ సిద్ధి ఎన్జీవో సంస్థలు జల వనరుల అభివద్ధికి చర్యలు తీసుకొని ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నా మన పాలకులు మాత్రం నిద్ర లేవరెందుకు? చెట్టూ పుట్ట, చేను పచ్చగా ఉన్నప్పుడే భూతాపోన్నతి తగ్గుతుందని, పర్యవసానంగా ఎండల తీవ్రత ఎక్కువ ఉండదన్న విషయం మన పాలకులకు తెలియదా? కనీసం వచ్చే నెల ప్రజలకు తాగునీటిని అందించి ప్రాణాలను నిలిపేందుకు అహ్మదాబాద్‌ మున్సిపాలిటీని ఆదర్శంగా తీసుకోనైనా అన్ని మున్సిపాలిటీలు సత్వర చర్యలు చేపట్టాలి. 2010 నుంచి 2015 మధ్య అక్కడి స్థానిక ప్రభుత్వం చిత్తశుద్ధితో చేపట్టిన 'అహ్మదాబాద్‌ హీట్‌ యాక్షన్‌ ప్లాన్' వల్ల వేసవి కాలంలో వందల సంఖ్యలో సంభవించే మరణాలు పదుల సంఖ్యకు తగ్గాయి. 2015లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో వేసవి గాలులకు దాదాపు రెండున్నర వేల మంది మరణించడం గమనార్హం. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement