
గతేడాది నవరాత్రి-దసరా కాలంతో పోలిస్తే ఈసారి పాలిష్ చేసిన వజ్రాల ధరలు గణనీయంగా 35 శాతం తగ్గాయి. కొన్ని కేటగిరీలకు చెందిన వజ్రాల ధరలు 2004లో ఉన్న ధరలతో సమానమయ్యాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, యుఎస్, చైనాలో నెలకొంటున్న ఆర్థిక మాంద్యంతోపాటు ల్యాబ్‌లో తయారుచేసిన వజ్రాలకు పెరుగుతున్న ఆదరణ వల్ల ధరలు క్షీణిస్తున్నట్లు సమాచారం.
పాలిష్ చేసే వజ్రాల్లో ప్రపంచంలోనే 90 శాతం భారత్‌లోనే తయారవుతాయి. అయితే ధరలు తగ్గడంతో కంపెనీలు దేశీయ మార్కెట్‌లో తక్కువ ధరలకు విక్రయించాలని చూస్తున్నాయి. డైమండ్ ధరలు తగ్గడం వల్ల దేశంలోని స్టోర్‌ల్లో దసరా సందర్భంగా 20 శాతం అమ్మకాలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. దేశీయ మార్కెట్‌లో ముడి వజ్రాల ధరలు కూడా తగ్గడం ప్రారంభించాయని, దాంతో పాలిష్ చేసిన వజ్రాల ధరలు మరింత తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. గత మూడు నెలలుగా పాలిష్ చేసిన వజ్రాల కొనుగోలుదారుగా ఉన్న యూఎస్‌లో డిమాండ్ తగ్గడంతో కూడా వజ్రాలు సరసంగా లభిస్తున్నాయి.