
చండీగఢ్: పంజాబ్‌లోని ఖానౌరీ బోర్డర్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లెవాల్ ఆరోగ్యం క్షీణించింది. మరోవైపు కేంద్రం పంజాబ్ రైతుల డిమాండ్లపై చర్చించేందుకు ముందుకు వచ్చింది. ఈ నేపధ్యంలో జగ్జీత్ సింగ్ దల్లెవాల్ వైద్య సహాయం తీసుకునేందుకు అంగీకరించారు. అయితే తాను ఆమరణ నిరాహార దీక్ష విరమించబోనని ప్రకటించారు. ఈ విషయాన్ని రైతు నేత సుఖ్జీత్ సింగ్ హర్డోజండే మీడియాకు తెలిపారు. ఆయన మాట్లాడుతూ నవంబర్ 26 నుండి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన దల్లెవాల్ ఆరోగ్యం క్షీణించిన నేపధ్యంలో ఆయన వైద్య సహాయం తీసుకునేందుకు అంగీకరించారని తెలిపారు.
రైతు నేత దల్లెవాల్ ఆమరణ నిరాహార దీక్ష(Hunger strike) 54వ రోజుకు చేరుకుందని, రైతులకు పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)పై చట్టపరమైన హామీ లభించేంత వరకు జగ్జీత్ సింగ్ నిరవధిక నిరాహార దీక్షను విరమించబోనని స్పష్టం చేశారన్నారు. ఉపవాస దీక్ష సమయంలో అతని ఆరోగ్యం క్షీణించిందని, దాదాపు 20 కిలోగ్రాముల బరువు తగ్గారని, ఈ నేపధ్యంలో వైద్య సహాయాన్ని తీసుకునేందుకు ముందుకు వచ్చారని జండే తెలియజేశారు.
మరోవైపు జగ్జీత్ సింగ్ దల్లెవాల్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు. అయితే తొలుత ఆయన వైద్య సహాయం తీసుకునేందుకు నిరాకరించారు. తాజాగా జాయింట్ సెక్రటరీ ప్రియా రంజన్(Joint Secretary Priya Ranjan) నేతృత్వంలోని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారుల ప్రతినిధి బృందం దల్లెవాల్‌ను కలుసుకుని, యునైటెడ్ కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా ప్రతినిధులతో సమావేశం నిర్వహించింది. ఇదే సమయంలో ఖనౌరి సరిహద్దు వద్ద మరో 10 మంది రైతులు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. దీంతో మొత్తం నిరాహార దీక్ష చేస్తున్న రైతుల సంఖ్య 121కి చేరింది.
ఫిబ్రవరి 14న చండీగఢ్(Chandigarh)లో పంజాబ్ రైతుల సమావేశమయ్యేందుకు కేంద్ర ప్రభుత్వం పిలుపునివ్వడంతో దల్లెవాల్ వైద్య సహాయం తీసుకునేందుకు అంగీకరించారు. పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంపై చట్టపరమైన హామీని డిమాండ్ చేస్తున్న ఆందోళనకారులతో కేంద్రం తిరిగి చర్చలు జరపనుంది. దీంతో ఈ పంజాబ్ రైతుల సమస్యలపై ప్రతిష్టంభన తొలగిపోనున్నదని రైతులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Jammu and Kashmir: వణికిస్తున్న అంతుచిక్కని వ్యాధి.. 15 మంది మృతి