ఆసియా క్రీడల్లో భారత బాక్సర్ సరితా దేవి కాంస్య పతక వివాదం ముగిసింది.
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో భారత బాక్సర్ సరితా దేవి కాంస్య పతక వివాదం ముగిసింది. అప్పట్లో పతకం తీసుకునేందుకు నిరాకరించిన సరితా దేవి మనసు మార్చుకుంది. వెనక్కు ఇచ్చేసిన పతకాన్ని సరిత భారత ఒలింపిక్ సంఘం నుంచి మళ్లీ తీసుకుంది.
ఇటీవల జరిగిన ఆసియా గేమ్స్ సందర్భంగా సెమీఫైనల్స్లో వివాదాస్పద రీతిలో ఓడిపోయిన సరితాదేవి కాంస్య పతకం తీసుకునేందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే. పోడియం మీద కన్నీరు మున్నీరుగా విలపిస్తూ.. తన కాంస్య పతకాన్ని తిరిగి ఇచ్చేసింది. సెమీఫైనల్స్లో మ్యాచ్లో జడ్జీలు సరితా దేవి ఓడిపోయినట్టు ప్రకటించడం వివాదాస్పదమైంది. సరిత పతకం వేసుకోడానికి కూడా నిరాకరించి.. దాన్ని రజతపతకం సాధించిన జీనా పార్క్కే ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ సంఘటన చూసి షాకైన జీనా పార్క్.. ఏం చేయాలో తెలియక పోడియం మీదే కాంస్య పతకం వదిలేసి అక్కడినుంచి ఆమె కూడా వెళ్లిపోయింది. దాంతో నిర్వాహకులు కాంస్యపతకాన్ని తమవద్దే ఉంచుకున్నారు. ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాఖ్య భావించింది. ఆ తర్వాత రాజీమార్గంతో వ్యవహరించడం, తాజాగా సరిత పతకం తీసుకోవడంతోఈ వివాదం ముగిసినట్టయ్యింది.