
సాధారణంగా మేకప్ ప్రక్రియ సమయంతో కూడిన పని. తీరా క్రీమ్స్, పౌండేషన్స్ ఇలా ఒక దాని తర్వాత ఒకటి అప్లై చేసుకున్నాక, ఆ మేకప్ కాస్త ఎక్కువైనా, తక్కువైనా సరి చేసుకోవడం ఇంకాస్త పెద్ద పని. అలాంటి సమస్యలను దూరం చేస్తుంది ఈ పరికరం. ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే కనిపించిన ఈ వినూత్న పరికరాలు ఇప్పుడు నిజంగానే వినియోగంలోకి వచ్చేశాయి. కేవలం కొన్ని క్షణాల్లోనే ఈ పరికరాలు ముఖాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నాయి.
చిత్రంలోని ‘టెంప్ట్ యూ 2.0’ ఎయిర్ బ్రష్ మేకప్ సిస్టమ్‌లో ఎయిర్ కంప్రెసర్, ఎయిర్ బ్రష్ ఉంటాయి. కంప్రెసర్ గాలిని ఉత్పత్తి చేస్తుంది. ఎయిర్ బ్రష్‌తో మేకప్ లిక్విడ్స్‌ను సన్నని పొరగా చర్మంపై స్ప్రే చేస్తుంది. ఎయిర్‌పాడ్‌లో మేకప్ లిక్విడ్ నింపుకోవాలి. కంప్రెసర్ గాలితో అప్లై చేసుకునే మేకప్, చర్మంపై సమానంగా పడుతుంది.
ఈ మెషిన్‌తో మేకప్ వేసుకుంటే తక్కువ కాస్మెటిక్స్‌తో ఎక్కువ కవరేజ్ ఉంటుంది. ఇది మేకప్‌ని వేగంగా వేయడంతో పాటు, ఎక్కువ సమయం చెక్కుచెదరకుండా ఉంచుతుంది. ఇది ఇంట్లోను, సెలూన్స్‌లోను ఎక్కడైనా వాడుకునేందుకు అనుకూలమైనదే! ఈ ‘టెంప్ట్ యూ’ ఎయిర్‌బ్రష్ మేకప్ సిస్టమ్, సాంప్రదాయ మేకప్ పద్ధతులకు ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం.
రెప్పల సోయగం
అందమైన మోముకి వాలు కనులు మరింత సొగసునిస్తాయి. అందుకే చాలా మంది ఆర్టిఫిషియల్ ఐలాష్‌లను అతికించుకుంటూ మురిసిపోతుంటారు. ఇప్పుడు అలాంటి అవసరం లేదంటోంది బ్యూటీ ప్రపంచం. కనురెప్పల వెంట్రుకలు శాశ్వతంగా పొడవుగా పెరిగేందుకు ‘ఐలాష్ ట్రాన్స్‌ప్లాంట్’ అందుబాటులోకి వచ్చింది. అయితే, ఇది నిపుణులతో మాత్రమే చేయించుకోవలసిన శస్త్రచికిత్స పద్ధతి.
ఈ చికిత్సలో తల వెనుక భాగం నుంచి వెంట్రుక కుదుళ్లను తీసి, కనురెప్పల మీద అమర్చుతారు. ఆ తర్వాత ఈ వెంట్రుకలు సహజంగా పెరుగుతాయి, రాలుతాయి. కాబట్టి వాటిని క్రమం తప్పకుండా కత్తిరించుకోవాల్సి ఉంటుంది. ఇది ఇతర తాత్కాలిక పద్ధతుల కంటే ఎక్కువ కాలం నిలుస్తుంది.
(చదవండి: చల్లచల్లగా వేడితాక'కుండ'..!)