కొత్త పోలీస్స్టేషన్లకు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, ముంబై: రాష్ట్రంలో పెరుగుతున్న వలసలు, జనాభాను దృష్టిలో ఉంచుకుని అదనంగా 120 కొత్త పోలీసులు స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో 64 పోలీసు స్టేషన్ల ఏర్పాటుకు ఇప్పటికే స్థలాలను కూడా ఎంపిక చేసింది. మిగతా వాటి కోసం అధ్యయనం చేస్తున్నారు. నివేదిక రాగానే పోలీసుస్టేషన్ల ఏర్పాటు కార్యక్రమాలు ప్రారంభిస్తారు. రాష్ట్రంలో పారిశ్రామిక వాడలు పెరిగిపోయాయి.
నగరాలు, పట్టణాలు విస్తరించాయి. దీంతో ఉపాధి నిమిత్తం వచ్చే వలస ప్రజల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. పెరిగిన జనాభాను బట్టి శాంతి, భద్రతలు అదుపులో ఉంచడం పోలీసు బలగాలకు ఇబ్బందికరంగా మారింది. రాష్ట్రంలో 10 పోలీసు కమిషనరేట్ కార్యాలయాలు ఉండగా, 35 మంది జిల్లా సూపరింటెండెంట్లు ఉన్నారు. వీరి ఆధీనంలో రాష్ట్ర వ్యాప్తంగా 1,90,035 మంది పోలీసులు, 19 వేల మంది పోలీసు అధికారులు ఉన్నారు. పెరిగిన జనాభా కారణంగా పోలీసులపై అదనపు పని భారం పడుతోంది. ఈ భారాన్ని తగ్గించేందుకు రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లలో 61 వేల పోలీసు పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం మంజూరునిచ్చింది. మొదటి దశలో 13 వేల పోస్టులను భర్తీ చేసే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది.
ఒకపక్క కొత్త పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతుండగానే మరోపక్క పరిధి ఎక్కువగా ఉన్న పోలీసు స్టేషన్లను విడగొట్టి అక్కడ కొత్త పోలీసుస్టేషన్లను ఏర్పాటు చేయనుంది. ఇలా ఐదేళ్ల కాలంలో అదనంగా 120 కొత్త పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని హోం శాఖ ప్రత్యేక కార్యదర్శి వినీత్ అగర్వాల్ చెప్పారు. పోలీసు స్టేషన్ల సంఖ్య పెంచడంవల్ల నేరాలు అదుపులోకి వస్తాయి. అదేవిధంగా పోలీసు స్టేషన్లు సమీపంలో ఉండడంవల్ల అన్ని రకాల నేరాల నమోదు సంఖ్య పెరుగుతుంది. ఐదేళ్ల కాలంలో పోలీసులు, పోలీసు అధికారుల సంఖ్య 2.70 లక్షలకుపైగా చేరుకుంటుంది.
దీంతో దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో అత్యధిక శాతం పోలీసు బలగాలున్నట్లు రికార్డు నమోదు కానుందని అగర్వాల్ అన్నారు. కొత్త పోలీసులు విధుల్లోకి రావడంవల్ల అదనపు పని వేళలు తగ్గి పోలీసులకు పని ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో పోలీసులు నేరాలు అదుపుచేయడంలో సఫలీకృతులవుతారని అగర్వాల్ అభిప్రాయపడ్డారు.