చైనాతో సంబంధాలు ముఖ్యమైనవి: ప్రధాని మోదీ | PM modi says ties with China important need to address border tensions | Sakshi
Sakshi News home page

చైనాతో సంబంధాలు ముఖ్యమైనవి: ప్రధాని మోదీ

Apr 11 2024 8:35 AM | Updated on Apr 11 2024 12:25 PM

PM modi says ties with China important need to address border tensions - Sakshi

న్యూఢిల్లీ:భారత్‌, చైనా దేశాల మధ్య స్థిరమైన, శాంతియుత సంబంధాలు నెలకొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. భారత్‌, చైనా మధ్య శాంతి ఇరు దేశాలకే కాక మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ముఖ్యమైనదని మోదీ అన్నారు. ప్రధాని మోదీ బుధవారం మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌-చైనా సరిహద్దు వివాదం వెంటనే కొలిక్కి రావాలన్నారు.

‘భారత్‌కు చైనాతో  సంబంధాలు చాలా ముఖ్యమైనవే కాక ప్రాధాన్యతో కూడినవి.  ఈ నేపథ్యంలోనే ఇరుదేశాలు ద్వైపాక్షిక పరస్పర చర్చల  ద్వారా సరిహద్దు ఉద్రిక్త పరిస్థితులను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. స్థిరమైన, శాంతియుత సంబంధాలు నెలకొనటం ఇరు దేశాలకు చాలా అవసరం. ఇరు దేశాల మధ్య శాంతి ప్రపంచానికి సైతం ప్రాధాన్యత కలిగిన అంశం. ఇరు దేశాల మధ్య సానుకూల దౌత్య, మిలిటరీ స్థాయి ద్వైపాక్షిక చర్చల జరుగుతాయని ఆశిస్తున్నా. మేము(భారత్‌, చైనా దేశాలు) సరిహద్దుల్లో శాంతి పునరుద్ధరించి, కొనసాగించగలం’ అని ప్రధాని మోదీ వివరించారు. 

జూన్‌, 2020లో తూర్పు లడఖ్‌లోని గాల్వాన్ వ్యాలీ వద్ద చోటు చేసుకున్న ఘర్షణల నుంచి  భారత్‌, చైనా మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో అనేక సార్లు దౌత్య, ఉన్నతస్థాయి చర్చలు జరిగాయి. భారత్‌, చైనా సరిహద్దుల్లో శాంతి పునరుద్ధరించడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. అయితే చైనా మాత్రం తరచూ ఏదో ఒక సరిహద్దు విషయంలో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉంటుంది. ఇటీవల అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలో సుమారు 30 ప్రాంతాల పేర్లు మార్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారాన్ని భారత్‌ తీవ్రంగా ఖండించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement