స్పెక్ట్రమ్‌ షేరింగ్‌ వివరాలు ఇవ్వండి | Supreme Court Asks Telecom Department About Spectrum Sharing In AGR Case | Sakshi

స్పెక్ట్రమ్‌ షేరింగ్‌ వివరాలు ఇవ్వండి

Aug 22 2020 4:48 AM | Updated on Aug 22 2020 4:48 AM

 Supreme Court Asks Telecom Department About Spectrum Sharing In AGR Case - Sakshi

న్యూఢిల్లీ: టెలికం కంపెనీలకు సంబంధించి సవరించిన స్థూల ఆదాయాల (ఏజీఆర్‌) కేసు విచారణ ఈ నెల 24కు వాయిదా పడింది. దివాలా ప్రక్రియకు వెళ్లిన టెలికం కంపెనీలకు సంబంధించి స్పెక్ట్రమ్‌ పంపిణీ వివరాలను (షేరింగ్‌) ఇవ్వాలని శుక్రవారం నాటి విచారణ సందర్భంగా టెలికం శాఖను సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది.

దివాలా ప్రక్రియలో ఉన్న రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌కామ్‌) రిలయన్స్‌ జియో మధ్య స్పెక్ట్రమ్‌ పంపకం జరగ్గా.. ఆర్‌ కామ్‌ స్పెక్ట్రమ్‌ ను వాడుకున్నందుకు, ఆ కంపెనీ స్పెక్ట్రమ్‌ బకాయిలను జియో ఎందుకు చెల్లించకూడదంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం లోగడ విచారణలో ప్రశ్నించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆర్‌ కామ్‌ తోపాటు, వీడియోకాన్‌ దివాలా చర్యలను ఎదుర్కొంటున్న విషయం గమనార్హం.

‘‘వీడియోకాన్‌ స్పెక్ట్రమ్‌ బదలాయించాలంటే, దాని కంటే ముందు గత బకాయిలను కంపెనీ చెల్లించాలి’’ అంటూ వీడియోకాన్‌ విషయమై ధర్మాసనం పేర్కొంది. ఒకవేళ వీడియోకాన్‌ చెల్లించకపోతే, ఆ స్పెక్ట్రమ్‌ ను సొంతం చేసుకున్న భారతీ ఎయిర్‌ టెల్‌ చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దీనికి  వీడియోకాన్‌ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. కార్పొరేట్‌ దివాలా చర్యల ప్రక్రియకు వెలుపల తాము ఎటువంటి బకాయిలను చెల్లించాల్సిన బాధ్యత కలిగిలేమని నివేదించారు.

ఏజీఆర్‌ బకాయిలను ఐబీసీ కింద నిర్వహణ బకాయిలుగా పరిష్కరించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆర్‌ కామ్‌ స్పెక్ట్రమ్‌ ను జియో వినియోగించుకున్నందున ఆ మొత్తానికి సంబంధించి జియో చెల్లించాల్సిన బకాయిల వివరాలను అడిగినా ఇవ్వలేదేమంటూ ధర్మాసనం టెలికం శాఖను ప్రశ్నించింది.

అనంతరం దివాలా చర్యల పరిధిలో ఉన్న కంపెనీల స్పెక్ట్రమ్‌ పంపిణీకి సంబంధించి ఎంత మేర బకాయిలు రావాలన్న వివరాలను సమర్పించాలని టెలికం శాఖను ఆదేశించింది. 1999 నుంచి ఏ కంపెనీలు స్పెక్ట్రమ్‌ ను వినియోగించుకున్నదీ, వాటి మధ్య వాణిజ్య ఒప్పంద వివరాలను తమ  ముందుంచాలని ధర్మాసనం కోరింది.  ఏజీఆర్‌ బకాయిలను ఏటా కొంత చొప్పున కొన్నేళ్ల పాటు చెల్లించేందుకు అనుమతించాలని భారతీ ఎయిర్‌ టెల్, వొడాఫోన్‌ ఐడియాలు ధర్మాసనాన్ని అభ్యర్థించాయి.

ఈ రెండు కంపెనీలు కలసి రూ.లక్ష కోట్లకు పైగా ఏజీఆర్‌ బకాయిలను చెల్లించాల్సి ఉంది. టెలికం శాఖ డిమాండ్‌ ప్రకారం వొడాఫోన్‌ ఐడియా రూ.58,000 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉండగా, కేవలం రూ.8,000 కోట్లను ఇప్పటి వరకు జమ చేయగలిగింది. భారతీ ఎయిర్‌ టెల్‌ రూ.43,000 కోట్ల బకాయిలకు గాను రూ.18,000 కోట్లను చెల్లించింది. జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా అధ్యక్షతన గల సుప్రీం ధర్మాసనం ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement