
భారతీయ రైల్వే వివిధ తరగతుల్లోని ప్రయాణీకులకు లగేజీ నిబంధనలను సవరించింది. ఇవి ఏప్రిల్ 1, 2025 నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రయాణీకులను నియంత్రించడం, భద్రతను మెరుగుపరచడం, రైలులో స్థలాన్ని సమర్థవంతంగా ఉపయోగించేలా చూడటం దీని లక్ష్యమని అధికారులు తెలిపారు. మారిన నిబంధనల ప్రకారం ప్రయాణికులు ఎంత లగేజీని తీసుకెళ్లాలి..ఎలాంటి వస్తువులను తీసుకెళ్లాలో కింద తెలుసుకుందాం.
ఎంత లగేజీని తీసుకెళ్లాలి?
కొత్త మార్గదర్శకాల ప్రకారం ఫస్ట్ క్లాస్ ఏసీలో ప్రయాణించే ప్రయాణికులు అదనపు ఛార్జీలు లేకుండా 70 కిలోల లగేజీని తీసుకెళ్లడానికి అనుమతి ఉంది.
సెకండ్ క్లాస్ ఏసీలో ప్రయాణించే వారు 50 కిలోల వరకు తీసుకెళ్లవచ్చు.
స్లీపర్ క్లాస్ ప్రయాణికులకు ఉచిత అలవెన్స్‌లో భాగంగా 40 కిలోలను అనుమతిస్తారు.
సెకండ్ క్లాస్ నాన్ ఏసీకి ఉచిత లగేజీ పరిమితిని 35 కిలోలుగా నిర్ణయించారు.
ప్రయాణికులు రైల్వే అనుమతించిన బరువు కంటే అధికంగా లగేజీ తీసుకెళ్తే అదనపు ఛార్జీలు చెల్లించాల్సిందే. లగేజీ బరువుగా లేదా భారీగా ఉంటే దానిని కంపార్ట్‌మెంట్‌లోకి అనుమతించరు. బదులుగా ప్రత్యేక లగేజీ వ్యాన్‌లో తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ పరిమాణానికి సంబంధించి కూడా రైల్వే స్పష్టమైన వివరాలు వెల్లడించింది.
లగేజీ కొలతలు ఇలా..
లగేజీకి గరిష్టంగా అనుమతించిన కొలత (పొడవు + వెడల్పు +ఎత్తు) 160 సెం.మీ (62 అంగుళాలు) మించకూడదు. కెమెరాలు, గొడుగులు లేదా బ్రీఫ్‌కేస్ వంటి వ్యక్తిగత వస్తువులకు 185 సెం.మీ (72 అంగుళాలు) వరకు పరిమితి విధించారు. అలా ఉంటేనే లగేజీని సీట్ల కింద లేదా ఓవర్ హెడ్ ర్యాక్‌ల్లో సరిగ్గా స్టోర్ చేయవచ్చని రైల్వే తెలిపింది. రైలు దిగిన తర్వాత కూడా నిర్దిష్ట పరిమాణంలో లగేజీ ఉంటే నడక మార్గాల్లో ఇబ్బంది ఉండదని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: యాపిల్‌కు టారిఫ్‌ల దెబ్బ.. ధరల పెంపునకు అవకాశం
నిషేధిత వస్తువులు
రైలు బోగీల్లో తీసుకెళ్లలేని నిషేధిత వస్తువులపై కూడా ప్రయాణికులు అవగాహన కలిగి ఉండాలి. పేలుడు, మండే స్వభావం ఉన్న పదార్థాలు, తుపాకులు, లీకైన ద్రవాలు, ప్రమాదకరమైన లేదా అభ్యంతరకరమైన వస్తువులను తీసుకెళ్లడం నిషేధించారు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానా లేదా రైలు నుంచి వెంటనే తొలగించవచ్చు. లగేజీ ప్యాకింగ్ చేయడానికి ముందు ప్రయాణికులందరూ అధికారిక వెబ్‌సైట్‌ను తనిఖీ చేయాలని లేదా స్టేషన్ అధికారులను సంప్రదించాలని భారతీయ రైల్వే సూచించింది.