
సాక్షి, ముంబై: భీమా కోరేగావ్ బంద్ మహారాష్ట్రలో ఉద్రిక్తంగా మారింది. ప్రధానంగా ముంబై, థానే, పూణే నగరాల్లో బంద్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. రెండు నగరాల్లోనూ జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఆందోళనకారులు విధ్వంసానికి దిగడంతో ప్రజా రవాణ వ్యవస్థ ఎక్కడిక్కడ ఆగిపోయింది. ముంబై నగరంలో మెట్రో సేవలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. ఇదిలావుండగా థానే నగరంలో 144 సెక్షన్‌ను అధికారులు విధించారు. ప్రస్తుతం పూణేలో మొదలైన దళిత ఉద్యమం మొత్తం మహరాష్ట్ర అంతటా విస్తరించింది. పూణెలో అందోళనకారులు బస్సులకు నిప్పుపెట్టారు. ఆందోళనకారులను నిలవరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పూణే అడిషనల్ కమిషనర్ రవీంద్ర సెంగోన్కర్ తెలిపారు.
భీమా కోరేగావ్ పోరాటానికి 200 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం నిర్వహించిన కార్యక్రమాల్లో హింస చెలరేగింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణిచారు. దీంతో మంగళవారం రాష్ట్రమంతటా నిరసనలు వెల్లువెత్తాయి. హింసాత్మక ఘటనలను నిలువరించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ.. అంబేద్కర్ మనవుడు ప్రకాశ్ అంబేద్కర్ బుధవారం మహారాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు.
బుధవారం బంద్ సందర్భంగా మహారాష్ట్రలో పాఠశాలలు మూసేశారు. ప్రజారవాణ దాదాపు ఆగిపోయింది.
థానేలో ఆందోళనకారులు రైలు సేవలకు ఆటంకం కల్గించేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ అధికారులు అక్కడికి వచ్చి వారిని చెదరగొట్టారు. దీంతో యథావిధంగా రైళ్లు నడుస్తున్నాయి. థానేలో గురువారం అర్ధరాత్రి వరకు 144 సెక్షన్ అమల్లో ఉంచారు. ముంబై నగరంలో బస్సులు, ఆటోలు, ప్రయివేట్ క్యాబ్ సర్వీసులు కూడా నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో బాంబే ఎలక్ట్రిక్ సప్లయి అండ్ ట్రాన్స్‌పోర్ట్ బస్సులు మాత్రం పాక్షికంగా తిరుగుతున్నాయి. దళితలు బలంగా ఉన్న బీడ్, లాతూర్, షోలాపూర్, అహ్మద్ నగర్, నాసిక్ ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. మంగళవారం జరిగిన హింసలో మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన 187 బస్సులు ధ్వంసమయ్యాయి. దీంతో బుధవారం సున్నితమైన ప్రాంతాలకు బస్సు సర్వీసులను అధికారులు నిలిపేశారు.
రాజ్యసభలో వాడివేడి చర్చ
భీమా కోరేగావ్ ఘటనపై రాజ్యసభలో బధవారం అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఈ ఘటనకు బాధ్యులు మీరంటే.. మీరని సభ్యులు అరుచుకున్నారు. దీంతో సభ వరుసగా వాయిదా పడుతూ వచ్చింది. జీరో అవర్‌లోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. సభలో పరిస్థితి ఇలాగే ఉండడంతో ఛైర్మన్ వెంకయ్యనాయుడు రాజ్యసభ ప్రసారాలను నిలిపేశారు.



